రాజధానిపై.. దుర్గమ్మ సాక్షిగా మాట త ప్పిన జగన్‌

ABN , First Publish Date - 2022-10-07T08:08:37+05:30 IST

రాజధానిపై.. దుర్గమ్మ సాక్షిగా మాట త ప్పిన జగన్‌

రాజధానిపై.. దుర్గమ్మ సాక్షిగా మాట త ప్పిన జగన్‌

తప్పులు చేసిన వారిని అమ్మ క్షమించదు: చంద్రబాబు 

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న బాబు దంపతులు


విజయవాడ(వన్‌టౌన్‌), అక్టోబరు 6: అమరావతి రాజధానిగా ఉండేందుకు ఆనాడు వైసీపీ అంగీకరించిందని.. అసెంబ్లీలో సైతం రాజధాని ఇక్కడే ఉండాలన్న జగన్‌ ఈ రోజున దుర్గమ్మ సాక్షిగా మాట తప్పాడని మాజీ సీఎం, టీడీపీ అధినేత  చంద్రబాబు విమర్శించారు. అమరావతిపై రోజుకో మాట మాట్లాడుతున్నాడని..మాట తప్పి తప్పులు చేసిన వారిని దుర్గమ్మ క్షమించదని స్పష్టం చేశారు. విజయదశమిని పురస్కరించుకుని బుధవారం ఆయన సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి కానుకలు, చీర, పరిమళ సుగంధ ద్రవ్యాలు సమర్పించారు. ఆయనకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక అర్చనల అనంతరం పండితులు ఆశీస్సులు అందచేశారు. చంద్రబాబు దంపతులకు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, అమ్మవారి పటాన్ని ఈవో భ్రమరాంబ అందించారు. ఆలయంలోకి వారు ప్రవేశిస్తుండగా క్యూలో ఉన్న భక్తులు.. జై బాబు, జైజై బాబు, సీఎం సీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనేకమంది తమ సెల్‌ఫోన్లో అయన ఫొటోలను క్లిక్‌మనిపించారు. చంద్రబాబు చిరునవ్వుతో వారందరికీ చేతులు జోడించి అభివాదం చేశారు. అనంతరం ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. ప్రజలందరినీ కాపాడాలని కనకదుర్గమ్మను కోరుకున్నట్లు  తెలిపారు. రాజధాని నిర్మాణానికి ఆనాడు దేశంలోని పవిత్ర నదుల నుంచి, పవిత్ర ప్రదేశాలనుంచి నీరు మట్టి తీసుకువచ్చి అందరినీ భాగస్వాములను చేసి పనులు ప్రారంభించామని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దుర్గగుడిపై ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని.. రూ.150 కోట్లు కేటాయించామన్నారు.  దుర్గగుడిలో అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియని.. వాటిని కొనసాగించాలని సూచించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టడంపై వ్యాఖ్యానించాలని విలేకరులు కోరగా.. చంద్రబాబు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ కార్పొరేటర్‌ ఉమ్మడి వెంకటేశ్వరరావు(చంటి), వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేశ్‌, తెలుగు యువత నాయకుడు దేవినేని చందు తదితరులు పాల్గొన్నారు.


Read more