ఆసాంతం అబద్ధాలే!

ABN , First Publish Date - 2022-07-10T08:02:00+05:30 IST

ఆసాంతం అబద్ధాలే!

ఆసాంతం అబద్ధాలే!

ప్లీనరీ మొత్తం ఆత్మస్తుతి.. పరనిందే!

ప్రజలను ఏమార్చేందుకు జగన్‌ ఎత్తుగడ

తెరపైకి గోబెల్స్‌ స్కూల్‌ సిద్ధాంతం

మీడియాపై పదేపదే అభాండాలు

ప్రతిపక్ష నేతలపై దూషణలు

అడుగడుగునా ‘దుష్టచతుష్టయమే’

ఆత్మవిమర్శకు ఎక్కడా తావే లేదు

ఓ దిశా లేదు.. తప్పొప్పుల ఊసూ లేదు

అడుగడుగునా సొంత డబ్బా

కట్టుకథలు, అవాస్తవాలే నిజాలని నమ్మించేందుకు విశ్వప్రయత్నం

అమ్మను శాశ్వతంగా తరిమేశారు

తాను శాశ్వత అధ్యక్షుడయ్యారు

ఎవరూ ప్రశ్నించే వీల్లేకుండా ముందుగానే ఎజెండాఖరారు!


మీడియాపై చిందులేయడం సీఎం జగన్మోహన్‌రెడ్డి రోజూ చేసే పనే. విపక్షాన్ని తిట్టిపోసి సొంత డబ్బా కొట్టుకోవడం ప్రతి సభలోనూ చేస్తున్నదే. చివరకు పార్టీకి, ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాల్సిన ప్లీనరీలో సైతం పచ్చి అబద్ధాలు చెబుతూ.. ఆత్మస్తుతి, పరనిందకే పరిమితమయ్యారు. ప్రజలను ఏమార్చాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఈ మాత్రం దానికి రెండ్రోజులపాటు ప్లీనరీ పెట్టడం అవసరమా అని వైసీపీ శ్రేణులే విస్తుపోయేలా చేశారు. అయితే జగన్‌ మాత్రం రెండు పెద్ద స్వప్రయోజనాలు సాధించుకున్నారు. అందులో ఒకటి.. తాను అనుకున్నట్లుగా తల్లి విజయలక్ష్మిని పార్టీ నుంచి పంపేయడం.. పార్టీకి తననే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసే బహిరంగ సభకు, రాజకీయ పార్టీ ప్లీనరీకి పెద్ద తేడా లేకుండా సొంత డబ్బా కొట్టుకుంటూ.. తప్పులను ఎత్తిచూపిస్తున్న మీడియా, ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ యథాప్రకారం అక్కసు వెళ్లగక్కారు. ఈ క్రమంలో గోబెల్స్‌ స్కూల్‌లో బోధించే సిలబ్‌సను ప్రతిపాదించారు. అదేమంటే.. తాను చెప్పేవే నిజాలని.. వాటినే వినాలని, నమ్మాలని.. మీడియా, ప్రతిపక్షాలు చెప్పేవన్నీ అబద్ధాలని.. ఆ మాటలు వినొద్దని! ప్రజాస్వామ్యానికి నాలుగో అంగంగా ఉన్న మీడియాను శత్రువుల జాబితాలో చేర్చి.. విపక్షాలతో కలిపి రాక్షసులుగా, కౌరవులుగా పోల్చి తనను తాను దైవజ్ఞుడిగా చాటుకున్నారు. ఎదుటివారిపై నిందలు, అడ్డగోలు అభాండాలు వేయడానికి పచ్చి అబద్ధాలు చెప్పారు. మీడియాపై ఇప్పటి వరకు తానే ఎదురుదాడి చేశానని.. ఇకపై గ్రామాల స్థాయిలో సోషల్‌ మీడియా యంత్రాంగం ఏర్పాటు చేసుకుని కార్యకర్తలే తిప్పికొట్టాలని పిలుపిచ్చిన ముఖ్యమంత్రిగా కొత్త రికార్డు సృష్టించుకున్నారు. ఆత్మవిమర్శ, తప్పొప్పుల ప్రస్తావనే లేదు. సొంత డబ్బా కొట్టుకోవడం.. తన తప్పులు ఎవరూ చూడకుండా మీడియాపై నిందలు మోపడం.. ప్లీనరీ వేదికగా జగన్‌ చేసిన రాజకీయ విన్యాసం ఇదే.


సిద్ధాంతాలు, కార్యాచరణ ఊసేదీ..?

