రెప్పపాటు.. మృత్యుకాటు

ABN , First Publish Date - 2022-12-10T00:13:44+05:30 IST

కారు డ్రైవర్‌ నిద్రమత్తు ముగ్గురి ప్రాణాలను బలిగొంది. వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటన రుద్రసముద్రం సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. ముండ్లమూరు మండలం పులిపాడుకు చెందిన మహేంద్రకుమారి ఆమె ఏడాది కుమార్తె నవ్య, బంధువు రామలక్ష్మమ్మ(70)తో కలిసి పెద్దారవీడు మండలం శివాపురంలో గురువారం జరిగిన తన సోదరుడి గృహప్రవేశానికి హాజరయ్యారు.

రెప్పపాటు..  మృత్యుకాటు

బైకిస్టుతోపాటు, మరో ఇద్దరి మృతి

నలుగురికి తీవ్ర గాయాలు

రుద్రసముద్రం వద్ద దుర్ఘటన

దొనకొండ, డిసెంబరు 9 : కారు డ్రైవర్‌ నిద్రమత్తు ముగ్గురి ప్రాణాలను బలిగొంది. వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటన రుద్రసముద్రం సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. ముండ్లమూరు మండలం పులిపాడుకు చెందిన మహేంద్రకుమారి ఆమె ఏడాది కుమార్తె నవ్య, బంధువు రామలక్ష్మమ్మ(70)తో కలిసి పెద్దారవీడు మండలం శివాపురంలో గురువారం జరిగిన తన సోదరుడి గృహప్రవేశానికి హాజరయ్యారు. రాత్రికి సమీప గ్రామమైన దేవరాజుగట్టులో తిరునాళ్లకు వెళ్లారు. శుక్రవారం తిరిగి స్వగ్రామానికి కారులో బయల్దేరారు. ఆ సమయంలో మహేద్రకుమారి తమ్ముడు పిల్లలైన మెట్టు సంతోష్‌ (13), మెట్టు పవన్‌ కూడా మేనత్తతోపాటు కారులో ఎక్కారు. అదేసమయంలో మార్కాపురం మండలం దరిమడుగు బీసీ గురుకుల పాఠశాలలో లైబ్రేరియన్‌గా (కాంట్రాక్టు) పనిచేస్తున్న దర్శి మండలం చందలూరుకు చెందిన శెట్టినేని నరేంద్ర (28) విధుల నిమిత్తం మోటారు సైకిల్‌పై బయల్దేరాడు. రుద్రసముద్రం సమీపంలోకి వచ్చే సరికి నరేంద్ర ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపక్కన ఉన్న గుంతలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మోటారు సైక్లిస్టు నరేంద్రతోపాటు కారులో ఉన్న మెట్టు సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన రామలక్ష్మను 108లో మార్కాపురం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. డ్రైవర్‌ నాగేశ్వరరెడ్డి, మహేంద్రకుమారి, ఆమె ఏడాది కుమార్తెతోపాటు పవన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పవన్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. కనిగిరి సీఐ పాపారావు, కురిచేడు, త్రిపురాంతకం ఎస్సైలు దేవకుమార్‌, వెంకటసైదులు, దొనకొండ ఏఎస్సై కె.శ్రీనివాసరావు, పోలీస్‌ సిబ్బంది సంఘటన ప్రదేశంకు చేరుకొని సంఘటన జరిగిన తీరును పరిశీలించి మృతదేహలను పోస్టుమార్టమ్‌ నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతిచెందిన మోటార్‌ సైకిలిస్టు నరేంద్ర అన్న కోటేశ్వరరావు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం రాత్రి తిరునాళ్లకు హాజరైన కారు డైవర్‌ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

రుద్రసముద్రం రహదారిలో ఆర్తనాదాలు

ప్రమాదం జరిగిన వెంటనే సమీప పొలాల్లో పనులు చేస్తున్న కొందరు గుర్తించి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బోల్తాకొట్టిన కారులో చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్న క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం రుద్రసముద్రం, దొనకొండ గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మృతుల బంధువులు, గ్రామస్థులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు.

శోకసంద్రంలో నరేంద్ర కుటుంబం

దర్శి మండలం చందలూరు గ్రామానికి చెందిన శెట్టినేని నరేంద్ర ఎల్‌ఐసీ ఏజెంట్‌ ఉంటూ దరిమడుగు బిసీ గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నారు. అక్కడే గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. పని మీద గురువారం స్వగ్రామం వచ్చాడు. తిరిగి విధులకు హజరయ్యేందుకు శుక్రవారం ఉదయం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. నరేంద్రకు బంధువుల అమ్మాయితో వివాహం చేయాలని కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన మృతి చెందాడు. చేతికి అందివచ్చిన కొడుకు అర్ధంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు అంతులేని శోకంలో మునిగిపోయారు.

Updated Date - 2022-12-10T00:13:47+05:30 IST