ఒకే రాష్ట్రం... ఒకటే రాజధాని

ABN , First Publish Date - 2022-10-05T08:08:22+05:30 IST

ఒకే రాష్ట్రం... ఒకటే రాజధాని

ఒకే రాష్ట్రం... ఒకటే రాజధాని

మహాపాదయాత్రలో నినదించిన రైతులు, ప్రజలు 

‘పశ్చిమ’లో తొలిరోజు యాత్రకు అపూర్వ స్వాగతం 

వెంకట్రామన్నగూడెం నుంచి పెంటపాడు వరకూ... 23వ రోజు 16 కి.మీ. నడిచిన అమరావతి రైతులు 


భీమవరం/తాడేపల్లిగూడెం రూరల్‌/ పెంటపాడు, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని సాధనే లక్ష్యంగా రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు మంగళవారం సాదర స్వాగతం లభించింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వెంకట్రామన్నగూడెం వద్ద పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జీ, జనసేన ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ నేతృత్వంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు రైతులకు స్వాగతం పలికి, వారితో కలసి నడిచారు. పెదతాడేపల్లి వద్ద వందల మంది ప్రజలు పాదయాత్రకు ఎదురేగి వచ్చి మద్దతు తెలిపారు. 23వ రోజు మంగళవారం వెంకట్రామన్నగూడెం, పెదతాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం మీదుగా పెంటపాడు వరకు 16 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది. రూరల్‌ గ్రామాలు, తాడేపల్లిగూడెం పట్టణం నుంచి పెద్దసంఖ్యలో స్థానికులు యాత్రలో పాల్గొన్నారు. ‘ఒకే రాష్ట్రం... ఒకటే రాజధాని’ అంటూ నినదించారు. గుమ్మడి కాయలు కొట్టి దిష్టి తీశారు. దారి పొడవునా పూల వర్షం కురిపించారు. టీడీపీ నేతలు గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్‌, ఆరిమిల్లి రాధాకృష్ణ, ముళ్లపూడి బాపిరాజు, బీజేపీ నాయకులు నార్ని తాతాజీ, ఈతకోట తాతాజీ తదితరులు పాదయాత్రలో పాల్గొని, సంఘీభావం తెలిపారు. 


రైతుల రుణం తీర్చుకోలేం 

అమరావతి రాజధాని కోసం స్వచ్ఛందంగా వేల ఎకరాలు ఇచ్చిన రైతుల రుణం తీర్చుకోలేమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులను రోడ్డుపాలు చేయడం చూస్తుంటే వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అర్థమవుతోందన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు చేస్తున్న పాదయాత్రను హేళన చేస్తూ తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ బ్యానర్లు కట్టించారని జేఏసీ మహిళా కన్వీనర్‌ రాయపాటి శైలజ మండిపడ్డారు. ప్రజలే రాళ్లు విసిరే పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం తెచ్చుకుంటోందన్నారు. అమరావతి రాజధాని కోసం అహర్నిశలు పోరాడుతుంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమని విమర్శించడం సరికాదన్నారు. మంత్రులు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గోబ్యాక్‌ అంటూ బ్యానర్లు కట్టినంత మాత్రాన పాదయాత్ర ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జేఏసీ సభ్యుడు జి.తిరుపతిరాజు విమర్శించారు. పాదయాత్రపై కాకుండా దేవదాయశాఖపై దృష్టి పెట్టాలని మంత్రి కొట్టు సత్యనారాయణకు జేఏసీ ప్రతినిధి కె.రాజశేఖరరెడ్డి హితవు పలికారు. ఇంద్రకీలాద్రిపై భక్తులు అవస్థలు పడుతున్నారని, అక్కడ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. 


కవ్వింపు ఫ్లెక్సీలు.. నల్ల బెలూన్లు 

మహాపాదయాత్ర ప్రారంభమైన వెంకట్రామన్నగూడెం నుంచి ‘ఫేక్‌ రైతులు గోబ్యాక్‌’ అంటూ సీఎం జగన్‌, మంత్రి కొట్టు సత్యనారాయణ చిత్రాలతో ఫ్లెక్సీలు వెలిశాయి. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే మంత్రి కొట్టు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, కడుపుమంట తీర్చుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, మాజీ జడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, వలవల బాబ్జీ తదితర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఎదురుగా రావాలని, ఎవరు నిజమైన రైతులో, ఎవరు ఫేక్‌ నాయకులో తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. పాదయాత్ర తాడేపల్లిగూడెం సమీపిస్తున్న సమయంలో కొందరు వైసీపీ నాయకులు నల్ల బెలూన్లు ఎగరవేశారు.


Read more