ఇక ఉద్యమమే!

ABN , First Publish Date - 2022-08-15T08:09:16+05:30 IST

ఇక ఉద్యమమే!

ఇక ఉద్యమమే!

ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల పోరుబాట 

విజయవాడ వేదికగా ఆర్టీసీ జేఏసీ ఉద్యమ పథం 

ఉద్యోగుల సమస్యలపై తాడేపల్లిలో ఎన్‌ఎంయూ భేటీ

కొద్ది రోజుల క్రితం విజయవాడలో ఈయూ సమావేశం 

మరో వారంలో సమావేశం కానున్న ఆర్టీసీ జేఏసీ

ప్రభుత్వంపై ఉద్యమం దిశగా కీలక నిర్ణయాలు


విజయవాడ, అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎ్‌సఆర్‌టీసీ) ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై అంతిమ సమరానికి సమాయత్తమవుతున్నాయి. ఆర్టీసీ విలీన, విలీనానంతర సమస్యలపై ప్రధాన ఉద్యోగ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి  ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్టీసీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ కనీస స్పందన రాకపోవడంతో.. ప్రధాన ఉద్యోగ సంఘాలు కార్మికులను సంఘటితం చేస్తున్నాయి. ఇటీవలే విజయవాడ వేదికగా ఆర్టీసీలో ప్రధాన సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి నేతలను సన్నద్ధం చేయగా.. ఆదివారం మరో ప్రధాన సంఘం ఎన్‌ఎంయూఏ తాడేపల్లి వేదికగా రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి నేతలను, ఉద్యోగులను ఉద్యమానికి సన్నద్ధం చేసింది. ఆర్టీసీ జేఏసీలో ఉన్న స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌), టీఎన్‌టీయూసీ అనుబంధం కార్మిక పరిషత్‌ (కేపీ) కూడా సమావేశాన్ని నిర్వహించుకోవాల్సి ఉంది. ఆర్టీసీలో వైఎ్‌సఆర్‌సీపీ అనుబంధ సంఘాలు మూడు ఉన్నాయి. వీటి పాత్ర చాలా పరిమితం. వీటిలో కూడా రెండు సంఘాలు ఆర్టీసీ జేఏసీతో కలిసి వెళ్లాలని నిర్ణయించాయి. దీంతో పాటు సూపర్‌వైజర్స్‌ అసోసియేషన్‌, అధికారుల సంఘాలు కూడా వేర్వేరుగా సమావేశాలు నిర్వహించుకుని తమ పరిధిలోని ఉద్యోగులను సమాయత్తం చేయనున్నాయి. ఈ సమావేశాల ప్రక్రియ పూర్తి కాగానే.. ఆర్టీసీ జేఏసీ సమావేశం కానుంది. జేఏసీ కన్వీనర్లు పలిశెట్టి దామోదరరావు, వై శ్రీనివాసరావుతో పాటు సీహెచ్‌ సుందరయ్య, పీవీ రమణారెడ్డి, వైవీ రావు, మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వంపై ఒంటరిగా ఉద్యమం చేస్తే ఉపయోగం లేదు కాబట్టి.. జేఏసీ వేదికగా ఐక్యంగానే పోరాడాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ప్రభుత్వంలో విలీనంతో పెన్షన్‌ అమలు చేయకపోగా... ఆర్టీసీలో దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించుకున్న అనేక పథకాలు, ప్రయోజనాలను విలీనం పేరుతో కోల్పోవాల్సి రావడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. 


మాకూ పీఆర్‌సీ చెల్లించాలి: ఎన్‌ఎంయూఏ 

‘ప్రభుత్వ ఉద్యోగులందరికీ జనవరి నుంచే పీఆర్‌సీ చెల్లిస్తున్నారు.. ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులే కదా.? మాకెందుకు అమలు చేయరు..’ అని ఎన్‌ఎంయూ అసోసియేషన్‌ ప్రశ్నించింది. పీవీ రమణారెడ్డి అధ్యక్షతన 26 జిల్లాల నుంచి వచ్చిన ఎన్‌ఎంయూ ప్రతినిధులు ఆదివారం సమావేశమై ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. విలీన, విలీనానంతర సమస్యలపై ఆర్టీసీ జేఏసీ నేతృత్వంలో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న లీవ్‌ ఎన్‌క్యా్‌ష్‌మెంట్‌, గ్రాట్యుటీ బకాయిలను తక్షణమే చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌ ఏపీ పీటీడీ సిబ్బందికి అమలు చేయాలని కోరారు. ప్రభుత్వంలో విలీనం పేరుతో నిలుపుదల చేసిన అలవెన్సులన్నీ వెంటనే పునరుద్ధరించాలన్నారు.

Read more