పింఛన్‌లో కోత!

ABN , First Publish Date - 2022-10-03T05:38:31+05:30 IST

పేదల సంక్షేమమే ధ్యేయమంటూ ప్రభుత్వం బాకా ఊదుతోంది. అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది. కానీ తెరవెనుక మాత్రం ఎప్పటికప్పుడు కొత్తకొత్త నిబంధనలను తెచ్చి ఎక్కడికక్కడ కోతలు పెడుతోంది. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆసరాగా ఉండే పింఛన్‌లనూ అర్ధంతరంగా నిలిపివేస్తోంది.

పింఛన్‌లో కోత!

యూజర్‌ చార్జీలు,

పన్నులకు జమ

ఒక్కొక్కరికి రూ.500 తగ్గించి 

ఇస్తున్న వలంటీర్లు

ప్రభుత్వ ఒత్తిడే కారణం

లబోదిబోమంటున్న లబ్ధిదారులు

అధికారులకు ఫిర్యాదులు 


ఒంగోలు నగరం, అక్టోబరు 2 :


సంక్షేమ పథకాల్లో కోతల పర్వం కొనసాగిస్తున్న సర్కారు ఇప్పుడు సరికొత్త చర్యకు దిగింది. పింఛన్‌ లబ్ధిదారులకు ఇచ్చే సొమ్ములో కత్తెర పెడుతోంది. నెలనెలా కొంత మొత్తాన్ని పన్నుల పేరుతో గుంజుకుంటోంది. జిల్లావ్యాప్తంగా శనివారం నుంచి పింఛన్‌ల పంపిణీ ప్రారంభం కాగా కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన దానిలో రూ.500 కోతపెట్టి మిగిలినది మాత్రమే వలంటీర్లు వారికి చెల్లించారు. ఇదేమని ప్రశ్నిస్తే యూజర్‌ చార్జీలు, చెత్త పన్ను కింద జమ చేసుకున్నామని సమాధానం ఇచ్చారు. అధికారుల ఆదేశాల మేరకే తాము నడుచుకుంటున్నామని చెప్పారు.  దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నారంటూ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. 


 పేదల సంక్షేమమే ధ్యేయమంటూ ప్రభుత్వం బాకా ఊదుతోంది. అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది. కానీ తెరవెనుక మాత్రం ఎప్పటికప్పుడు కొత్తకొత్త నిబంధనలను తెచ్చి ఎక్కడికక్కడ కోతలు పెడుతోంది. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆసరాగా ఉండే పింఛన్‌లనూ అర్ధంతరంగా నిలిపివేస్తోంది. ఇప్పటికే వివిధ కారణాలతో వేలాది మందికి పింఛన్‌లు ఆపివేసింది. అదిచాలదన్నట్లు ఇప్పుడు వారికి ఆసరాగా ఉండే పింఛన్‌ సొమ్ములో కొంత లాగేసుకునే ప్రక్రియను దొడ్డిదారిన చేపట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు ప్రస్తుతం చేపట్టిన పింఛన్‌ల పంపిణీలో వలంటీర్లు వ్యవహరిస్తున్న తీరు ఊతం ఇస్తోంది. 


పింఛన్‌ సొమ్ములో కొంత పన్నుకు జమ

జిల్లాలో పింఛన్‌ల పంపిణీ శనివారం నుంచి ప్రారంభించారు. కొన్ని చోట్ల లబ్ధిదారులకు మొత్తం పింఛన్‌ సొమ్ము అందజేయకుండా రూ.500లు తగ్గించి ఇచ్చారు. ఇదేమిటని వారు ప్రశ్నిస్తే మీరు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన యూజర్‌ చార్జీలు, చెత్త పన్ను చెల్లించటం లేదు. అధికారుల ఆదేశాల మేరకే మేము తగ్గించి ఇస్తున్నామంటూ వలంటీర్లు సమాధానం చెప్పారు. ‘మా సొమ్ము మా కివ్వండి.. మహాప్రభో’ అని పింఛన్‌దారులు బతిమాలుకున్నా వలంటీర్లు వినకుండా బలవంతంగా రూ.500 కట్‌ చేసుకుని మిగిలిన సొమ్ము పంపిణీ చేశారు. ఒంగోలు శివారులోని పొనుగుపాటి కాలనీ, బలరాం కాలనీల్లో వలంటీర్లు ఇలా రూ.500 తగ్గించి పంపిణీ చేశారు. దివ్యాంగులకు రూ.3 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.2500, వృద్ధులు, వితంతువులకు రూ.2500  ఇ వ్వాల్సి ఉండగా రూ.2 వేలు మాత్రమే ఇచ్చారు. ఇలా జిల్లాలోని మరికొన్ని చోట్ల కూడా జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఇలా వ్యవహరించడం వెనుక పన్నుల వసూలుకు ప్రభుత్వం నుంచి పెరిగిన ఒత్తిడే కారణంగా కనిపిస్తోంది. 


కమిషనర్‌కు ఫిర్యాదు 

దివ్యాంగులు కొంత మంది పింఛన్‌ సొమ్ము తగ్గించి ఇవ్వడాన్ని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆనాల సురేష్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. పింఛన్‌ సొమ్మును పన్నులకు జమ చేసుకోవడాన్ని సచివాలయ సిబ్బంది, మున్సిపల్‌ అధికారులు తొలుత సమర్థించుకున్నారు. తగ్గించి ఇస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై వారు  పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత  విచారణకు ఆదేశించారు. 

పింఛన్‌ సొమ్ము మొత్తం ఇవ్వాల్సిందే..

వరప్రసాద్‌, వైఎస్సార్‌కేపీ ఏపీవో

పింఛన్‌ సొమ్ము మొత్తం లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిందే. కొంత ఆపేసి పంపిణీ చేస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. బల్లికురవ మండలంలో వెల్పేర్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేశాం. ఒంగోలు నగరంలో తగ్గించి పంపిణీ చేసిన విషయమై విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతాం.


Read more