పోలవరం.. గోప్యం

ABN , First Publish Date - 2022-04-24T09:02:18+05:30 IST

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ జరిపిన పర్యటన..

పోలవరం.. గోప్యం

ఫొటో కూడా తీయనివ్వని నిపుణుల కమిటీ

ప్రాజెక్టు సందర్శన.. అధ్యయనం అంతా గోప్యమే

డయాఫ్రంవాల్‌పై కమిటీ చెప్పకముందే మాటలు

కొత్తది కట్టడానికి 2000 కోట్లు కావాలట!

విస్తుపోతున్న రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు


అమరావతి, రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ జరిపిన పర్యటన.. అధ్యయనం అంతా గోప్యమే! ఈ కమిటీతోపాటు పర్యటనలో పాల్గొన్న రాష్ట్ర అధికారులు సమాచారం బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. శుక్రవారం ప్రాజెక్టును పరిశీలించిన కమిటీ  శనివారం రాజమహేంద్రవరం పరిధిలోని ధవళేశ్వరం ఇరిగేషన్‌ భవనంలో సమీక్ష నిర్వహించింది. మీడియాను కనీసం ఫొటో తీసుకోవడానికి కూడా అనుమతించకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ఐఐటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రాజు అధ్యక్షతన నిపుణులు, రాష్ట్ర అధికారులతో ఈ కమిటీని ఏర్పాటుచేసింది. నిజానికి, ఈ కమిటీతో పాటే కేంద్ర జలశక్తిశాఖ అధ్యయన బృందం పోలవరంలో డయాఫ్రం వాల్‌, కనెక్టివిటీని పరిశీలించాల్సి ఉంది. కానీ.. వ్యక్తిగత కారణాలతో గురు, శక్రవారాల్లో జరగాల్సిన తన పర్యటన వాయిదావేసుకుంది. జలశక్తిశాఖ సలహాదారు వెదురె శ్రీరామ్‌ ఈ కారణంగానే రాష్ట్రానికి రాలేదు. దీంతో ఢిల్లీ, హైదరాబాద్‌, తిరుపతి ఐఐటీ బృందాలతో రాష్ట్రం ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులే ప్రాజెక్టు వద్ద శుక్ర, శనివారాల్లో పర్యటించారు. వీరు తమ నివేదికను ఇవ్వకముందే. ప్రభుత్వ సలహాదారు సజ్జల, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించడం జలవనరులశాఖ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారిం ది. డయా ఫ్రమ్‌వాల్‌ దెబ్బతిందని కమిటీ ఇంతవరకు చెప్పలేదు. ఒకవేళ దెబ్బతింటే డ్యామేజీ పూడ్చడానికి ఎంత ఖర్చయ్యేదీ ఇంకా నివేదించలేదు. అయినా.. డయాఫ్రం వాల్‌పై ఈ ఇద్దరు నేతలు స్పందించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య నిలిచిన జలాలను తోడాల్సి ఉంటుందని, ఇందుకు రూ.2000 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. దీనిపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నీటిని కాఫర్‌ డ్యామ్‌ను కాస్త పక్కకు తొలగిస్తే జలాలు సహజంగానే కిందకు వెళ్లిపోతాయి. దీనికోసం ఇన్నివేల కోట్లు ఎందుకు ఖర్చవుతుందని సందేహం వ్యక్తంచేస్తున్నారు.


పోలవరం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఐటీ బృందాలు జరుపుతున్న పర్యటనలతో తమ శాఖకు ఎటువంటి సంబంధం లేదని శనివారం ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించింది. త్వరలోనే కేంద్ర జలశక్తి శాఖ బృందం పోలవరం ప్రాంతంలో పర్యటిస్తుందని కేంద్రం తెలిపింది. కాగా, రాష్ట్రం నియమించిన ఐఐటీ నిపుణులు, అధికారుల కమిటీ ధవళేశ్వరంలో శనివారం ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ సమావేశమైంది. ఈ భేటీ వివరాలపై కమిటీ సభ్యులు మౌనం పాటించగా.. మెయిన్‌ డ్యామ్‌ డిజైన్ల గురించి చర్చించామని, ఎస్‌ఈ నరసింహమూర్తి తెలిపారు. నివేదికను ప్రభుత్వానికి కమిటీ ఇస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో డిజైన్లపై ఏకాభిప్రాయం కుదిరినట్టు లేదు. డిజైన్ల విషయంలో రకరకాల గందరగోళాలతో తాత్సారం చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ కమిటీలో ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్‌  వీఎస్‌ రాజు, డైరెక్టర్‌ జీవీ రమణ, తిరుపతికి చెందిన వీఎ్‌సరాజు కన్స్‌ల్టెన్సీ సీఈ బాలాజీ, తిరుపతి ఐఐటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జానకీరామయ్య, జియో టెక్నికల్‌ సీనియర్‌ ఇంజనీర్లు కృష్ణచైతన్య, బి.సందీప్‌, కేఎ్‌సఆర్‌ కుమార్‌, వాటర్‌ రిసోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఇంజనీర్లు, పోలవరం సీఈ సుధాకరబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-24T09:02:18+05:30 IST