తమ సిద్ధాంతం, నియమావళి, ఆచ రణ, భవిష్యత్‌ కార్యాచరణ, లక్ష్యాల గురించి చర్చించుకోవడానికి, ఆత్మవిమర్శతో తప్పులను సరిదిద్దుకొని మరింతగాప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి అన్ని పార్టీలూ ప్లీనరీలను ఉపయోగించుకుంటాయి. అన్నీ అయ్యాక పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాయి. తర్వాత పార్టీ విభాగాలు, అనుబంద సంస్థలకు నియామకాలు జరుపుతాయు. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించుకుంటుంది. కమ్యూనిస్టు పార్టీలు మహాసభల పేరిట కార్యక్రమాలు జరుపుకొంటాయి. జగన్‌ మాత్రం వీటికి పూర్తి విరుద్ధం. ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పినట్లు తల్లి నుంచి పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా తీసుకున్నారు. ఆ తర్వాత తానే శాశ్వత అధ్యక్షుడినంటూ పార్టీ రాజ్యాంగాన్ని మార్చేసుకున్నారు. ప్లీనరీలో అంతర్గత ప్రజాస్వామ్యంపై చర్చే జరుగ లేదు. తనను, తన పనితీరును, నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించే అవకాశమివ్వకుండా ముందుగానే ఎజెండాఖరారు చేసుకున్నట్లు స్పష్టమైంది. ఆత్మవిమర్శకు అవకాశం ఇవ్వకుండా ఆత్మస్తుతిని పతాకస్థాయికి తీసుకెళ్లారు. అదే జోరుతో పరనిందకూ పాల్పడ్డారు. మంత్రులు, నేతలతోనూ అదే పనిచేయించారు. ఆయన ప్రసంగంలో దుష్టచతుష్టయం, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, దత్తపుత్రుడు అనే మాటలు కనీసం ఓ వంద సార్లయినా పలికి ఉంటారు. చంద్రబాబు పేరు 100 సార్లు, రామోజీరావు పేరు 80, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 70, టీవీ5 నాయుడు 60, దుష్టచతుష్టయం 50, దత్తపుత్రుడు 40, ఈనాడు, ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌, టీవీ5-30, లోకేశ్‌ పేరు 20 సార్లు ఉచ్చరించారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి పేరును 10 సార్లే ప్రస్తావించారు. తనకు, తన పార్టీకి ఆరాధ్యుడిగా భావించే తండ్రి కన్నా ప్రతిపక్ష నేతలు, మీడియా సంస్థల పేర్లను చాలా ఎక్కువ సార్లు ప్రస్తావించడం గమనార్హం.


జగన్‌ ఎట్‌ ఏఎ్‌సపీఎన్‌..

ఆత్మస్తుతి.. పరనింద (ఏఎ్‌సపీఎన్‌) అనే చానల్‌ను జగన్‌ ఏర్పాటు చేసుకున్నారని ఇప్పటికే వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ప్లీనరీలో కూడా ఇదే పాటించారన్న చర్చ సాగుతోంది. మేనిఫెస్టోలో పెట్టినవన్నీ అద్భుతంగా చేశామని చెప్పుకొంటూ.. తాను చేయనివి, ఎప్పుడో చేయాలనుకుంటున్నవి.. సగం చేసి వదిలేసినవన్నీ ఘనకార్యాలుగా చాటుకున్నారు. అంతకంటే అనేక రెట్లు ఎక్కువగా ప్రత్యర్థులను దూషించడానికి.. తూలనాడేందుకే సమయం కేటాయించారు. దీంతో ప్లీనరీకి వచ్చిన కార్యకర్తలు, నేతలు సైతం.. ‘సారు ఏఎ్‌సపీఎన్‌ చానల్‌ ఆన్‌ చేశాడ్రా బాబూ’ అని చెవులు కొరుక్కున్నారు. తన వైఫల్యాలు, అసమర్థత, చేతకానితనాన్ని మీడియా ఎత్తిచూపిస్తుండడంతో దిక్కుతోచక, దానికి సమాధానం చెప్పుకోలేక ఎదురుదాడికి దిగారు. ‘నేను చెప్పేవి మాత్రమే నిజాలు. వాటినే నమ్మాలి. మీడియాలో వచ్చేవన్నీ అబద్ధాలే. అవన్నీ కుట్రలే’ అనే గోబెల్స్‌ స్కూల్‌ సిద్ధాంతాన్ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా గ్రామగ్రామానా సోషల్‌ మీడి యా టీములు ఏర్పాటై మీడియా మీద కౌంటర్‌ దాడులు చేయాలని బాహాటంగానే ప్రకటన చేశారు. బహిరంగ సభల్లో మైకు పట్టుకుని అందమైన కట్టుకథలు, అబద్ధాలు చెబితే నిజాలైపోతాయా?  ఆయన సొంత డబ్బాలో గులకరాళ్లే తప్ప వాస్తవాలు లేవన్నది సాధారణ ప్రజలకు కూడా అర్థమైపోయింది.


తానే కొత్తగా చేసినట్లు..

