టీచర్లను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించడంపై పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-08-30T15:51:01+05:30 IST

ఉపాధ్యాయులపై బైండోవర్ కేసుల నమోదు చేయడంపై పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు.

టీచర్లను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించడంపై పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఆగ్రహం

అమరావతి: ఉపాధ్యాయుల (Teachers)పై బైండోవర్ కేసుల నమోదు చేయడంపై పీడీఎఫ్ ఎమ్మెల్సీ (PDF MLCs)లు మండిపడుతున్నారు. సాధారణ ఉపాధ్యాయుల్ని పోలీస్ స్టేషన్‌లకు  పిలిపించి వేధించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం (V. Balasubrahmanyam) మాట్లాడుతూ... ప్రభుత్వం (AP government) తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తే రాజకీయ దాడిగా ప్రభుత్వం తీసుకోవటం తగదన్నారు. హక్కుల కోసం నిరసన తెలుపుతుంటే కక్షసాధింపు చర్యలకు దిగటం దుర్మార్గమని అన్నారు. ఉపాధ్యాయులు వినాయక చవితి పండుగ చేసుకోకూడదని, పాఠశాలలకు కూడా వెళ్లొద్దంటూ స్టేషన్లకు పిలిపించి కూర్చోపెట్టడమేంటని ప్రశ్నించారు. సీపీఎస్ (CPS) రద్దు కోసం నిలబడతారా? లేక చచ్చిపోతారా అనే సందేశాన్ని కిందిస్థాయి ఉద్యోగుల వరకు ప్రభుత్వమే పంపిందని తెలిపారు. తాము సీపీఎస్ రద్దు కోసం నిలబడి తీరుతామని స్పష్టం చేశారు. అక్రమ నిర్బంధాలకు నిరసనగా ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని ప్రకటించారు. జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిల్లోనూ తమ నిరసనలు ఉంటాయన్నారు. ఉపాధ్యాయుల్ని నిర్బంధిస్తే కుటుంబసభ్యులతో ఆందోళనలు చేయిస్తామని బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. 


స్వతంత్ర ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ... బ్రిటీష్ కాలంలో కూడా ఈ తరహా నిర్బంధాలు ఉద్యోగులు ఎదుర్కోలేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనే అడుగుతున్నామని అన్నారు. ఎన్నికల హామీలో పెట్టకుండానే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు సీపీఎస్ రద్దు చేశాయని గుర్తుచేశారు. 


ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ మాట్లాడుతూ... సీపీఎస్ రద్దు చేయకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. లక్షన్నర ఉపాధ్యాయులతో పాటు వారి కుటుంబాల ఓట్లు తమతో ముడిపడి ఉన్నాయని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఓపీఎస్ పునరుద్ధరణ కోసం ఉద్యోగుల వెంట ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. 

Read more