ప్రతికూలం

ABN , First Publish Date - 2022-09-25T06:14:29+05:30 IST

జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మండలాల్లో 25 నుంచి 55 శాతం వరకు లోటు వర్షపాతం కనిపిస్తోంది.

ప్రతికూలం
దోర్నాల మండలం తిమ్మాపురం వద్ద డ్రిప్‌ ఉన్నప్పటికీ నీరందక ఎండిపోయిన మిర్చి

జిల్లావ్యాప్తంగా మళ్లీ వర్షాభావ పరిస్థితులు

మూడొంతుల మండలాల్లో లోటు 

పెరిగిన ఎండల తీవ్రత

ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం

ఎండుతున్న పత్తి, కంది, మిర్చి

నిష్క్రమణ దశలో నైరుతి

జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మండలాల్లో 25 నుంచి 55 శాతం వరకు లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ దశకు చేరినట్లు వాతావరణశాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తుండగా రానున్న వారంరోజుల్లో కూడా పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదు. దీనికితోడు ప్రస్తుతం వేసవిని తలపించేలా ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ సాగు సమయం కూడా ఈనెలాఖరుకు ముగియనుండగా సాధారణ విస్తీర్ణంలో నాల్గో వంతు పంటలు సాగు కాలేదు. వేసినవి కూడా చాలాచోట్ల ఒకవైపు వర్షాభావం, మరోవైపు ఎండల తీవ్రతతో ఎదుగుదల లోపించి వాడుముఖం పట్టాయి.

ఒంగోలు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వాతావరణం ప్రతికూలంగా కనిపిస్తోంది. వర్షాలు పడా ల్సిన సమయంలో వేసవిని తలపిస్తూ ఎండలు మండి పోతున్నాయి. ఈ ప్రభావం పంటలపై తీవ్రంగా కనిపి స్తోంది. జూన్‌ ఆరంభం నుంచి సెప్టెంబరు ఆఖరు వర కు నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది. ఈ కాలాన్నే ఖరీఫ్‌ సాగు సీజన్‌గా గుర్తిస్తారు. ఈ సమ యంలో కురిసే వర్షాలతో ఖరీఫ్‌ పంటల సాగుతోపాటు రబీ సాగుకు భూములను సిద్ధం చేస్తారు. అలాంటిది  వర్షాభావ పరిస్థిఽతితో ఖరీఫ్‌ సాగే అంతంతమాత్రంగా ఉంది. రబీ సాగు కూడా ఆలస్యమయ్యే సూచనలు కని పిస్తున్నాయి. జిల్లాలో వార్షిక సాధారణ వర్షపాతం 791.0 మి.మీ కాగా నైరుతి కాలంగా భావించే (జూన్‌ ఆరంభం నుంచి సెప్టెంబరు ఆఖరు వరకు) సమ యంలో 366.2 మి.మీగా ఉంటుంది. అందులో ఈనెల 24 వరకు 327.8 మి.మీ కురవాల్సి ఉండగా జిల్లాలో సగటున 9.50శాతం లోటుతో 296.50 మి.మీ కురిసింది. 


ఎక్కువ మండలాల్లో లోటే

జిల్లాలోని మొత్తం 38 మండలాలు ఉండగా 26 మండలాల్లో వర్షపాతం లోటు కనిపిస్తోంది. అందులో 15 మండలాల్లో 20శాతం కన్నా అధికంగా ఉంది. మరో ఆరేడు మండలాల్లో 10 నుంచి 20శాతం లోటు నమోదైంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు నిష్క్రమించినట్లు వాతావరణశాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తుండగా రానున్న వారంరోజుల్లో కూడా పెద్దగా వర్షాలు కురిసే అవకాశాలు లేవు.


మొదటి నుంచి అననుకూలమే

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం నుంచి వర్షాలు సరైన రీతిలో కురవకపోవడంతో పంటలు సాగు ముందుకు సాగలేదు. ప్రత్యేకించి ఈ నెలలో తీవ్ర బెట్ట వాతావర ణం నెలకొంది. దాదాపు రెండు వారాలకుపైగా పెద్దగా వర్షాలు లేకపోవడమే కాక ఎండల తీవ్రత పెరిగింది. అత్యధిక ప్రాంతాల్లో 36 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ తీవ్ర ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ సీజన్‌ సాధార ణ సాగు విస్తీర్ణం 1,71,621 హెక్టార్లు కాగా 1,79,603 హెక్టార్లలో పంటలు సాగు జరిగేలా వ్యవసాయశాఖ లక్ష్య నిర్దేశం చేసింది. అయితే ఇప్పటివరకు 1,31,966 హెక్టార్లలోనే పంటలు సాగైనట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈ వారంలో ఇక పంటల సాగుకు అవకాశం లేదు. ఆ రకంగా సాధారణంలో 23శాతానికిపైగా విస్తీర్ణంలో పంటలు సాగు కాలేదు. వేసిన పలు మెట్ట పంటలు ఎండిపోతున్నాయి.


భారీగా పత్తి సాగు

ఈ సీజన్‌లో సాగైన పంటల్లో పత్తి సాధారణ విస్తీర్ణం కన్నా ఽఅధికంగా వేశారు. కంది, వరి వంటి  పైర్ల సాగు గణనీయంగా తగ్గిపోయింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 29,634 హెక్టార్లు కాగా 39,930 హెక్టార్లలో సాగు చేశారు. అదే కంది పంట సాధారణ విస్తీర్ణం 84,493 హెక్టార్లు కాగా 48,613 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఇక వరి సాగుకు విముఖంగా ఉన్న రైతులు పెద్దగా ఆ వైపు చూడటం లేదు. వరి సాధారణ విస్తీర్ణం 14,286 హెక్టార్లు కాగా 6,404 హెక్టార్లలో మాత్రమే సాగైంది. కాగా ప్రస్తుత వాతావరణంతో కీలక మెట్ట పంటలైన పత్తి, కంది, మిర్చితోపాటు పశుగ్రాస పంటలు చాలాప్రాంతాల్లో ఎదుగుదల లోపించడంతోపాటు వాడుముఖం పట్టాయి. 





Updated Date - 2022-09-25T06:14:29+05:30 IST