బీసీలకు న్యాయం చేసింది ఎన్టీఆరే: లక్ష్మణ్‌

ABN , First Publish Date - 2022-06-07T09:43:23+05:30 IST

‘‘బీసీలకు రెండు రాజ్యసభ సభ్యత్వాలు, ఏవో కొన్ని కార్పొరేషన్‌ చైౖర్మన్‌ పదవులు ఇచ్చి మేం న్యాయం చేసేశాం అంటే అది దారుణం.

బీసీలకు న్యాయం చేసింది ఎన్టీఆరే: లక్ష్మణ్‌

అమరావతి, జూన్‌ 6, (ఆంధ్రజ్యోతి): ‘‘బీసీలకు రెండు రాజ్యసభ సభ్యత్వాలు, ఏవో కొన్ని కార్పొరేషన్‌ చైౖర్మన్‌ పదవులు ఇచ్చి మేం న్యాయం చేసేశాం అంటే అది దారుణం. ఒకరకంగా చెప్పాలంటే బీసీలకు న్యాయం చేసింది ఎన్టీఆరే. ఆయన బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వీటిని 24 శాతానికి తగ్గించేసింది’’ అని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ అన్నారు. సోమవారం విజయవాడలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ‘‘నాయకత్వం సాధారణంగా కిందినుంచి ఎదుగుతుంది. కానీ ఇలా రిజర్వేషన్లు తగ్గించేయడం వల్ల బీసీల నాయకత్వం ఎదగకుండా మొగ్గలోనే తుంచేసినట్లయింది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం వల్లే దేవేందర్‌గౌడ్‌ లాంటి నేత టీడీపీలో నంబర్‌ టూ స్థానానికి చేరుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ పటేల్‌-పట్వారీ వ్యవస్థను రద్దుచేసి బీసీలకు విముక్తి కల్పించారు. ఆ వ్యవస్థను రద్దుచేయడం వల్లే బీసీలు స్వేచ్ఛగా మాట్లాడగలిగారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ బీసీలకు అత్యంత న్యాయం చేసేదిశగా ముందుకెళ్తున్నారు. దేశవ్యాప్తంగా బీసీలకు పెద్దపీట వేస్తున్నారు’’ అని కితాబిచ్చారు. కాగా, రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో లక్ష్మణ్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Read more