రైతుపై ధరల దరువు!

ABN , First Publish Date - 2022-08-17T08:50:51+05:30 IST

వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ తరహాలో ఎరువులు ధరలూ ఆకాశానంటుతున్నాయి

రైతుపై ధరల దరువు!

  • ఎరువుల ధరలు భారం
  • పొటాష్‌ రూ.700 దాకా పెరుగుదల
  • కాంప్లెక్స్‌ రూ.150-300.. డీఏపీ 150
  • అమ్మోనియం సల్ఫేట్‌ రూ.270
  • సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ రూ.125
  • ప్రైవేటు డీలర్లకు ఇండెంట్‌ తగ్గింపు
  • ఆర్బీకేలకే ఎక్కువగా మళ్లింపు
  • రిటైల్‌ దుకాణాల్లోనూ కొరవడిన ఎరువుల లభ్యత
  • జగన్‌ ప్రభుత్వ తీరుతో అన్నదాతకు తప్పని తిప్పలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ తరహాలో ఎరువులు ధరలూ ఆకాశానంటుతున్నాయి. ముడిసరుకుల ధరలు పెరిగాయన్న సాకుతో కంపెనీలు రసాయన ఎరువుల ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. కేంద్రప్రభుత్వ నియంత్రణ పూర్తి స్థాయిలో లేకపోవడంతో కంపెనీలే వీటి ధరలను నిర్ణయిస్తున్నాయి. ఒక నెలలో ఉన్న ధర మరో నెలలో ఉండడం లేదు. కేంద్రం కంపెనీలకు సబ్సిడీలు ప్రకటించినా.. ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్నాయంటూ ఒకటీ, రెండు కంపెనీలు మినహా మిగతావన్నీ గరిష్ఠ  చిల్లర ధరలు (ఎంఆర్‌పీ) పెంచేస్తున్నాయి. గతేడాది ధరతో పోల్చితే పొటాష్‌ బస్తాకు ఏకంగా రూ.700 దాకా పెరిగింది. కాంప్లెక్స్‌ ఎరువును రూ.150-300 దాకా పెంచారు. అమ్మోనియం సల్ఫేట్‌ రూ.270, డీఏపీ రూ.150, సింగల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ రూ.125 చొప్పున ఎంఆర్‌పీలు పెరిగాయి. కొన్ని కంపెనీల ధరల్లో బస్తాకు రూ.50 దాకా వ్యత్యాసం ఉన్నా.. రవాణా, బాడుగ ఖర్చుల పేరుతో ఆ మేరకు వసూళ్లు చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల రైతులు అధికంగా వినియోగించే యూరియా, డీఏపీలకు కేంద్రం రాయితీలిస్తోంది. అందువల్ల కాంప్లెక్‌ ఎరువుల కన్నా.. 


యూరియా తక్కువ ధరకు లభిస్తుంది. కానీ 50 కిలోల బస్తా రూ.266కు అమ్మాల్సి ఉండ గా, డిమాండ్‌ ఏర్పడినప్పుడు కొందరు రిటైలర్లు బ్లాక్‌ చేసి, రూ.350 దాకా వసూలు చేస్తున్నారు. యూరియా తయారీ కంపెనీలు డీలర్లకు డోర్‌ డెలివరీ ఇవ్వకపోవడం వల్ల రవాణా ఖర్చులు డీలర్లే భరించాల్సి వస్తోంది.   డీఏపీపై రాయితీ ఉన్నా.. ఇప్పుడు కాంప్లెక్స్‌ ఎరువుతో సమానంగానే ధర పలుకుతోంది. డీఏపీ బస్తా రూ.1,350 అమ్మాల్సి ఉండగా రూ.1,500 చొప్పున అమ్ముతున్నారు. కాంప్లెక్స్‌ ఎరువుల్లో వాడే ఎన్‌పీవీకి రాయితీలిస్తున్నా.. ప్రత్యక్షంగా రైతుకు ఆ రాయితీ అందని పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఆంధ్ర రైతులు వాడే ఎరువుల్లో సగానికి పైగా కాంప్లెక్స్‌ ఎరువులే. ధరలు ఈ రకంగా పెరిగితే.. వ్యవసాయం చేయడం కష్టమని రైతులు, కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కాలం ముగియకుండానే ఎకరానికి రూ.4-5 వేల పెట్టుబడి పెరుగుతుందని వాపోతున్నారు.


ఆర్బీకేల కోసం డీలర్లకు కోత

ప్రైవేటు డీలర్లకు ఎరువుల కేటాయింపుల్లో దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండగా, మన రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జగన్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైతుభరోసా కేంద్రాల(ఆర్బీకే)ల్లో ఎరువులు అమ్మడం కోసం కంపెనీల నుంచి అవి డీలర్లకు చేరకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ అనుమతితోనే కంపెనీలు ఎరువులను సరఫరా చేయాల్సిన విధానం వల్ల డీలర్లకు అనేక కంపెనీలు ఇండెంట్‌ ప్రకారం ఇవ్వకుండా కేటాయింపుల్లో కోత విధిస్తున్నాయని వాపోతున్నారు. పోనీ ఆర్బీకేల్లోనైనా అందుబాటులో ఉన్నాయా అంటే.. అన్ని రకాల ఎరువుల లభ్యత లేకపోగా.. రైతు అడిగిన వెంటనే ఇవ్వకపోవడం, అరువు లేకుండా రొక్కం కట్టి తీసుకోవలసి రావడం సన్న, చిన్నకారు రైతులకు ఇబ్బందిగా మారాయి. ఇఫ్కో కంపెనీ లారీ యూరియాకు 5 కేసుల నానో యూరియా తమకు అంటగడుతోందని వ్యాపారులు చెబుతున్నారు. మిగతా కంపెనీలూ ఇలా గే వ్యవహరిస్తున్నాయి. నిరుడు 18ు పెరిగిన క్రిమిసంహారక మందుల ధరలు ఈ ఏడాదీ 20% దాకా పెరిగాయి. ఎల్లో ఫాస్ఫేట్‌, పెట్రో కెమికల్‌ రేట్లు పెరగడం వల్ల క్రిమిసంహారక మందుల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.



Updated Date - 2022-08-17T08:50:51+05:30 IST