Darsi YCP: వైసీపీలో వింత గొడవ వెలుగులోకి.. గృహ ప్రవేశాల తర్వాత బయటపడిన అసలు విషయం..

ABN , First Publish Date - 2022-08-20T23:08:23+05:30 IST

దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలు మధ్య ఆధిపత్య పోరు తారాస్ధాయికి చేరింది. ఇరువురు నేతలు ప్రత్యక్షం గానే..

Darsi YCP: వైసీపీలో వింత గొడవ వెలుగులోకి.. గృహ ప్రవేశాల తర్వాత బయటపడిన అసలు విషయం..

దర్శి వైసీపీలో ఢీ అంటే ఢీ!

దూకుడు పెంచిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

ఎమ్మెల్యే లేకుండా కార్యకర్తల సమావేశం పెట్టిన బూచేపల్లి

బూచేపల్లి గృహ ప్రవేశంకు వెళ్లిన నేతలను దూరంగా పెడుతున్న ఎమ్మెల్యే


దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలు మధ్య ఆధిపత్య పోరు తారాస్ధాయికి చేరింది. ఇరువురు నేతలు ప్రత్యక్షం గానే ఢీ అంటే ఢీ అంటున్నారు. చివరకు కిందిస్ధాయి కేడర్‌ను అటో ఇటో తేల్చుకోండి అనే స్ధాయిలో ఇరువురి పోకడ ఉంది. ఇద్దరు నేతల స్వగృహ ప్రారంభోత్సవ కార్యక్రమాలు వైసీపీ కేడర్‌లో ముఖ్యంగా ఆ రెండు సామాజికవర్గాల నాయకుల మధ్య పెరిగిన దూరాన్ని స్పష్టం చేసింది. తాజాగా సీఎం జగన్‌ చీమకుర్తి కార్యక్రమ ఏర్పాట్లు పేరుతో శివప్రసాద్‌రెడ్డి ఆయన తల్లి జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించేశారు. చివరకు ఎమ్మెల్యే కూడా అన్నిటికీ సిద్ధమైనట్లుగా బూచేపల్లి గృహప్రవేశానికి వెళ్లిన కొందరు ముఖ్య నాయకులను పక్కన పెట్టడం ప్రారంభించారు. దీంతో ఇద్దరు నాయకులు తదనుగుణంగా కిందిస్థాయి నాయకులు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకునే స్థాయికి పరిస్థితి వెళ్లిందంటే అతిశయోక్తి కాదు.


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

దర్శిలో ఆధిపత్యం కోసం పోటీపడుతున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో సొంతిళ్లు కట్టడంలో, వాటి ప్రారంభోత్సవాల్లోను పోటీపడిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి తోడు బూచేపల్లి ఆహ్వానం మేరకు సీఎం చీమకుర్తి రానుండటం బూచేపల్లి వర్గంలో ఊపును పెంచింది. మరోవైపు మద్దిశెట్టి కూడా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సహజంగా సొంత పార్టీలో గాని, ప్రత్యర్థి పార్టీలో ఉన్న నాయకుల్లో రాజకీయంగా మనస్పర్థలు ఉన్నా వారి కుటుంబాల్లో జరిగే కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానించటం, ఎదుటి వారు వెళ్లటం జరుగుతుంది. కానీ గతేడాదిగా దర్శిలో మద్దిశెట్టి, బూచేపల్లి మాత్రం ఆ విధంగా వ్యవహరించటం లేదు. ఎమ్మెల్యే మద్దిశెట్టి గృహప్రవేశానికి వెంకాయమ్మ కాని శివప్రసాద్‌రెడ్డి గాని హాజరుకాలేదు. ఇటు బూచేపల్లి గృహప్రవేశానికి మద్దిశెట్టి గాని ఆయన సోదరులు కాని రాలేదు. పైగా రాష్ట్ర నాయకులు రాకపోకల్లో కూడా వ్యత్యాసం కనిపించింది. జిల్లాలోని ఉన్నతాధికారులు ఈ తలనొప్పి మనకెందుకులే అని రెండుచోట్లకు వెళ్లలేదు. అలాగే కొందరు వైసీపీ నేతలు కూడా అదే పంధా అనుసరించారు.సామాజికవర్గాల వారీగా..

