పోలవరాన్ని ముంచేశారు!

ABN , First Publish Date - 2022-07-14T09:08:41+05:30 IST

పోలవరాన్ని ముంచేశారు!

పోలవరాన్ని ముంచేశారు!

దిగువ కాఫర్‌ డ్యాం పూర్తిచేయకుండా కాలయాపన

ఇప్పుడేమో రేడియల్‌ గేట్లెత్తి స్పిల్‌వే గుండా వరద నీరు పంపామంటూ కలరింగ్‌

ఆలస్యానికి బాధ్యులెవరో చెప్పరేం?

మూడేళ్లుగా గడువు పొడిగించడమే!

డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నదంటూ ప్రచారం

ఏ మేరకు నష్టం జరిగిందో చెప్పలేరు

అధ్యయనం చేయకముందే మళ్లీ ప్రాజెక్టు ప్రాంతంలో భారీ వరద

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం మధ్య ‘మినీ రిజర్వాయరు’

ఇక నవంబరు దాకా పనులు లేనట్లే!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని ముంచేశారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తి చేయకుండా.. డయాఫ్రం వాల్‌ దెబ్బతిందో లేదో తేల్చకుండా.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం నిర్మాణం చేపట్టకుండా.. రేడియల్‌ గేట్లు ఎత్తి 13 లక్షల క్యూసెక్కుల వరదను కిందకు పంపామంటూ ప్రాజెక్టు అధికారులు కొత్త కలరింగ్‌ ఇస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయిపోయి.. ఏకంగా 45.72 మీటర్ల కాంటూరులో నీటిని నిల్వ చేసినట్లు.. అకస్మాత్తుగా వచ్చిన వరదను హైడ్రాలిక్‌ గేట్లను సకాలంలో ఎత్తడం ద్వారా వరదను కిందకు వదిలినట్లుగా ప్రకటనలు చేయడంపై సాగునీటి రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. అదే ఏడాది ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పింది. కానీ రివర్స్‌ టెండరింగ్‌ సాకుతో పనులు ఆపేసింది. కాంట్రాక్టరును మార్చాక.. 2020లో ఖరీఫ్‌ నాటికి పూర్తి చేస్తామంది. జరగలేదు. 2021 ఖరీ్‌ఫలో రైతులకు పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగునీరందిస్తామని.. 2022 డిసెంబరు నాటికి పోలవరం ఫలాలను రాష్ట్రానికి అందిస్తామంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్‌ ప్రకటనలు చేశారు. ఇక అప్పటి జలవనరుల మంత్రి పి.అనిల్‌కుమార్‌ 2019 నుంచి 2022 ఏప్రిల్‌ 11వ తేదీ దాకా గడువులు పెంచుకుంటూ పోయారు. కానీ పనులు ముందుకు నడవలేదు. ఇప్పుడీ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.


ఇదే మొదటిసారా?

స్పిల్‌వే ద్వారా వరద నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారైనట్లుగా జగన్‌ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే ఏ ప్రాజెక్టు నిండినా స్పిల్‌ వే ద్వారానే నీటిని బయటకు పంపుతారు. అంతెందుకు.. పోలవరంలో 2018లో 11 లక్షల క్యూసెక్కులు.. 2019లో 23 లక్షలు.. 2020లో 17 లక్షల  క్యూసెక్కుల మేర వరద వచ్చింది. ఈ నీరంతా స్పిల్‌వే మీదుగానే పంపించారు. ఇప్పుడు 14లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది.  అకస్మాత్తుగా వచ్చిన వరదతో .. దిగువ కాఫర్‌ డ్యాంపై నుంచి ప్రవాహం వెళ్లిందని జల వనరుల శాఖ చెబుతోంది. రేడియల్‌ గేట్లు పైకెత్తి వరద విడుదల చేశామంటోంది. వాస్తవానికి ఈ గేట్ల నిర్మాణం 2018 నాటికే పూర్తయింది. 2019 నుంచి ఇప్పటివరకు కేవలం మట్టి, రాళ్లతో కూడిన మట్టికట్ట దిగువ కాఫర్‌ డ్యాంను ఎందుకు పూర్తి చేయలేకపోయిందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 


డయాఫ్రం వాల్‌ గతేంటి?

ఏడాది కాలంగా డయాఫ్రం వాల్‌పై ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం నిర్మాణానికి ఎదురైన సాంకేతిక లోపాలపై అధ్యయనమంటూ వస్తున్నారు. వరుస వరదలకు డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని.. ప్రధాన డ్యాం పూర్తికుండా దీనిని నిర్మించడం వల్లే ఇలా జరిగిందని.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వానిదే ఈ బాధ్యతని జగన్‌ సర్కారు విమర్శలు గుప్పిస్తోంది. కానీ అసలది దెబ్బతిందో లేదో కూడా చెప్పలేకపోతోంది. ఈ నెల 15లోగా సాంకేతిక పరికరాలు సిద్ధం చేస్తే.. వాటి ఆధారంగా డయాఫ్రం వాల్‌ దెబ్బతిందో లేదో పరిశీలించి నివేదిక ఇస్తామని నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) బృందం స్పష్టం చేసింది. ఈ లోగా ఈ నెల 9వ తేదీ నుంచి ఎగువ నుంచి గోదావరికి వరద ప్రారంభమైంది. సోమ, మంగళవారాల్లో 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువ కాఫర్‌ డ్యాం మీదుగా ప్రవహించింది. ఫలితంగా.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నడుమ ప్రాంతం భారీ రిజర్వాయరును తలపిస్తోంది. ప్రాజెక్టు పనులు చేపట్టాలంటే నీటి ప్రవాహం తగ్గాలి. పరిస్థితి చూస్తుంటే నవంబరు దాకా ఏ పనీ చేసే అవకాశం కనిపించడం లేదు. ఇక ఈ ప్రాజెక్టు కథ కంచికేనా నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.


నిజాలు చెప్పకుండా మోసపూరిత ప్రకటనలు: టి.లక్ష్మీనారాయణ

పోలవరం ప్రాజెక్టుకు వరదపై నిజాలు చెప్పకుండా.. రేడియల్‌ గేట్లు సమర్థంగా ఎత్తి స్పిల్‌వే ద్వారా వరదను బయటకు పంపామంటూ మోసపూరిత ప్రకటనలు ఎందుకని ప్రభుత్వాన్ని సాగునీటి రంగ నిపుణుడు టి.లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. 2019 నుంచి ఇప్పటి దాకా వరద జలాలను స్పిల్‌వే ద్వారానే పంపిస్తుంటే కొత్తగా రేడియల్‌ గేట్లను ఎత్తేయడం వల్ల నష్టాన్ని నివారించామన్నట్లుగా ప్రకటనలతో ఊదరగొట్టడం ఏమిటని నిలదీశారు. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య వరద నీరు నిలిచిపోవడంతో.. నవంబరు దాకా పనులు చేపట్టే అవకాశాలు కనిపించడం లేదన్నారు. పైగా సవరించిన అంచనాలను కేంద్రం అంగీకరించడం లేదని.. 2013-14 అంచనాలకే కట్టుబడి ఉందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేసే పరిస్థితులూ లేవన్నారు. ఇలాంటి తరుణంలో పోలవరం నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Read more