జగనన్న కాలనీలో తేలని పట్టాల లెక్క

ABN , First Publish Date - 2022-05-30T07:16:23+05:30 IST

పేద ప్రజలకు ఇచ్చిన పట్టాలతో ప్రభుత్వం పరిహాసం ఆడుతోంది..! ప్లాట్‌ నంబర్లు లేకుండా పట్టాల పంపిణీ, ఒకే నంబరు ఇద్దరికి ఇవ్వడం, అసలు లేక్కే తేలకుండా పట్టాలు మాయం చేయడం వంటి చిత్రవిచిత్రాలు ఎర్రగొండపాలెం సమీపంలో మిల్లంపల్లి టోల్‌ప్లాజా వద్ద జగనన్న కాలనీలో జరిగాయి.

జగనన్న కాలనీలో తేలని పట్టాల లెక్క
జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న గృహం

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు

నకిలీ పట్టాలతో విక్రయాలు

ఎర్రగొండపాలెం, మే 29 : పేద ప్రజలకు ఇచ్చిన పట్టాలతో ప్రభుత్వం పరిహాసం ఆడుతోంది..! ప్లాట్‌ నంబర్లు లేకుండా పట్టాల పంపిణీ, ఒకే నంబరు ఇద్దరికి ఇవ్వడం, అసలు లేక్కే తేలకుండా పట్టాలు మాయం చేయడం వంటి చిత్రవిచిత్రాలు ఎర్రగొండపాలెం సమీపంలో మిల్లంపల్లి టోల్‌ప్లాజా వద్ద జగనన్న కాలనీలో జరిగాయి. 

మండలంలోని మిల్లంపల్లిలో సర్వే నంబరు 430/7లో  50 ఎకరాల ప్రభుత్వభూమిలో జగనన్న కాలనీ కోసం 1316 మందికి పట్టా నంబర్లుతో లే అవుట్‌ను వేశారు. దీంతో పాటు అదనంగా భవిష్యత్‌ అవసరాల కోసం 84 పట్టాలు మంజూరయ్యాయి. ఆ మేరకు జిల్లా కలెక్టరు నుంచి మంజూరు ఉత్తర్వులు పొందారు. అయితే పూర్తిస్థాయిలో పట్టాలు మంజూరు చేయకపోవడంతో అర్హుత ఉన్న లబ్ధిదారులు కూడా వారి పట్టా, స్థలం కోసం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మొత్తం 1316 పట్టాల్లో 1240 పట్టాలు వీఆర్‌వోల ద్వారా లబ్ధిదారులకు అందజేసినట్లు గత తహసీల్దార్‌ ఇటీవల ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా వివరించారు. ఇక వీఆర్‌వోలు మాత్రం తమ వద్దకు మొత్తం 1057 పట్టాలే వచ్చాయని వాటిని లబ్ధిదారులకు ఇచ్చామని పేర్కొంటున్నారు. దీంతో  మొత్తం 259 పట్టాలు రెవెన్యూ అధికారుల వద్దే మాయం అయ్యాయి. ఇక అధికారులు పంపిణీ చేసిన 1057 పట్టాల్లో కూడా ఒకే నంబరుతో ఇద్దరిద్దరికి పట్టాలు ఇచ్చారు. ఇలాంటి వారు 34 మంది ఉన్నట్లు ఇటీవల అధికారుల విచారణలో తేలింది. ఇక అసలు పట్టా నంబరే లేకుండా మరికొంత మందికి ఇంటిస్థలం పట్టాలు ఇచ్చారు. ఇలాంటి వారెందరున్నారనేది ఇప్పటికీ అధికారుల వద్ద లెక్కలేదు. వారు మాత్రం తమ పట్టాలతో తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమకు పట్టా నంబరు కేటాయించి స్థలం చూపించాలని కోరుతున్నారు.

ఇవి ఉదాహరణలు..

ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఓ  మహిళకు పీఆర్‌కే (ఇంటి పట్టాకు అర్హత ఉన్నట్లు రూపొందించిన జాబితా)లో నంబరు 00048852 ఉంది. అయితే ఈమెకు ఇంత వరకు పట్టాలు మంజూరు చేయలేదు. పొజేషన్‌ చూపలేదు. 

 అంబేద్కర్‌నగర్‌ చెందిన అడిపి భారతమ్మ,  ఎర్రగొండపాలెం పట్టణానికి చెందిన షేక్‌ మస్తాన్‌బీలు పీఆర్‌కే నంబర్లు ఉన్నాయి. కానీ వీరికి పట్టాలు రాలేదు. దీంతో  ఈనెల 5 వతేది స్పెషల్‌ కలెక్టరుకు వినతిపత్రాలు ఇచ్చారు. 

 నటుకుల సునీత అనే  మహిళకు  పట్టా నంబరు లేకుండా తహసీల్దారు సంతకంలో ఖాళీ పట్టా పంపిణీ చేశారు. ఇలా మరికొంత మంది కూడా ఖాళీ పట్టాలు పొందారు. వీరికి పొజేషన్‌ ఇప్పటి వరకు తెలియరాలేదు.

ఫ ఇప్పటికే కొంత మంది బినామీ పేర్లతో పట్టాలు పొందారు. వాటిని  అప్పుడే  విక్రయుస్తున్నారు. పట్టాల పంపిణీ సమయంలో ఒక్కోక్క పట్టాకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం.  పట్టాలు పంపిణీలో జరిగిన అవకతవకలపై ఈ నెల 5వ తేదీన స్పెషల్‌ కలెక్టరు ఎం.శ్రీ దేవి జరిపిన విచారణ 10 మంది లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. పట్టాలు గల్లంతుపై వచ్చిన ఫిర్యాదులపై ఈ నెల 18న సర్వేయర్లు, వీఆర్వోల బృందంతో జగనన్న కాలనీలో లే-అవుట్‌ ప్రకా రం లభ్దిదారులు ఉన్నారా లేదా అని తనిఖీ చేయించారు. అయినప్పటికీ, పూర్తిస్థాయిలో ఫలితం మాత్రం రాలేదు.

విచారిస్తున్నాం :  అశోక్‌కుమార్‌రెడ్డి, తహసీల్దారు

 పట్టాలు పంపిణీ సమయంలో పూర్వపు తహసీల్దారు ఉన్నారు. ఆ సమయంలో వచ్చిన ఫిర్యాదులపై స్పెషల్‌ డిప్యూటి కలెక్టరు ఆదేశాల మేరకు పట్టాలు, లే-అవుట్‌ అన్ని సమగ్రంగా పరిశీలిస్తున్నాం.

Read more