రక్తదాతలు కావాలి!

ABN , First Publish Date - 2022-10-01T04:39:32+05:30 IST

జిల్లాలో రక్తం అవసరాలు తీర్చేందుకు దాతల అవసరం చాలా ఉంది. ప్రతి 100 మందిలో 15 మంది రక్తదానం చేస్తేనే జిల్లాలో రక్తం అవసరాలు తీరుతాయి.

రక్తదాతలు కావాలి!
రక్తదానం చేస్తున్న దాతలు(ఫైల్‌)

 రక్తదానంపై కరోనా ప్రభావం 

 ఇప్పుడిప్పుడే దాతలు ఆసక్తి

70 శాతం మంది రోగులకు రెడ్‌క్రాసే ఆధారం

 స్వచ్ఛందంగా ఇచ్చే దాతలు తక్కువే 

 నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

నెల్లూరు (వైద్యం)సెప్టెంబరు 30 : జిల్లాలో రక్తం అవసరాలు తీర్చేందుకు దాతల అవసరం చాలా ఉంది. ప్రతి 100 మందిలో 15 మంది రక్తదానం చేస్తేనే జిల్లాలో రక్తం అవసరాలు తీరుతాయి. ప్రస్తుతం కేవలం ఐదుగురే రక్తదానం చేస్తుండటంతో రోగులకు అత్యవసరమైన రక్తం అవసరాలు తీర్చలేని దుస్ధితి నెలకొంది. అత్యవసర రోగులకు సరైన సమయంలో రక్తం అందక చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి. అందుకే రక్తదాతల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. అక్టోబరు ఒకటిన జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీర్మానించింది. రక్తదాన మోటివేటర్లను మరింత ఉత్సాహపరిచి రక్తదాతలను ప్రేరేపించేలా బ్లడ్‌బ్యాంకులు కృషిచేయాలని పిలుపునివ్వడంతో ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తోంది ప్రత్యేక కథనం.

రక్తదానంపై కరోనా ప్రభావం

రెండేళ్లుగా రక్త్తసేకరణలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా నుంచి కోలుకుంటున్న రక్తదాతలు ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో ముందుకు వస్తున్నారు.  జిల్లాలో 47 వేల మందికి పైగా రక్తదాతలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో చాలా మంది రక్తదానం అవసరాలను తీర్చలేక పోతున్నారు. దాతల సంఖ్య పెరిగితే ఆ అవసరాలు తీరుతాయి.

ముందంజలో  రెడ్‌క్రాస్‌ 

ఎంతో మంది రక్తదాతలకు తమ సహాయ సహకారాలు అందించడంలో జిల్లాలోని బ్లడ్‌ బ్యాంకులు కృషి చేస్తున్నాయి. జిల్లాలోనే రక్తం సేకరణలో జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ముందంజలో ఉంది. రెడ్‌క్రాస్‌ అత్యధికంగా ఏటా ప్రస్తుతం 20 వేల యూనిట్లకుపైగా రక్తాన్ని సేకరిస్తోంది. కరోనా కాలంలోనూ రోగులకు అవసరమైన మేర రక్తాన్ని అందించటంలో విశేషకృషి  చేసింది. ప్రస్తుతం 70 శాతం మంది రోగులకు రెడ్‌క్రాసే అవసరమైన రక్తాన్ని అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రుల రక్త అవసరాలు తీర్చటమే కాకుండా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి కూడా తన సహాకారం  అందిస్తోంది. ప్రస్తుతం రెడ్‌క్రాస్‌ రెండు ప్రత్యేక బస్సుల ద్వారా రక్తాన్ని సేకరించే సదుపాయం కలిగి ఉంది. రెడ్‌క్రాస్‌ కేంద్ర కార్యాలయం రూ. కోటితో రక్తం నిల్వలతో పాటు సేకరణలో అన్ని సదుపాయాలు ఉండే మరో బస్సును కూడా గుజరాత్‌ తర్వాత నెల్లూరుకు మాత్రమే కేటాస్తూ శుక్రవారం ప్రకటన చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జీజీహెచ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ఏటా ప్రస్తుతం రూ.2వేల యూనిట్లు కూడా సేకరించలేని స్థితిలో ఉంది. నారాయణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలోని బ్లడ్‌ బ్యాంక్‌ కూడా ఏటా వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తూ రక్తదాతలను ప్రోత్సహిస్తోంది. కావలి, ఆత్మకూరు, ఉదయగిరి ఏరియా ఆసుపత్రుల్లోని బ్లడ్‌ బ్యాంక్‌లు రెడ్‌క్రాస్‌ సహకారంతో రక్తాన్ని సేకరిస్తున్నాయి. నెల్లూరులో నోవా బ్లడ్‌బ్యాంక్‌, నెల్లూరు బ్లడ్‌బ్యాంక్‌, విజయ బ్లడ్‌బ్యాంక్‌లు కూడా రక్తం సేకరిస్తున్నాయి. 

గ్రామ స్థాయిలో రక్త సేకరణకు కృషి 

గ్రామ స్థాయిలో రక్తదాతలను ప్రొత్సహించి రక్తదాన సేకరణకు కృషి చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా రక్తదాతలను ప్రొత్సహించే విధంగా ఎంతో కృషి చేస్తున్నాం. రక్తదాన శిబిరాలు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కువ మంది యువత రక్తదానంపై ఆసక్తి చూపాలి. ఆ దిశగా కృషి చేస్తున్నాం. దాతల ద్వారా అత్యవసర రక్తం అందించేందుకు ప్రత్యేక చొరవ చూపు తున్నాం. 

చంద్రశేఖర్‌రెడ్డి (రెడ్‌క్రాస్‌ కమిటీ చైర్మన్‌)


రక్తదాతల సంఖ్య పెరగాల్సి న అవసరం ఉంది

జిల్లా వ్యాప్తంగా రక్తదా తలను ప్రొత్సహిస్తున్నాం. నావంతు జిల్లాలోనే అత్యధికంగా 110 సార్లు రక్తదానం చేశాను. అలాగే ఎంతో మంది రక్తదాతలను ప్రొత్సహిస్తున్నా. ప్రస్త్తుతం అవసరాల మేరకు రక్తం అందించలేక పోతున్నాం. గర్భిణులకు అవసరమైన రక్తం అందించేందుకు ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. ప్రస్తుతం దాతలు ముందుకు వస్తున్నా  పూర్తిస్థాయిలో వారి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. 

 మధుసూదన్‌ (రక్తదాత, మోటివేటర్‌)

Updated Date - 2022-10-01T04:39:32+05:30 IST