రవాణా శాఖకు గుది‘బండ’

ABN , First Publish Date - 2022-09-26T04:42:12+05:30 IST

గ్రానైట్‌ క్వారీలు, అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన వాహనాల యజమానులు రవాణాశాఖకు చెల్లించాల్సిన పన్ను విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లైఫ్‌ ట్యాక్స్‌, క్వార్టర్‌ ట్యాక్స్‌ కట్టకుండా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను వినియోగిస్తున్నారు.

రవాణా శాఖకు గుది‘బండ’
క్వారీల్లో గ్రానైట్‌ను తవ్వుతున్న ఎక్స్‌కవేటర్లు

పన్నులు చెల్లించని గ్రానైట్‌ 

వాహనాల యజమానులు


నిబంధనలకు విరుద్ధంగా 

2000 వాహనాలు

రూ.15కోట్ల బకాయిలు 

కొన్నేళ్లుగా పట్టించుకోని అధికారులు 

ఉన్నతాధికారుల ఆదేశాలతో

ఇప్పుడు వసూలుకు చర్యలు

కేసుల నమోదుకు నిర్ణయం 

 ఒంగోలు (క్రైం), సెప్టెంబరు 25 : 


గ్రానైట్‌ క్వారీలు, అనుబంధ పరిశ్రమల్లో వినియోగించే వాహనాల పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఇవి రవాణాశాఖకు గుదిబండగా మారాయి. వాహనాల యజమానులు లైఫ్‌ ట్యాక్స్‌, క్వార్టర్‌ ట్యాక్స్‌ చెల్లించకుండానే వాటిని నడుపుతున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 2000 వాహనాలకు సంబంధించి రూ.15కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఇప్పటి వరకూ రవాణాశాఖ అధికారులు వీటి గురించి పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు కూడా ఇందుకు కారణమయ్యాయి. ఇప్పడు ఉన్నతాధికారుల ఆదేశాలతో కదిలారు. వాహన యజమానుల సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌లు పంపడంతోపాటు, ప్రత్యక్షంగా వారిని కలిసి బకాయిల విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నెలాఖరుకు చెల్లించని వారిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. అందుకోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 


గ్రానైట్‌ క్వారీలు, అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన వాహనాల యజమానులు రవాణాశాఖకు చెల్లించాల్సిన పన్ను విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లైఫ్‌ ట్యాక్స్‌, క్వార్టర్‌ ట్యాక్స్‌ కట్టకుండా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను వినియోగిస్తున్నారు. వారికి ప్రజాప్రతినిధులు వత్తాసు పలుకుతుండటంతో రవాణా శాఖ అధికారులు కూడా మిన్నకుండిపోతున్నారు. దీంతో కొన్నేళ్లుగా పన్నులు పేరుకుపోయాయి. ఒక్క గ్రానైట్‌ రంగంలో ఉన్న వాహనాలకు సంబంధించి రూ.15కోట్ల వరకూ బకాయిలు ఉన్నాయి. 


2000 వాహనాలకు పన్నులు చెల్లించని వైనం

గ్రానైట్‌ క్వారీల్లో రాయి వెలికితీత, అనుబంధ పరిశ్రమల్లో వివిధ పనుల కోసం వేలాది వాహనాలను వినియోగిస్తున్నారు. చీమకుర్తి వద్ద ఉన్న క్వారీలు, గుళ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో ఉన్న గ్రానైట్‌ పరిశ్రమల్లో ఎక్కువ వాహనాలు ఉన్నాయి. అక్కడ వినియోగించే క్రేన్‌లు, బూమర్లు, టిప్పర్లు తదితరాలకు లైఫ్‌ ట్యాక్స్‌, క్యార్టర్‌ ట్యాక్స్‌ కట్టడం లేదు. జిల్లాలో చీమకుర్తి గ్రానైట్‌, గుళ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లలో ఏళ్ల తరబడి పన్నులు చెల్లంచని వాహనాలు సుమారు రెండువేల వరకూ ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. వీటిలో అధికారులు 700 నుంచి 800 వరకూ పన్నులు చెల్లించకుండానే కాలం చెల్లిన వాహనాల జాబితాలో చేర్చారు. మరో 1200 వరకూ ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయి. 


