కన్నీళ్లు తుడవలేని ప్రభుత్వం దేనికి?

ABN , First Publish Date - 2022-04-24T09:14:15+05:30 IST

‘‘రైతు, రైతు కూలీ, ఆసామి ముగ్గురూ కలిస్తేనే మన చేతికి ముద్ద దొరికేది.

కన్నీళ్లు తుడవలేని ప్రభుత్వం దేనికి?

ఏం చేస్తున్నాయి మీ సచివాలయాలు?

జనసేన పట్టించుకుంటేనే సమస్యలు గుర్తొస్తాయా? 

ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే గట్టిగా ప్రశ్నిస్తాం

80 శాతం కౌలు రైతుల్ని ఈ ప్రభుత్వం గుర్తించలేదు 

దేశంలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానంలో ఏపీ 

చంచల్‌గూడలో షటిల్‌ ఆడుకున్న మీరా నన్ను విమర్శించేది

సీబీఐ దత్తపుత్రుడి మాటలు మనం పట్టించుకోనక్కర్లేదు 

జనసైనికుల ఒంటిపై చేయి పడితే... నా భావం అర్థమైందిగా

పోలీసులంటే బానిసలు అనుకుంటున్నారా? 

ప్రభుత్వ అరాచక పాలనపై యువత దృష్టి పెట్టాలి 

జనసేనా... వైసీపీనా... ఆలోచించి నిర్ణయించుకోండి 

కౌలు రైతుల నష్టపరిహారంలోనూ కుల వివక్షేనా 

నాపై విమర్శలు కాదు... రైతులకు ఏం చేయాలో చూడండి 

కౌలు రైతు భరోసా యాత్రలో పవన్‌ కల్యాణ్‌ మండిపాటు 


ఏలూరు, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ‘‘రైతు, రైతు కూలీ, ఆసామి ముగ్గురూ కలిస్తేనే మన చేతికి ముద్ద దొరికేది. కౌలు రైతులకు ఎలాంటి హక్కులూ లేవు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పట్టించుకొని ఉంటే మాకిలా రోడ్లపైకి వచ్చే పనిలేదు’’ అంటూ అధికార పార్టీపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. వైసీపీ వచ్చిన నాటినుంచి ఇప్పటివరకూ 3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండోస్థానంలో ఉం టే రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందని చెప్పారు. కన్నీళ్లు తుడవలేని ఈ ప్రభు త్వం దేనికని ప్రశ్నించారు. శనివారం ఏలూరు జిల్లా చింతలపూడిలో కౌలు రైతు భరోసా యాత్రలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కౌలు రైతుల్ని పట్టించుకోకపోవడం వల్లే తాము బయటకు వచ్చామన్నారు. ఈ సభలో చాలామంది వైసీపీ నాయకులున్నారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వారిని గట్టిగా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. తొలుత కలపర్రు టోల్‌ప్లాజా నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన ర్యాలీగా బయలుదేరారు. జానంపేట, విజయరాయి, ధర్మాజీగూడెం, లింగపాలెం మీదగా చింతలపూడి వరకు ర్యాలీగా వచ్చారు. మధ్యలో కొన్ని గ్రామాల్లో మృతిచెందిన కౌలు రైతుల కుటుంబాలను కలుసుకొని, పరిహారం చెక్కులు అందించారు. మొత్తంగా జిల్లాలో 40 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారంగా పవన్‌ అందించారు. 


నమ్మకాన్ని నిలబెట్టుకోవాలిగా...

2019లో చాలామంది యువత వైసీపీని నమ్మారని, తన అభిమానులు కూడా రాజకీయంగా జగన్‌నే నమ్మారని పవన్‌ చెప్పారు. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. రైతులు రూ.2 వడ్డీకి అప్పులు తెచ్చుకుని, చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడ్డారని ఆ కుటుంబాలు చెబుతుంటే గుండె తరుక్కుపోయిందన్నారు. తానూ సేంద్రియ వ్యవసాయం చేస్తానని, త్వరలో యూరియా, పొటాషియం తదితర ఎరువుల ధరలు పెరగబోతున్నాయన్నారు. తనను విమర్శించడం మాని, రైతులకు ఏం చేయాలో ఆలోచించాలని వ్యవసాయ, రెవెన్యూ శాఖను కోరారు. 


