కమిషనర్‌ వర్సెస్‌ కౌన్సిలర్లు

ABN , First Publish Date - 2022-11-02T23:20:57+05:30 IST

దర్శి నగర పంచాయతీలో కౌన్సిలర్లు, నగర పంచాయతీ కమిషనర్‌ మధ్య వివాదం ముదురుతోంది. కొంతకాలంగా పాలకవర్గం, అధికారుల మధ్య సయోధ్య లేకపోవటం, తరచూ విమర్శలు చేసుకోవటం పరిపాటిగా మారింది. ఈ వివాదం ముదిరి చివరకు వైసీపీ, టీడీపీలకు చెందిన కౌన్సిలర్లు ఉమ్మడిగా కలిసి కమిషనర్‌పై ధ్వజమెత్తడం చర్చనీయాంశమైంది. ఈ వివాదాల వల్ల పట్టణ అభివృద్ధి నిలిచిపోతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

కమిషనర్‌  వర్సెస్‌  కౌన్సిలర్లు
దర్శి నగర పంచాయతీ కార్యాలయం

దర్శి నగర పంచాయతీలో ముదురుతున్న వివాదం

అభివృద్ధి నిలిచిపోతుందని ప్రజల ఆందోళన

దర్శి, నవంబరు 2 : దర్శి నగర పంచాయతీలో కౌన్సిలర్లు, నగర పంచాయతీ కమిషనర్‌ మధ్య వివాదం ముదురుతోంది. కొంతకాలంగా పాలకవర్గం, అధికారుల మధ్య సయోధ్య లేకపోవటం, తరచూ విమర్శలు చేసుకోవటం పరిపాటిగా మారింది. ఈ వివాదం ముదిరి చివరకు వైసీపీ, టీడీపీలకు చెందిన కౌన్సిలర్లు ఉమ్మడిగా కలిసి కమిషనర్‌పై ధ్వజమెత్తడం చర్చనీయాంశమైంది. ఈ వివాదాల వల్ల పట్టణ అభివృద్ధి నిలిచిపోతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

మొదట్లో వైసీపీకి అనుకూలంగానే...

తొలుత అధికార వైసీపీకి చెందిన నాయకులే కమిషనర్‌ను ఇక్కడకు బదిలీ చేయించినట్లు సమాచారం. కొంతకాలం వైసీపీకి చెందిన కౌన్సిలర్లు కమిషనర్‌తో సయోధ్యతో మెలిగారు. ఆ సమయంలో అభివృద్ధి పనుల కేటాయింపులో కమిషనర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు పలు సమావేశాల్లో ధ్వజమెత్తారు. కొన్నిరోజులు మధ్యమార్గంగా పనులు నడిచాయి. కొద్ది రోజుల నుంచి వైసీపీ కౌన్సిలర్ల తీరులో మార్పు వచ్చింది. కమిషనర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన కౌన్సిలర్ల సమావేశంలో పలువురు వైసీపీ సభ్యులు కమిషనర్‌ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ సభ్యులు కూడా అదేవిధంగా కమిషనర్‌ను దుయ్యబట్టారు. ఇరుపార్టీలకు చెందిన కౌన్సిలర్లు సేవ్‌ నగర పంచాయతీ అంటూ కార్యాలయం ఎదుట ఆందోళన చేయటం తీవ్ర చర్చకు దారితీసింది.

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు

వైసీపీ కౌన్సిలర్లు ప్రధానంగా నగర పంచాయతీలో అక్రమ ని ర్మాణాలపై, అక్రమ లేఅవుట్లపై, చేపలచెరువు పాట విషయంపై పలు ఆరోపణలు చేశారు. పట్టణంలో అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ కమిషనర్‌, సిబ్బంది ముడుపులు తీసుకొని మిన్నకుంటున్నారని విమర్శలు గుప్పించారు. అక్రమ లేఅవుట్లు విచ్చలవిడిగా వేస్తున్నప్పటికీ వారితో లాలూచీపడి సహకరిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఈ విషయాపలై గత ఏడాదిగా చర్చ జరుగుతూనే ఉంది. ప్రధానంగా షాపింగ్‌ కాంప్లెక్సులు, భవనాలు నిబంఽధలకు విరుద్ధంగా నిర్మిస్తున్న విషయం వాస్తవమే. వీటిని నిలుపుదల చేయాలని కొద్ది నెలల క్రితం నగర పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కాంప్లెక్స్‌లు, భవనాల నిర్మాణదారులు కొంతకాలం పనులు ఆపి మళ్లీ నిర్మాణాలు ఆరంభించారు. అక్రమ లేఅవుట్లలో నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. రెండు లేఅవుట్లల్లో అక్రమంగా నిర్మించిన మురుగుకాల్వలు, ప్రహరీలు తొలగించారు. ఆ తర్వాత ఏం జరిగిందో కాని అక్రమ లేఅవుట్లలో యథాతథంగా నిర్మాణాలు మొదలయ్యాయి. పనిలోపనిగా నిబంఽధలకు విరుద్ధంగాలేఅవుట్లు వెలుస్తున్నాయి.

కొంతమంది కీలక నాయకులకు అధికారులకు ముడుపులు చెల్లించటం వలనే యథాతథంగా మళ్లీ అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలు కొనసాగుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీకి చెందిన కౌన్సిలర్లు ఉమ్మడిగా అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తడంతో అసలు ఏం జరిగిందనే విషయంపై చర్చ నడుస్తోంది. కోమటికుంట చాపలచెరువు పాట విషయంలో అధికారులు సరిగా స్పందించపోవటంతో నిర్వాహకులు కిస్తీ కట్టకుండా చేపలు పట్టుకున్నారనే విమర్శలున్నాయి. జరుగుతున్న అక్రమాలకు కేవలం అధికారులనే బాధ్యులను చేస్తూ కౌన్సిలర్లు ధ్వజమెత్తడంతో ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారనే విమర్శలు కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కౌన్సిలర్లు చెప్పిన నిబంధనలకు విరుద్ధమైన పనులు చేయకపోవటం వలనే తమపై నిరాధారమైన విమర్శలు చేస్తున్నారని కమిషనర్‌ చెబుతున్నారు. ఇంతకాలం తమ వద్ద ఏదో ఆశించిన కౌన్సిలర్లు తాము నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నందున ఇలా వ్యవహరిస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాల్లో ఎవరిపాత్ర ఎమిటి, అసలు జరిగిన వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2022-11-02T23:21:04+05:30 IST