ఏళ్లుగా లైఫ్‌ట్యాక్స్‌ చెల్లించని వైనం

గ్రానైట్‌ క్వారీల్లో ఉపయోగించే డంపర్‌లు, క్రేన్‌లు, లోడర్‌లు, బూమర్‌లు  తదితర వాహనాలకు 2010కి ముందు లైఫ్‌ ట్యాక్స్‌ లేదు. 2010 ఫిబ్రవరిలో వీటికి కూడా చెల్లించాలని ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చింది. ఆప్రకారం వాహనం మొత్తం ధరలో 7.5శాతం లైఫ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. కానీ వాటి యజమానులు దాని గురించి పట్టించుకోకుండా ఈ వాహనాలను వినియోగించి క్వారీల్లో పనులు చేస్తున్నారు. ఇవన్నీ రోడ్లమీదకు రావు. క్వారీల్లోనే ఉంటాయి. రవాణాశాఖ అధికారులు క్వారీల్లోకి వెళ్లి తనిఖీలు నిర్వహించి వీటిని గుర్తించాలి. కానీ వారి నుంచి అలాంటి చర్యలు మృగ్యమవడం ఆరోపణలకు ఆస్కారం ఇస్తోంది. 


ప్రజాప్రతినిధుల జోక్యం

బకాయిల వసూలుకు రవాణా శాఖ అధికారులు కదిలితే వారిపై ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఇంతకాలం మిన్నకుండిపోయారు. దీంతో   యజమానులు పన్నులు చెల్లించకుండా వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే ఏటికేడు పన్నుల బకాయిలు పెరిగిపోతుండటంతో ఉన్నతాధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈఏడాది జిల్లాలో వాహనాలకు సంబంధించి క్వార్టర్‌ ట్యాక్స్‌, లైఫ్‌ ట్యాక్స్‌, ఫీజు, సర్వీసు చార్జీలు, జరిమానాలు తదితరాలు కలిపి రూ.240 కోట్లు వసూలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఈఆర్థిక సంవత్సరంలో ఆగస్టు ఆఖరు వరకూ రూ.68.56లక్షలు వసూలైంది. సెప్టెంబరు లెక్కల ప్రకారం గ్రానైట్‌ ఫ్యాక్టరీల్లో వినియోగించే వాహనాల పన్ను బకాయిలు రూ. 15 కోట్ల వరకూ ఉన్నాయి.   


ఇప్పుడు మేలుకున్న రవాణా శాఖ అధికారులు 

ఇటీవల రవాణాశాఖ ఉన్నతాధికారుల నుంచి బకాయిల వసూలుకు ఆదేశాలు వచ్చాయి.  వచ్చే నెల నుంచి క్వారీలలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని వారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకూ పెద్దగా పట్టించుకోని రవాణా శాఖ అధికారులు ఇప్పుడు మేలుకున్నారు. బకాయిలను రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. వాహన యజమానుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపుతున్నారు. ఈనెలాఖరులోపు బకాయిలు చెల్లించకపోతే కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈనెలాఖరులోపు బకాయిలు కట్టని వారి నుంచి ఇప్పటి వరకూ చెల్లించాల్సిన పన్నుకు మూడు రెట్లు అదనంగా వసూలు చేయనున్నారు. 


పన్నులు చెల్లించని వారిపై కేసులు 

 డీటీసీ శ్రీకృష్ణవేణి

గ్రానైట్‌రంగంలో వినియోగిస్తున్న వాహనాలయు సంబంధించిన యజమానులు ఏళ్ల తరబడి పన్నులు చెల్లించకుండా వాటిని తిప్పుతున్నారు. ఇప్పటికే సుమారు రూ.15 కోట్ల వరకూ రావాల్సి ఉంది. వాహనాల పన్ను బకాయిలు ఉన్న వారు ఈ నెలాఖరులోపు చెల్లించాలి. వచ్చేనెల నుంచి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతాం. పన్నులు చెల్లించని వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తాం. 

 


Read more