డీఎస్పీలతో పనిలేదా?

ABN , First Publish Date - 2022-09-10T09:38:49+05:30 IST

శాంతిభద్రతల పర్యవేక్షణలో డీఎస్పీల పాత్ర ఎంతో కీలకం. మన రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఆ విషయాన్నే మర్చిపోయింది.

డీఎస్పీలతో పనిలేదా?

  • సబ్‌ డివిజన్లలో ఇంచార్జిలతోనే పరిపాలన
  • పోస్టింగుల కోసం నెలలతరబడి  నిరీక్షణ
  • డీఎస్పీల బదిలీలు పట్టని రాష్ట్ర ప్రభుత్వం
  • విశాఖ,బెజవాడ కమిషనరేట్లలోనూ ఖాళీలు
  • ఎస్సీ,ఎస్టీ చట్టాల అమలుపై ప్రభావం


(అమరావతి, ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పర్యవేక్షణలో డీఎస్పీల పాత్ర ఎంతో కీలకం. మన రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఆ విషయాన్నే మర్చిపోయింది. జిల్లాల్లో పోలీస్‌ సబ్‌ డివిజన్లు ఉంటాయి. వాటికి డీఎస్పీలను నియమించాలి. పోలీసు సర్కిళ్లు, స్టేషన్లలో సిబ్బందిపై పర్యవేక్షణ ఉండాలి. అయితే, డీఎస్పీలతో పని లేదా అని అనుమానం వచ్చేలా.. వారి విషయాన్ని విషయాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. ఏపీలో 26పోలీస్‌ యూనిట్లు ఉంటే దాదాపు అన్నింటా ఏదో ఒక సబ్‌ డివిజన్‌ పోస్టు ఖాళీ ఉంది. అదేదో ఒక నెలో రెండు నెలలో కాదు.. ఆర్నెళ్లు, ఏడాది కూడా ఖాళీగా ఉన్నాయంటే శాంతి భద్రతల పర్యవేక్షణపై వైసీపీ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఉద్యోగం చేసేందుకు డీఎస్పీ స్థాయి అధికారులు సిద్ధంగా ఉన్నా.. పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్నా.. ప్రభుత్వం అవేవీ పట్టించుకోదు. పోలీసు శాఖ బదిలీల జాబితా పంపుతున్నా చూద్దాంలే అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఫలితంగా జిల్లాల్లో ఎవరో ఒక పొరుగు సబ్‌ డివిజన్‌ డీఎస్పీకి లేదా ఇతర లూప్‌లైన్‌ పోస్టుల్లో ఉన్న వారికి ఇంచార్జి బాధ్యతలు అప్పగించి పోలీసు ఉన్నతాధికారులు మమ అనిపిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ సబ్‌ డివిజనల్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వక పోవడం వెనుక పలు కారణాలు వినిపిస్తున్నాయి. కులం చూడం, మతం చూడం అని పదే పదే మైకుల ముందు చెప్పే ముఖ్యమంత్రి... డీఎస్పీలకు పోస్టింగ్‌లు ఇవ్వడంలో ఇప్పుడు అదే చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


 పోలీసు శాఖ పంపిన జాబితాలో మూడు సామాజిక వర్గాలకు చెందిన అధికారుల పేర్లు తీసేయాలని సీఎంవో నుంచి తిప్పిపంపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘నచ్చని’ ఆ మూడు వర్గాలకు చెందినవారికి సబ్‌ డివిజన్లు ఇవ్వొద్దని పోలీసు ఉన్నతాధికారులకు సూచించినట్లు డిపార్ట్‌మెంట్‌లో చర్చ జరుగుతోంది. దీంతో నెలలతరబడి సబ్‌ డివిజన్లు ఇంచార్జిల పర్యవేక్షణలోనే ఉన్నాయి. అనంతపురం జిల్లా అనంతపురం, కల్యాణదుర్గం సబ్‌ డివిజన్లలో ఇంచార్జి డీఎస్పీలు ఉండగా, సత్యసాయి జిల్లాలో హిందూపురం పరిస్థితి కూడా ఇంతే. చిత్తూరు జిల్లా నగరి, తిరుపతి జిల్లా నాయుడుపేట, కర్నూలు జిల్లా పత్తికొండ, నంద్యాల జిల్లాలో నంద్యాలకు పూర్తిస్థాయి డీఎస్పీలు లేరు. రాయలసీమ పరిస్థితి ఇలా ఉండగా గుంటూరు రేంజ్‌లో ఇటీవల దొంగతనాలు, హత్యలు జరుగుతున్నాయి. నెల్లూరులో ఎనిమిది నెలలుగా డీఎస్పీ లేరు. ప్రకాశం జిల్లా కనిగిరి, పొరుగున కొత్త జిల్లా బాపట్ల, గుంటూరు పశ్చిమ డీఎస్పీలు లేక నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రాష్ట్రంలోనే కీలక నగరమైన విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో ఉత్తర, దక్షిణ ఏసీపీలు ఇంచార్జిలే కొనసాగుతున్నారు. ఎప్పటికప్పుడు ఏదో గొడవ జరిగే రాజధాని ప్రాంత నగరంలో వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.


 ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమవరం, కొత్తపేట, రాజమహేంద్రవరం తూర్పు, పెద్దాపురం సబ్‌ డివిజన్లకు పూర్తిస్థాయి డీఎస్పీలు లేక నెలలు కావస్తోంది. కోనసీమ జిల్లాలో కొన్నినెలల క్రితం జరిగిన గొడవలతో అక్కడి ఎస్పీనే మార్చేసిన ప్రభుత్వం... డీఎస్పీల విషయంలో మాత్రం ఇంచార్జిలతో నెట్టుకొస్తోంది. తూర్పు గోదావరి జిల్లా(రాజమహేంద్రవరం) ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కేంద్ర సర్వీసులకు వెళ్లి పోవడంతో కోనసీమ ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డికి అదనపు బాధ్యత ఇచ్చి నెల రోజులు దాటింది. ఐపీఎస్‌ అధికారి అందులో జిల్లా ఎస్పీ పోస్టింగ్‌ విషయంలో కూడా ఇంత తాత్సారమా.? అనే వ్యాఖ్యలు, పెదవి విరుపులు పోలీసు శాఖలో వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలో తూర్పు, పశ్చిమ, దక్షిణ, హార్బర్‌ ఏసీపీలతో పాటు టాస్క్‌ఫోర్స్‌ కూడా ఖాళీగానే ఉంది. ఎస్‌సీ, ఎస్టీ సెల్‌ లేదా ట్రాఫిక్‌ డీఎస్పీల ఇంచార్జిలతో కొనసాగిస్తూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి అక్కడి పోలీసు ఉన్నతాధికారులది. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో అతిపెద్ద పారిశ్రామికవాడ ఉన్న పరవాడకు పూర్తిస్థాయి డీఎస్పీ లేరు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పాడేరులో ఏఎస్పీని నియమించాల్సిన ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో గంజాయి స్మగ్లింగ్‌పైనా ప్రభావం కనిపిస్తోందనే ఆరోపణలున్నాయి. విజయనగరం జిల్లా కేంద్రంతోపాటు చీపురుపల్లి డీఎస్పీ కూడా ఇంచార్జినే కొనసాగిస్తోన్న పోలీసుశాఖ, రాష్ట్రంలో చివరి జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్‌ సబ్‌ డివిజన్‌కు కూడా పూర్తిస్థాయి అధికారిని నియమించలేదు. 


హైకోర్టుకు ఎస్‌సీ, ఎస్టీలు..?

రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ శాంతి భద్రతల సబ్‌ డివిజన్లకు ఇంచార్జిలుగా వ్యవహరిస్తోన్న డీఎస్పీల్లో....ఎ్‌ససీ, ఎస్టీ కేసులు చూసే అధికారులే ఎక్కువగా ఉన్నారు. దీంతో తమ కేసులు పరిష్కారం కావడం లేదని, సుదీర్ఘ కాలంగా వాటి దర్యాప్తు, చార్జిషీట్ల దాఖలు కావట్లేదని ఎస్‌సీ, ఎస్టీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు మరో మూడు జిల్లాలకు చెందిన ఆ వర్గాల తరపున సోమవారం రాష్ట్ర హైకోర్టులో పిల్‌ దాఖలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న డీఎస్పీలు సైతం ఏదో ఒక పోస్టు ఇస్తే చాలని ఎదురు చూస్తున్నారు. 


నాన్‌ కేడర్‌ ఎస్పీల పరిస్థితీ అంతే..

రాష్ట్ర ప్రభుత్వం పలువురు అడిషనల్‌ ఎస్పీలకు నాన్‌ కేడర్‌ ఎస్పీలుగా కొన్ని నెలల క్రితం పదోన్నతి కల్పించింది. అయితే వారిని అడిషనల్‌ ఎస్పీ పోస్టుల్లోనే కొనసాగిస్తుండటంతో పదోన్నతి సంతోషాన్ని అనుభవించలేక పోతున్నారు. తమ హోదాకు తగిన పోస్టు ఏదో ఒకటి ఇస్తే వెళతామని ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నా.. ప్రభుత్వం నుంచి అనుమతి రానివ్వండి అని సమాధానాలు వస్తున్నాయి. మూడు నెలల క్రితం అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతి పొందిన అధికారులు సైతం డీఎస్పీగా పని చేసిన చోటే కొనసాగడం ఇబ్బంది కరంగా ఫీలవుతున్నారు. 

Updated Date - 2022-09-10T09:38:49+05:30 IST