మద్దిశెట్టి గృహప్రవేశానికి ముఖ్యఅతిధిగా వారి సామాజికవర్గానికి చెందిన విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. బూచేపల్లి గృహప్రవేశానికి మాజీమంత్రి, పార్టీ నేత బాలినేనితో పాటు జగన్‌ ప్రత్యేకంగా ప్రోత్సహించే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరుకావటం విశేషం. కారణాలు ఏమైనా బూచేపల్లి కార్యక్రమంలోనే ముఖ్య నాయకులు, అధికారులు ఎక్కువగా కనపడ్డారు. ఎమ్మెల్యే గృహప్రవేశానికి వెళ్లలేకపోయిన బాలినేని ఆ తర్వాత వెళ్లి వచ్చేందుకు ప్రయత్నించగా తాను అందుబాటులో లేనని మద్దిశెట్టి చెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా ఈ రెండు  కార్యక్రమాలను పరిశీలిస్తే వైసీపీలోని కాపులు ఎమ్మెల్యే గృహప్రవేశ కార్యక్రమంలో, రెడ్లు అత్యధికులు బూచేపల్లి గృహ ప్రవేశ కార్యక్రమలో కనిపించారు. 


కలిసొచ్చిన సీఎం రాక

కాగా ఇదే సమయంలో బూచేపల్లి ఆహ్వానం మేరకు సీఎం జగన్‌ 24న చీమకుర్తి రానుండటం ఆయనకు కలిసొచ్చింది. అయితే చీమకుర్తి ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలో ఉండగా దర్శిలో బూచేపల్లి కార్యకర్తల సమావేశం నిర్వహించటం విశేషం. రెండు రోజుల క్రితం దర్శిలోని ఆయన కొత్త గృహంలో బూచేపల్లి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యేకు ఈ సమావేశం సమాచారం తెలుసో లేదో కూడా తెలియదు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మ్మెల్యే, ఇన్‌చార్జులదే పూర్తి అధికారం అనేది వైసీపీ విధానం. అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా బూచేపల్లి సమావేశం నిర్వహించటం అందునా చీమకుర్తిలో జరిగే సీఎం సభను జయప్రదం చేయమని కోరడం విశేషం. తద్వారా అటు దర్శిలో ఇటు చీమకుర్తి ప్రాంతంలో బూచేపల్లి కుటుంబం పట్టు నిరూపించుకునే లక్ష్యంతో ఆయన ఉన్నట్లు తేటతెల్లమైంది. ఇది పార్టీ నిబంధలనకు విరుద్ధమని ఎమ్మెల్యే ఇప్పటికే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అంతేకాక బూచేపల్లి వర్గీయులను దెబ్బతీసే ఎత్తుగడలకు కూడా ఆయన సిద్దమయ్యారు. 


ఎంపీపీ, జడ్పీటీసీ 

శుక్రవారం కురిచేడు మండలం కల్లూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ఎంపీపీ, జడ్పీటీసీలు ఇద్దరూ గైర్హజరయ్యారు. రెడ్డి సాయాజికవర్గానికి చెందిన జడ్పీటీసీ తొలి నుంచి బూచేపల్లి వర్గీయుడే. అయితే ఎమ్మెల్యే మద్దిశెట్టి సామాజికవర్గానికి చెందిన ఎంపీపీ కూడా రాకపోవటం విశేషం ఎంపీపీ కోటేశ్వరమ్మ, ఆమె పక్షాన రాజకీయం చేసే చంద్రశేఖర్‌రావులు ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారు. నిన్న మొన్నటివరకు ఎమ్మెల్యే తోటి ఉన్నవారు బూచేపల్లి గృహప్రవేశానికి హాజరవ్వటం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ విషయంపై ఎమ్మెల్యే కూడా ఎంపీపీని పార్టీ నాయకుడు చంద్రశేఖర్‌రావును మందలించటమే కాక దూరంగా ఉండమని పరోక్షంగా సంకేతాలు పంపినట్లు తెలిసింది. అలాగే వారికి గడపగడపకు సమాచారం ఇవ్వలేదంటున్నారు. ఇటు బూచేపల్లి కూడా జనసమీకరణ పేరుతో ఏర్పాటుచేసే సమావేశాలకు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా బూచేపల్లితో సన్నిహితంగా ఉండేవారికి చెక్‌ పెడుతున్న సంకేతాన్ని మద్దిశెట్టి ఇచ్చేశారు. దీంతో ఇటు మద్దిశెట్టి అటు బూచేపల్లి రాజకీయంగా ఢీ అంటే ఢీ అనుకునేందుకు సిద్ధమైనట్లు తేటతెల్లమవుతుంది.

Read more