తగ్గిన దిగుబడులు- దిగజారిన ధరలు

ABN , First Publish Date - 2022-01-03T06:54:40+05:30 IST

మాగాణి రైతులు ఈ ఏడాది నష్టాలు చవిచూస్తున్నారు. పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడం, గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో అన్నదాతలు అల్లాడుతున్నారు.

తగ్గిన దిగుబడులు- దిగజారిన ధరలు
మాగాణి భూముల్లో వరిగడ్డి కళ్లాలు చేస్తున్న రైతులు

దర్శి, జనవరి 2 : మాగాణి రైతులు ఈ ఏడాది నష్టాలు చవిచూస్తున్నారు. పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడం, గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. ఈ ఏడాది వరి సాగుకు అడుగడుగునా ఆటంకాలొచ్చాయి. రైతులూ ఇబ్బందులు పడ్డారు. సాగర్‌ జలాలు విడుదల చేసినప్పటికీ వరిపైరు సాగు చేసుకోవద్దని అధికారులు సూచించడంతో చాలా మంది రైతులు మాగాణిలో వరిసాగు చేయలేదు. దీంతో ఈ ఏడాది కూడా  వరిసాగు గణనీయంగా తగ్గింది. దర్శి ఎన్‌ఎస్‌పీ డివిజన్‌ పరిధిలో 99వేల ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఏటా అందులో 55వేల ఎకరాల్లో వరిసాగు, 40 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది కేవలం 30 వేల ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేశారు. చాలా చోట్ల మాగాణి భూములు బీడుగా మిగిలిపోయాయి. వరిసాగు చేసిన రైతులు కూడా పంట సక్రమంగా పండక నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం సాగర్‌ ఆయకట్టు భూముల్లో సాగు చేసిన వరిపంట కోతకోసి కుప్పలు నూరుస్తున్నారు. ఎకరాకు 25 నుండి 30 బస్తాలు లోపు మాత్రమే దిగుబడి వస్తోంది. దీంతో మార్కెట్‌లో బస్తా ధాన్యాన్ని రూ.1000 కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది పెట్టుబడి రూ.35 వేల నుంచి రూ.40వేల వరకు చేరింది. దీంతో రైతులు ఆరుగాలం కష్టించిన శ్రమ వృథాగా పోగా ఇంకా రూ.10వేలు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. దీంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. 

దయనీయంగా కౌలు రైతుల పరిస్థితి

కౌలురైతుల పరిస్థితి ఈ ఏడాది దయనీయంగా మారింది. ఆరంభం నుంచి మాగాణి భూమిని కౌలుకు తీసుకునేందుకు రైతులు జంకుతూనే ఉన్నారు. చివరిలో కొందరు రైతులు ఎకరాకు 5 బస్తాలు నుంచి 10 బస్తాల వరకు కౌలు ఇచ్చేలా ఒప్పందంతో సాగు చేశారు. ఈ ఏడాది పెట్టుబడులు అధికం కావడంతో పాటు ధాన్యం ధరలు దిగజారడంతో కౌలు రైతులు రూ.20 వేలు నష్టపోవాల్సి వస్తోంది. దీంతో పండించిన ధాన్యం పెట్టుబడులకు కూడా సరిపోవడం లేదు. అప్పులు తెచ్చి కౌలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో కౌలు రైతులు అల్లాడుతున్నారు. మాగాణి భూముల్లో వరిపైరు సాగు చేసేందుకు ఇప్పటికే జంకుతున్న రైతులు ఈ ఏడాది నష్టాలను చూసి భవిష్యత్తులో వరిసాగు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడులు కూడా రావడం లేదు

ఈ ఏడాది వరిపంట సాగు చేసిన రైతులకు పెట్టుబడులు కూడా రావడం లేదు. మూడు ఎకరాల వరిపంట సాగు చేశాను. ఎకరాకు రూ.28 బస్తాల మాత్రమే దిగుబడి వస్తోంది. పెట్టుబడులు ఎకరాకు రూ.40వేలు ఖర్చు  అయ్యింది. దీంతో ఆరుగాలం కష్టించి పంట పండించిన ఫలితం దక్కక నష్టాలు చవిచూడాల్సి వస్తోంది.

గుర్రం బాలకృష్ణ, రైతు, త్రిపుర సుందరీపురం


Read more