రాజ్యాధికారంలో మహిళలకు సగం వాటా ఇచ్చేశామని జగన్‌ తన ప్రసంగంలో ఘనంగా చెప్పారు.  అధికారం అంటే ప్రభుత్వమే. ముఖ్యమంత్రి, మంత్రులే ప్రభుత్వం. మరి మంత్రి పదవుల్లో సగం మహిళ లకు ఇచ్చారా? ఎక్కడో నామినెటెడ్‌ పోస్టుల్లో సగం మహిళలకు ఇచ్చామని, అదే రాజ్యాధికారమని చెబితే ప్రజలు నమ్మేస్తారని భావించారా? ప్రపంచ చరిత్రలో తాను మాత్రమే కొత్తగా చేసినట్లు చెప్పుకొచ్చారు. శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశానన్నారు. కానీ బీసీల కోసం చట్టబద్ధమైన కమిషన్‌ ఎప్పుడో ఏర్పాటైంది. కొత్తగా ఈయన చేసిందేమీలేదు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. కానీ వాటి చైర్మన్లుగా సొంత పార్టీ నేతలను నియమిస్తూ జీవోలివ్వడం తప్ప వారు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి.  చంద్రబాబు సమయంలో ఆరోగ్యశ్రీ సర్వనాశనమైపోయిందని, తాను ఉద్ధరించానని జగన్‌ చెప్పారు. కానీ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో అనేక ప్రధాన ఆస్పత్రులు ఈయన హయాంలోనే నెట్‌వర్క్‌ నుంచి వైదొలిగాయి. అమలాపురంలో మంత్రి విశ్వరూప్‌ ఇంటిని తగులబెట్టించింది చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడేనని ప్రకటించారు. కానీ ఆ రోజు మంత్రి ఇల్లు తగులబెట్టింది వైసీపీ నేతలేనని ఆ జిల్లా ఎస్పీయే ప్రకటించారు. వినేవాళ్లు వెర్రివాళ్లయితే.. చెప్పేవాడు జగన్మోహన్‌రెడ్డి అన్నట్లుగా అలవోకగా అబద్ధాలు ఆడేశారు. ప్రతి గ్రామంలో ఒక విలే జ్‌ క్లినిక్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పిన ఆయన.. మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయన్నారు. ఇవన్నీ ఎప్పుడు పెట్టారో.. ఎక్కడి నుంచి తెచ్చారో ఆయనకే తెలియాలి. ఇలా చెబుతూ పోతే.. ప్లీనరీలో జగన్‌ చెప్పిన దానికీ.. వాస్తవాలకూ ఎక్కడా పోలికా, పొంతనే ఉండవు. అన్నిటినీ మించి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే సమగ్రాభివృద్ధి అంటూ ప్రతిపక్ష నేతగా ఊరూవాడా తిరిగి చెప్పిన ఆయన.. ప్లీనరీలో ఆ అంశాన్ని లేవనెత్తుతారని రాష్ట్ర ప్రజలు ఆశించారు. కానీ ఆ పదమే సీఎం, మంత్రుల నోట వినపడలేదు. విభజన హామీలన్నిటినీ అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తామన్న తీర్మానమూ లేదు. పోలవరం ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని కూడా ప్రస్తావించలేదు. తాము సంస్కారంగా మాట్లాడతామని.. బూతులు మాట్లాడబోమంటూనే.. చంద్రబాబును, మీడియా సంస్థలను నోటికొచ్చినట్లు దూషించారు. మంత్రుల తిట్లకు జగన్‌ పడీపడీ నవ్వుతూ ఆస్వాదించారు.


వలంటీర్లు మనోళ్లే!

బయటపెట్టేసిన జగన్‌

వలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు ఏకమై పనిచేయాలని ప్లీనరీ సాక్షిగా వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పిలుపిచ్చారు. వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినవాటిలో 95 శాతం అమలు చేశామంటూ ప్రతి వైసీపీ కార్యకర్త, నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని తొలుత చెప్పిన ఆయన.. ఆ తర్వాత వలంటీర్లు కూడా అందులో పాలుపంచుకోవాలని అన్నారు. ‘మన సంక్షేమ పథకాలు గ్రామంలో 85 శాతం కుటుంబాలకు అందుతున్నాయి. మీరు మా సైన్యం..  ప్రతి కార్యకర్తా, ప్రతి వలంటీరూ ఏకమై పని చేయాలి. నాకున్న గుండె ధైర్యం మీరే’ అని తెలిపారు. ప్లీనరీ అనేది ది రాజకీయ వేదిక. అక్కడి నుంచి ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వలంటీర్లకు పిలుపివ్వడంలోనే జగన్‌ అసలు ఉద్దేశాలు బహిర్గతమయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వలంటీర్ల వ్యవస్థను ఆయన ఎందుకు ఏర్పాటుచేశారో స్పష్టమవుతోందని అంటున్నారు.

Read more