ఎటు చూసినా జ్వరాలే!

ABN , First Publish Date - 2022-07-18T08:02:34+05:30 IST

ఎటు చూసినా జ్వరాలే!

ఎటు చూసినా జ్వరాలే!

రాష్ట్రంలో విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు

డెంగీ, మలేరియాతో గ్రామాలు విలవిల

అల్లూరి, మన్యం జిల్లాల్లో అత్యధిక కేసులు

విశాఖ, విజయవాడ, తిరుపతిలోనూ అంతే

వేలల్లో కేసులు.. పదుల్లోనే అంటూ లెక్కలు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

సీజన్‌ మారింది.. వానలు జోరందుకున్నాయి.. వాటితోపాటే సీజనల్‌ రోగాలు విజృంభిస్తున్నాయి. ఏపీలో డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు కోరలు చాస్తున్నాయి. ఊహించని స్థాయిలో సీజనల్‌ వ్యాధులు నమోదవుతున్నాయి. సీజనల్‌ వ్యాధుల దెబ్బకు గ్రామాలు, ఏజెన్సీల విలవిల్లాడుతున్నాయి. అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో గిరిజన ప్రజల్ని సీజనల్‌ వ్యాధులు చుట్టముట్టాయి. గత మూడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా మలేరియా, డెంగీ, డయేరియా విజృంభిస్తున్నాయి. అయితే వర్షాకాలం ప్రారంభంలో ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన ప్రభుత్వం, ఆరోగ్య శాఖ.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,024 డెంగీ, 589 మలేరియా, 15 చికెన్‌గున్యా కేసులు నమోదయ్యాయి. కానీ.. అనాధికారిక లెక్కల ప్రకారం డెంగీ, మలేరియా కేసులు వేలల్లోనే నమోదవుతున్నాయి. జిల్లాల్లో వేలల్లో కేసులు నమోదవుతుంటూ.. ఆరోగ్యశాఖ లెక్కలు మాత్రం పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి. రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో డయేరియా విజృంభించింది. ఇప్పటి వరకూ ముగ్గురు మరణించడంతో పాటు 45 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ మధ్య కాలంలో కొన్ని జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఇంత జరుగుతున్నా ఆరోగ్యశాఖ మాత్రం కళ్లు తెరవడం లేదు. సాధారణంగా సీజనల్‌ వ్యాధుల నివారణకు ఆరోగ్యశాఖ ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలి. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని రకాలుగా సిద్ధం కావాలి. దోమల నివారణకు ఫాగింగ్‌కు, స్ర్పే చేసేందుకు అవసరమైన కెమికల్స్‌ సిద్ధం చేసుకోవాలి. బ్లీచింగ్‌ పౌడర్‌ అందుబాటులో ఉంచుకోవాలి. అయితే ఈ ఏడాది ఆరోగ్యశాఖ ఈ సామగ్రిని ఏర్పాటు చేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. 


అనుభవం లేని డీఎంవోలతో ఎలా..!

మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా వంటి వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు అవసరం. దీని కోసం ప్రతి జిల్లాల్లో జిల్లా మలేరియా అధికారులు (డీఎంవో) ఉంటారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత ఆరోగ్యశాఖ సిబ్బందికి సంబంధించి అంతా గందరగోళంగా ఉంది. సీజనల్‌ వ్యాధులు నివారణ కార్యక్రమాలను పర్యవేక్షించే డీఎంవోల విషయంలోనూ ఈ గందరగోళం నెలకొంది. 26 జిల్లాలకు సరైన డీఎంవోల నియామకం జరగలేదు. పాత డీఎంవోలే రెండు జిల్లాల్లో సీజనల్‌ వ్యాధుల నివారణ బాధ్యతలు భుజాన వేసుకున్నారు. దీంతో ఏ జిల్లాపైనా పూర్తిస్థాయిలో దృష్టి సారించ లేకపోతున్నారు. కొన్ని జిల్లాల్లో కొత్తగా చేరిన వైద్యుల్ని డీఎంవోలుగా నియమించారు. డీఎంవోలకు కనీసం 10, 15 ఏళ్లు వైద్యుడిగా పనిచేసిన అనుభవం ఉండాలి. ఎన్టీఆర్‌ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో అనుభవం లేని వైద్యుల్ని డీఎంవోలుగా నియమించారు. దీంతో వారి కింద పనిచేసే ఏఎంవోలు, ఎస్‌ఎంవోలు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల మధ్య సమన్వయం లోపం ఉంది. ఏఎన్‌ఎంలు గ్రామాల్లో పర్యటించకపోవడం వల్ల జ్వరపీడితుల్ని గుర్తించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో జిల్లా కేంద్ర కార్యాలయానికి మలేరియా, డెంగీ కేసులకు సంబంఽధించిన పూర్తిస్థాయి డేటా అందుబాటులోకి రావడం లేదు. 

Updated Date - 2022-07-18T08:02:34+05:30 IST