ఎన్‌హెచ్‌పీసీ తేల్చేదాకా పోలవరం పనులు చేయలేం

ABN , First Publish Date - 2022-09-08T09:03:41+05:30 IST

ఎన్‌హెచ్‌పీసీ తేల్చేదాకా పోలవరం పనులు చేయలేం

ఎన్‌హెచ్‌పీసీ తేల్చేదాకా పోలవరం పనులు చేయలేం

డయాఫ్రం వాల్‌పై కేంద్రానిదైనా తప్పే!

కాఫర్‌ డ్యాం పూర్తికాకుండా దానికి అనుమతి ఇవ్వకూడదు

ఆ వాల్‌ దెబ్బతిన్నదో లేదో తెలియదు: అంబటి


అమరావతి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో కాఫర్‌ డ్యాం పూర్తికాకుండా డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేపట్టేందుకు ఆమోదం తెలిపితే కేంద్రానిదైనా తప్పే అవుతుందని జల వనరుల మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కాఫర్‌ డ్యాం పూర్తికాకుండా ఆ వాల్‌ నిర్మించడం చంద్రబాబు చేసిన చరిత్రాత్మక తప్పిదమన్నారు. బుధవారంనాడు వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నదని తమ ప్రభుత్వం భావిస్తోందని.. అయితే ఇప్పటిదాకా అధికారికంగా ధ్రువీకరణ జరగలేదన్నారు. అది దెబ్బతిన్నదో లేదో నేషనల్‌ హైడ్రో-ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) బృందం అధ్యయనం చేస్తోందని.. ఈ నివేదిక వచ్చాకే పూర్తి స్థాయిలో స్పందిస్తామని చెప్పారు. తాము చెప్పేది నిజమని ఎన్‌హెచ్‌పీసీ గనుక ధ్రువీకరిస్తే.. తప్పెవరిదో తేలుస్తామన్నారు. ఎన్‌హెచ్‌పీసీ ఏ సంగతీ తేల్చేదాకా ప్రాజెక్టు పనులు చేయలేమని తెలిపారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం ఆమోదించాయని గుర్తుచేయగా.. కాఫర్‌ డ్యాం నిర్మించకుండా ఆ వాల్‌ కట్టడానికి ఆమోదం తెలిపితే.. వాటిని కూడా తప్పుబడతామని చెప్పారు. తాము వచ్చాకే వరుసగా ప్రాజెక్టులు, వాటి గేట్లు దెబ్బతింటున్నాయనడం సరికాదని అంబటి అన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే.. ప్రాజెక్టుల గేట్లకు యాజమాన్య నిర్వహణ లేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తాను చేతులెత్తేశానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. 2018లో పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఇంటికి వెళ్లిపోయిన ఆయనకు ఈ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హతే లేదని తెలిపారు.

Read more