-
-
Home » Andhra Pradesh » pm-NGTS-AndhraPradesh
-
మీరు ఉత్సవ విగ్రహాలు కాదు
ABN , First Publish Date - 2022-02-19T09:19:25+05:30 IST
గ్రామ సర్పంచ్‌లకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను సీఎం జగన్‌రెడ్డి కాలరాస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ...

పీఎం,సీఎం తర్వాత చెక్‌పవర్ ఉంది సర్పంచ్‌లకే: చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): గ్రామ సర్పంచ్‌లకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను సీఎం జగన్‌రెడ్డి కాలరాస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. శుక్రవారం రెండోరోజు సర్పంచ్ల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘‘సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలు కాదు. రాజ్యాంగం మీకు హక్కులు ఇచ్చింది. కేంద్రం నుంచి నిధులు నేరుగా మీ ఖాతాల్లోకి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు దారి మళ్లిస్తామంటే కుదరదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, సర్పంచ్‌లకు మాత్రమే దేశంలో చెక్‌పవర్ ఉంది. అయితే, రాష్ట్రంలో గ్రామ వాలంటీర్, సచివాలయ వ్యవస్థ తెచ్చి, సర్పంచ్ల అధికారాలకు జగన్‌రెడ్డి ప్రభుత్వం కోతపెట్టింది. మా హయాంలో సర్పంచ్‌లకు 64 అధికారాలిచ్చాం. ఇక్కడి నుంచి తిరిగి గ్రామాలకు వెళ్లగానే మీ హక్కుల కోసం పోరాడండి. ఇందుకు ఈ సదస్సు నాందీ కావాలి’’ అని చంద్రబాబు నిర్దేశించారు. ఒక్కచాన్స్ అన్న జగన్‌రెడ్డిని చూసి, పెద్దపోటుగాడని భావించి ప్రజలు అవకాశం ఇచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘ఒక్కసారి కరెంటు తీగలు పట్టుకుంటే ఏమౌతుందో ఇప్పుడూ అదే జరిగింది. జగన్ తీరు అప్పుడు ముద్దులు, ఇప్పుడు గుద్దులు అన్నట్టుంది. టీడీపీ హయాంలో పంచాయతీలకు 100అవార్డులు వచ్చాయి. పంచాయతీలకు సర్కారు వెయ్యి కోట్ల విద్యుత్ బకాయిలు ఉంది. టీడీపీ నిర్మించిన టిడ్కో ఇళ్లు పేదలకివ్వడం లేదు. రూ.250 ఉన్న సిమెంట్ ధర రూ.450కి చేరింది. అంతా భారతీ సిమెంట్‌కు దోచిపెడుతున్నారు’’ అని చంద్రబాబు ఆరోపించారు.