శనగ రైతులకు నష్టపరిహారం అందించాలి

ABN , First Publish Date - 2022-01-28T05:30:00+05:30 IST

కిలీ విత్తనాల కారణంగా పంట దిగుబడి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పిల్లి తిప్పారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

శనగ రైతులకు నష్టపరిహారం అందించాలి
శనగ పంట పరిశీలిస్తున్న రైతు నాయకులు

ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు తిప్పారెడ్డి

కనిగిరి, జనవరి 28: నకిలీ విత్తనాల కారణంగా పంట దిగుబడి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పిల్లి తిప్పారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని చాకిరాలలో ఆర్‌బీకేల ద్వారా పంపిణీ చేసిన నకిలీ శనగ విత్తనాలను ఉపయోగించి సాగుచేసి నష్టపోయిన పంట పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. చాకిరాల ఆర్‌బీకే నుంచి 96 క్వింటాళ్ల శనగ విత్తనాలు రైతులకు పంపిణీ చేశారని తెలిపారు. ఈ విత్తనాలు కర్నూలుకు చెందిన బాలాజీ సీడ్‌ కంపెనీ నుంచి సరఫరా చేశారని చెప్పారు. ఈ విత్తనాలు సాగుచేసిన పంట పొలాలు పూత, పిందె కూడా రాకపోవడంతో రైతులు ఎకరాకు రూ. 25వేలు చొప్పున నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలాజీ సీడ్‌ విత్తనాలు కాకుండా ఇతర కంపెనీల విత్తనాలను ఉపయోగించిన పంట పొలాలు మాత్రం దిగుబడి బాగా వచ్చే పరిస్థితి ఉందన్నారు. సంబంధిత వ్యవసాయాధికారులు తక్షణమే స్పందించి నష్టం వివరాలను నమోదుచేసి ఉన్నతాధికారులకు పంపించి రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. నష్టపరిహారం అందించక పోతే రైతులతో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆయన వెంట రైతుసంఘం నాయకులు కంది రామయ్య, సూరసాని మోహన్‌రావు, కంది బ్రహ్మయ్య, కుందురు మాలకొండయ్య, నరాల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. 

Read more