మీకంటే బాగా డైలాగులు చెబుతా 

తాను స్ర్కీన్‌ప్లే రైటర్‌గా కూడా చేయగలనని, వైసీపీ కంటే బాగా డైలాగులు చెప్పగలనని అధికార పార్టీ నాయకులను పవన్‌ హెచ్చరించారు. తనకంటూ సొంతవాళ్లుండగా (అభిమానులను ఉద్దేశించి) దత్తపుత్రుడిగా వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అయినా తనను దత్తపుత్రుడిగా భరించడం ఎవరివల్లా కాదన్నారు. కౌలురైతులకు 15మందికి నష్టపరిహారం ఇచ్చామని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారని, అందులోనూ కులవివక్ష చూపిస్తూ ఎస్సీలను వదిలేశారని పవన్‌ విమర్శించారు. జగన్‌లా తనకు రూ.లక్ష కోట్ల ఆస్తి, సిమెంట్‌ ప్యాక్టరీలు లేవు కాబట్టి ఒక్కో రైతుకు రూ.7లక్షలు ఇవ్వలేకపోతున్నానని చెప్పారు. రాష్ట్రంలో చనిపోయిన 3వేల మంది కౌలు రైతుల కుటుంబాలకు విడతల వారీగా ఆర్థిక సాయం అందిస్తానని, అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ.7 లక్షలు కూడా వెంటనే ఇవ్వాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. 


ఒంటిపై చెయ్యేస్తే...

ఈ ప్రభుత్వం 80శాతం కౌలు రైతుల్ని గుర్తించలేదని, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ను ఏం చేస్తున్నారని పవన్‌ ప్రశ్నించారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని తాను ఎదురుచూడనని, ఏం చేయాలో అదే చేస్తానన్నారు. విజయవాడలో తమ ఆడబిడ్డ మానం తీశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం చేతకాని ఈ ప్రభుత్వం జనసైనికులపై మాత్రం గూండాలతో దాడి చేయించారని ఆరోపించారు. మరోసారి జనసేన నాయకులు, కార్యకర్తల ఒంటిపై చెయ్యేస్తే అంటూ వేదికపై నుంచే వేలు చూపించిన మాట్లాడిన పవన్‌... తన భావం అర్థమైందనుకుంటానంటూ హెచ్చరించారు. సీబీఐ దత్తపుత్రుడి మాటలు మనం పట్టించుకోనక్కర్లేదన్నారు. ఈ ప్రభుత్వంతో పోలీసులు విసిగిపోయారని, టీఏ, డీ.ఏ.లతో పాటు సెలవుల్లేకుండా వారితో పని చేయించుకుంటున్నారన్నారు. పోలీసులేమైనా బానిసలనుకుంటున్నారా అని మండిపడ్డారు. తనకున్న అభిమానులంతా చిన్న పిల్లలని అందరూ అనుకుంటున్నారని, ఇలా సభల్లో చూపించే ఊపును ఓటింగ్‌లో చూపించాలన్నారు. 


సీఎం పదవి ఇస్తే తీసుకుంటా 

రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తామని ప్రకటించిన వైసీపీ... అధికారంలోకి వచ్చాక కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి ఆ మొత్తం ఇస్తున్నారని పవన్‌ చెప్పారు. వాస్తవానికి కేంద్రం ఇచ్చే మొత్తంతో కలిపి రూ.18,500 ఇవ్వాల్సి ఉండగా, అవి ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చడం లేదని అధికారులను, నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. భగవద్గీతను నమ్ముతానని, ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా సేవ చేస్తానని, లేకపోయినా కర్మ సిద్ధాంతం ప్రకారం పనిచేస్తానన్నారు. అధికారం కోసం వెంపర్లాడనన్నారు. 

జ్యూట్‌ మిల్లు కార్మికులకు అండగా

ఏలూరులో కృష్ణా జూట్‌ మిల్లును మూసేయడంతో 2వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని పవన్‌ అన్నారు. జనపనార సరిపడా అందుబాటులో లేకపోవడం వల్లే మూసివేయాల్సి వచ్చిందని, మిల్లు మూసివేత విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆ కార్మికులకు అండగా జనసేన ఉంటుందని పవన్‌ భరోసా ఇచ్చారు. 


వైసీపీకి, ఆ నాయకుడికి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పా. మళ్లీ చెప్తున్నా, నన్ను ఎవరికో దత్తపుత్రుడు అంటే మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అంటానని. ఇప్పుడు చెప్తున్నా... మీరు సీబీఐ దత్తపుత్రుడే ఫిక్స్‌ అయిపోండి.


జనసేన ముట్టుకుంటేనే సమస్యలు గుర్తుకొస్తాయా? మీ సచివాలయాలు ఏం చేస్తున్నాయి? ఏం చేస్తున్నారు మీ నాయకులు? అడిగితే నాపై వ్యంగ్యాస్త్రాలా?చంచల్‌గూడలో షటిల్‌ ఆడుకున్న మీరేంటయ్యా నన్ను విమర్శించేది? 


విజయవాడలో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే స్పందించలేని మీరు... మా జనసైనికులపై వైసీపీ గూండాలతో దాడి చేయిస్తారా? 99శాతం శాంతియుతంగానే ఉంటా. అప్పటికీ వినకపోతే ఎలా చెప్పాలో అలా చెప్తా.. మా జనసైనికుల జోలికొస్తే.. నా భావం అర్థమైందిగా.. 


వైసీపీ అంటే నాకు ద్వేషం లేదు... కానీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాత్రం గట్టిగా ప్రశ్నిస్తాం.

- పవన్‌కల్యాణ్‌

Read more