అర్హులందరికీ ఉచిత రేషన్‌ అందడంలేదు

ABN , First Publish Date - 2022-09-13T09:12:39+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత రేషన్‌ బియ్యం అర్హులందరికీ అందడం లేదని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతీ పవార్‌ అన్నారు.

అర్హులందరికీ ఉచిత రేషన్‌ అందడంలేదు

  • రాష్ట్రంలో పీఎం ఆవాస్‌ యోజన సక్రమంగా లేదు
  • ఆయుష్మాన్‌ భారతే.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ: కేంద్రమంత్రి భారతి 

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత రేషన్‌ బియ్యం అర్హులందరికీ అందడం లేదని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతీ పవార్‌ అన్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆమె సోమవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నం, మోపిదేవి ప్రాంతాల్లో ప్రజల నుంచి రేషన్‌ బియ్యం సరఫరాపై ఫిర్యాదులొచ్చినట్లు వెల్లడించారు. ఒక్కో వ్యక్తికి కనీసం ఐదు కిలోలు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. మెరుగైన సౌకర్యాల కోసం కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నా.. ప్రధాన  మంత్రి ఆవాస్‌ యోజన రాష్ట్రంలో సరిగా అమలు కావడంలేదని ఆరోపించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగలేదని, కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్థలాల సేకరణలో వెనుకంజలో ఉందని మంత్రి వివరించారు. టిడ్కో ఇళ్లు పూర్తి కాలేదని, డిసెంబరులో స్థలాలిస్తామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పారని తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా పేదలకు మోదీ ప్రభుత్వం ఉచి వైద్య సేవలందిస్తుంటే, రాష్ట్రంలో పేరు మార్చి ఆరోగ్య శ్రీ కింద అమలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి కొత్త మెడికల్‌ కాలేజీలు కూడా ఇచ్చామని కేంద్ర మంత్రి భారతీ పవార్‌ గుర్తు చేశారు. కేంద్ర ప్రాజెక్టులు 60శాతానికి మించి పూర్తవలేదని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ప్రవాస్‌ యోజన రాష్ట్ర కన్వీనర్‌ పాకా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-13T09:12:39+05:30 IST