వినాయకచవితికి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-08-31T05:50:54+05:30 IST

: పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలను వినియోగిం చాలని బీఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు పీవీ.కృష్ణారావు తెలిపారు.

వినాయకచవితికి ఏర్పాట్లు
మట్టిప్రతిమలు అందజేస్తున్న కృష్ణారావు

మార్కాపురం(వన్‌టౌన్‌), ఆగస్టు 30 : పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలను వినియోగిం చాలని బీఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు పీవీ.కృష్ణారావు తెలిపారు. స్థానిక కొండేపల్లి రోడ్డులో సుమారు 1000 మట్టి గణపతి విగ్రహాలను మంగళవారం ఆయన ఉచితంగా పంపిణీ చేశారు. నెహ్రూ బజార్‌లో బీజేపీ నాయకులు పి.రామచంద్ర, ఎస్‌.సరోజిని ఉచిత మట్టి విగ్రహాలు అందజేశారు. గాంధీ బజార్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ బాలమురళీకృష్ణ ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ బి.శేషయ్య, కౌన్సి లర్లు బి.నాగేశ్వరరావు, సి.హెచ్‌.చంద్ర పాల్గొన్నారు.

కొమరోలు : ప్రజలు వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఎస్‌బీఎన్‌ఆర్‌ఎం పాఠశాల కరస్పాండెంట్‌ బందుగుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక  ఎస్‌బీఎన్‌ఆర్‌ఎం ఎయిడెడ్‌ పాఠశాల ఆవరణతో మట్టివినాయకుల ప్రతిమలను పాఠశాల విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కరస్పాం డెంట్‌ బందుగుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజలు రంగులు వేసిన వినాయకుని ప్రతిమలకు ఇచ్చిన ప్రాధాన్యత మట్టి వినాయకుల ప్రతిమలకు ఇవ్వడం లేదన్నారు. వేలకు వేలు ఖర్చుపెట్టి రసాయనాలు పూసిన వినాయకుని ప్రతిమలను వాడి వాగులు, చెరువుల్లో నింపుతున్నారు. దీంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతిం టోందన్నారు. కావున ప్రజలు మట్టి వినాయకులనే పూజించాలన్నారు. కార్యాక్రమంలో ప్రధానోపాధ్యాయులు రేవతి, నారాయణరెడ్డి, సుబ్బారెడ్డిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గిద్దలూరు టౌన్‌ : పట్టణంలోని జువ్విళ్లబావి వినాయకస్వామి దేవస్థానంలో ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ ప్రతినిధులు ఒక ప్రటకనలో తెలిపారు. మూడు రోజులపాటు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబరు 1న మధ్యా హ్నం అన్నదానం, సెప్టెంబరు 2న మధ్యాహ్నం లడ్డూ వేలంపాట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

మంత్రి వినాయకచవితి శుభాకాంక్షలు

ఎర్రగొండపాలెం :  రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలసి  వినాయక చవితి పండుగను భక్తిశ్రద్దలతో నిర్వహించుకోవాలన్నారు.

షటిల్‌ టోర్నమెంట్‌ ఏర్పాటు

రాచర్ల  : వినాయక చవితి పండుగ సందర్భంగాఅనుమలపల్లి గ్రామంలో షటిల్‌ టోర్నమెంటు నిర్వహిస్తున్నట్లుగా సర్పంచ్‌ శిరిగిరి రమేష్‌ తెలిపారు. 31వ తేదిన సాయంత్రం 6 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. ఎంట్రీ ఫీజు రూ.250 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మొదటి బహుమతి రూ. 5 వేలు, రెండవ బహుమతి రూ.3 వేలు అందజేస్తామన్నారు. వివరాలకు 7661920272 సంప్రదించాలన్నారు.

ఉత్సాహంగా ప్రతిమల కొనుగోలు

ఎర్రగొండపాలెం, ఆగస్టు 30: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మండపాల వద్ద గణనాథులు కొలువు తీరుతున్నారు. ఇక ప్రతిమల కొనుగోలు కేంద్రం వద్ద రద్దీ వాతావరణం నెలకొంది. ఎర్రగొండపాలెంపంచాయతీలో 12పైగా గణేశుని ప్రతిమలకు మండపాలు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రానికి గణేశుని ప్రతిమలు మండపాలకు చేర్చారు. 

Updated Date - 2022-08-31T05:50:54+05:30 IST