బలం ఉన్నవారికే అందలం

ABN , First Publish Date - 2022-07-05T08:23:05+05:30 IST

జల వనరుల శాఖలో వందలాది ఇంజనీరింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదోన్నతుల కోసం అధికారులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అడ్‌హాక్‌ పదోన్నతుల్లో వివక్ష చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ, అన్ని అర్హతలున్నా వెనుకబడిన

బలం ఉన్నవారికే అందలం

జలవనరుల శాఖ అడ్‌హాక్‌ పదోన్నతుల్లో వివక్ష 

సిఫారసు లేఖలు తెచ్చినవారికి కోరిన పోస్టులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జల వనరుల శాఖలో వందలాది ఇంజనీరింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదోన్నతుల కోసం అధికారులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అడ్‌హాక్‌ పదోన్నతుల్లో వివక్ష చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ, అన్ని అర్హతలున్నా వెనుకబడిన వర్గాలకు చెందిన అధికారులకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. అదే.. మంత్రులు, అధికార పార్టీ నేతల సిఫారసు లేఖలు తెచ్చినవారికి మాత్రం.. సీనియారిటీ లేకున్నా, ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆగమేఘాల మీద తాత్కాలిక పదోన్నతులు కల్పిస్తున్నారని వాపోతున్నారు. పొరుగు జిల్లాల్లో పూర్తి అదనపు బాధ్యతలతో కూడిన పదోన్నతులు ఇస్తూ, సకల సదుపాయాలు కల్పిస్తున్నారని చెబుతున్నారు. సిఫారసు లేఖలు ఎన్ని ఎక్కువగా తెస్తే అంత మంచి పోస్టు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. సిఫారసు లేఖలు తీసుకువచ్చిన కొందరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు ఎస్‌ఈలుగా పూర్తి అదనపు బాధ్యతలు కల్పించడం శాఖలో చర్చనీయాంశంగా మారింది.


సిఫారసు లేఖలు తీసుకురాలేకపోతున్న బడగు, బలహీనవర్గాలకు చెందిన అధికారులు ఎలాంటి పదోన్నతులూ లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మిగిలిపోతున్నారని చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ అధికారుల సీనియారిటీకి సంబంధించి సుప్రీంలో వ్యాజ్యం నడుస్తోంది. ఈ వ్యాజ్యం కొనసాగుతున్నా అడ్‌హాక్‌ పదోన్నతులు ఇచ్చే వీలుంది. దీని ప్రకారం ఒక అధికారికి ఒక పోస్టు మాత్రమే ఉంటుంది. కానీ సిఫారసు లేఖలు తెచ్చుకున్న అధికారులకు పూర్తి అదనపు బాధ్యతల పేరిట ఒక్కొక్కరికి 2 నుంచి 4 పోస్టులు కట్టబెడుతున్నారని జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. శాఖలో పలుకుబడి ఉన్నవారికే తప్ప.. సీనియారిటీ ఉన్నవారికి గుర్తింపు లేదన్న విమర్శలున్నాయి.  


ఖాళీగా వందల పోస్టులు: జల వనరుల శాఖలో 21 మంది చీఫ్‌ ఇంజనీర్లు ఉండాలి. జోన్‌-1లో ఒక్కరు, జోన్‌-2లో ఐదుగురు, జోన్‌-3లో ఇద్దరు, జోన్‌-4లో ముగ్గురు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిది చీఫ్‌ ఇంజనీరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే శాఖలో 66 మంది సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు ఉండాలి. జోన్‌-1లో ఇద్దరు, జోన్‌-2లో ఏడుగురు, జోన్‌-3లో నలుగురు, జోన్‌-4లో ఎనిమిది మంది బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 45 సూపరింటెండెంట్‌ ఇంజనీరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 327 మంది ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ఉండాలి. జోన్‌-1లో 17 మంది, జోన్‌-2లో 28 మంది, జోన్‌-3లో 26 మంది, జోన్‌-4లో 134 మంది బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 122 ఈఈ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల ఖాళీలూ వందలలో ఉన్నాయి. కాగా జల వనరుల శాఖలో ప్రస్తుతం ముగ్గురు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లు ఉన్నారు. 

Read more