అండర్‌ పాస్‌ దారి మూసివేత

ABN , First Publish Date - 2022-09-12T04:28:05+05:30 IST

దాదాపు రెండు సంవత్సరాల క్రితం దొనకొండలోని రెండు వైపులా రైల్వే గేట్లను రైల్వే అధికారులు తొలగించి అండర్‌పాస్‌ వంతెనల నిర్మాణం చేపట్టారు.

అండర్‌ పాస్‌ దారి మూసివేత
రాకపోకలు జరగకుండా మూసేసిన దొనకొండలోని అండర్‌ పాస్‌ రహదారి

ప్రజలకు రవాణా కష్టాలు

వెంటనే పనులు పూర్తి చేయాలి 

రైల్వే అధికారులకు విజ్ఞప్తి

చుట్టూ మూడు కిలోమీటర్లు  తిరిగి రాకపోకలు 

దొనకొండ, సెప్టెంబరు 11 : దాదాపు రెండు సంవత్సరాల క్రితం దొనకొండలోని రెండు వైపులా రైల్వే గేట్లను రైల్వే అధికారులు తొలగించి అండర్‌పాస్‌ వంతెనల నిర్మాణం చేపట్టారు. ఒకవైపు నిర్మాణ పనులు అసంపూర్తిగా చేపట్టి రాకపోకలు జరిగేలా వదిలేశారు. దీంతో వర్షం కురిస్తే చాలు అండర్‌పాస్‌ రహదారిలో మోకాళ్లలోతు నీళ్లు నిలుస్తుండడంతో రెండేళ్లుగా ప్రజలు రవాణా కష్టాలను పడుతున్నారు. వర్షం నీళ్లు తగ్గిపోయాక తిరిగి రాకపోకలు జరుపుకోవడం ప్రజలకు పరిపాటిగా మారింది. దొనకొండ, బాదాపురం, రామిరెడ్డిపల్లి, పోలేపల్లి తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలకు, రైల్వేట్రాక్‌ అవతలివైపున ఉన్న పోస్టాపీస్‌, పోలీస్‌స్టేషన్‌, కెనరాబ్యాంకు, ప్రభుత్వ ఆరోగ్యకేంద్రం, పలు వ్యాపార దుకాణాలకు వెళ్లేందుకు అండర్‌పాస్‌ రహదారి దిక్కు. ప్రస్తుతం రైల్వే అధికారులు పని జరుగుతుందంటూ వారం రోజుల క్రితం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. రైలు కమ్మెలతో రాకపోకలు జరగకుండా మూసివేశారు. వారం రోజులైనా ఎటువంటి పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు చుట్టూ తిరిగి రాకపోకలు  చేస్తూ ప్రయాసకు గురవుతున్నారు. ఈ రహదారి పూర్తవుతుందా లేదా శాశ్వతంగా మూసేస్తారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.  ప్రజల రాకపోకలకు ఎంతో ప్రాముఖ్యమైన ఈ అండర్‌పాస్‌ రహదారి నిర్మాణ పనులను పూర్తి చేయకుండా కనీసం అక్కడ ప్రతామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రైల్వే అధికారులు అకస్మాత్తుగా రహదారిని మూసివేశారని ప్రజలు విమర్శిస్తున్నారు. దీంతో రైల్వే ట్రాక్‌కు ఇవతలివైపున ఉన్న ఒబ్బాపురం, గుట్టమీదపల్లి తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం అవతలివైపునకు వెళ్లేందుకు వాహనాలపై వెళ్లే వారు చుట్టూ మూడు కిలోమీటర్లు తిరిగి నడిచి వెళ్లేవారు. ప్రమాదమైనా మూడులైన్ల రైలు పట్టాలు దాటుకుంటూ ఇబ్బందులు పడుతూ రాకపోకలు  చేసే పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నా రు. ఇప్పటికైనా రైల్వే అధికారులు పట్టించుకొని అండర్‌పాస్‌ రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని, అప్పటి వరకు ప్రత్యాయ్నాయంగా రాకపోకల నిమిత్తం గతంలో మాదిరి రైలు పట్టాలపై గేటును ఏర్పాటు చేసి రవాణా కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.  


Read more