స్వర్ణలక్ష్మిగా వాసవీ కన్యకా పరమేశ్వరి

ABN , First Publish Date - 2022-10-02T05:07:04+05:30 IST

నగరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం 6వ రోజుకు చేరాయి. జోరువానను సైతం లెక్కచేయకుండా భక్తులు అమ్మవార్ల దర్శనాల కోసం తరలివచ్చారు.

స్వర్ణలక్ష్మిగా వాసవీ కన్యకా పరమేశ్వరి
చండీగా ఇరుకళల పరమేశ్వరి

కనువిందు చేస్తున్న అలంకారాలు

నెల్లూరు (సాంస్కృతికం) అక్టోబరు 1 : నగరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం 6వ రోజుకు చేరాయి. జోరువానను సైతం లెక్కచేయకుండా భక్తులు అమ్మవార్ల దర్శనాల కోసం  తరలివచ్చారు.ఈ సందర్భంగా ప్రదర్శిస్తున్న సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. నగరంలోని స్టోన్‌హౌస్‌పేటలోని వాసవీ కన్యకా పరమేశ్వరి స్వర్ణలక్ష్మి అలంకారంలో భక్తుకు దర్శనం ఇచ్చారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాఽథ్‌, రిచ్‌ గోల్డు అధినేతల సహకారంతో ఐదు కిలోల బంగారం, వజ్రాభరణాలతో మూలవిరాట్‌ అంతరాలయం అలంకారం జరిగింది. అమ్మవారికి బంగారు చీర అలంకారం వైభవంగా జరిగింది.

 కాళికగా రాజరాజేశ్వరి

నగరంలోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు కాళీకాదేవిగా దర్శనం ఇచ్చారు. అష్టాదశ పీఠంలో వెలసి ఉన్న అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అష్టాదశ పీఠం అలంకారాలలో ఒరిస్సా గిరిజాదేవి, దాక్షారామం మాణిక్యాంబదేవి అలంకారాలు కనువిందు చేశాయి. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భక్తుల క్యూలైన్‌లు పర్యవేక్షించారు. ఆదివారం నుంచి ముఖ్యమైన అలంకారాలు, భక్తుల రద్దీ కారణంగా వీఐపీ పాసులు రద్దు చేసినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. వీఐపీలందరూ చివరి ఉత్సవాల్లో రూ.30, రూ.100 టిక్కెట్లు కొని దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

 నగరంలోని కోదండరాపురంలోని మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మీ అలంకారం  దర్శనమిచ్చారు. ఉత్సవాలను ఆలయ చైర్మన్‌ ప్రత్తి నరసింహం, ధర్మకర్తలు పర్యవేక్షించారు. 

నవాబుపేట శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి ఆలయంలో ద్రౌపదీ అమ్మవారికి గాయత్రి అలంకారం జరిగింది. ఆలయ పునః నిర్మాణ కమిటీ చైర్మన్‌ మద్దూరి సుబ్బారావు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. 

విరాట్‌నగర్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గోవిందమాంబ అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాలను ఆలయ శాశ్విత అధ్యక్షుడు కందుకూరు చెంగయ్య ఆచారి, ఇందుకూరు రమేష్‌, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. 

 మహాత్మాగాంధీనగర్‌ కృష్ణమందిరంలో వైభవ లక్ష్మీకి గజలక్ష్మి అలంకారం వైభవంగా జరిగింది.

 అయ్యప్పగుడి గురువాయుర్పన్‌ మహావిష్ణు సమేత మహాలక్ష్మి ఆలయంలో మహాలక్ష్మీకి రాజ్యలక్ష్మి అలంకారం జరిగింది.  ఉత్సవాలను ఆలయ చైర్మన్‌ జి.శేషగిరిరావు, ధర్మకర్తలు పర్యవేక్షించారు. 

రంగనాయకులపేటలోని రంగనాథస్వామి ఆలయంలో ఉదయం తిరుమంజనం, రాత్రి ప్రాకార సేవలు జరిగాయి. ఆలయ ధర్మకర్తలు, ఈవో డి.వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. రంగనాయకులపేట వేదాంత దేశీకర్‌ ఆలయంలో తిరునక్షత్రం ఉత్సవాలలో వైభవంగా జరిగాయి. ఉదయం, సాయంత్రం పేట ఉత్సవాలు జరిగాయి. 

మూలాపేట శ్రీకృష్ణ ధర్మరాజుస్వామి ఆలయంలో ద్రౌపదీ దేవికి రాజరాజేశ్వరి అలంకారం జరిగింది. ఆలయ ధర్మకర్తలు, ఈవో ఆర్‌.వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. మూలాపేట మూలస్థానేశ్వరి ఆలయంలో భువనేశ్వరి అమ్మవారికి కాళికాదేవి అలంకారం కన్నుల పండువగా జరిగింది. ఉత్సవాలు ధర్మకర్తలు, ఈవో వేణుగోపాల్‌లు పర్యవేక్షించారు. 

ఇరుకళల పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇరుకళల పరమేశ్వరికి చండీ అలంకారం వైభవంగా జరిగింది. కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌ ఆర్‌.శ్రీనివాసులు, ఈవో పీవీకే ప్రసాద్‌లు పర్యవేక్షించారు. నవాబుపేట, ఫత్తేఖాన్‌పేట, మూలాపేటలలో ఉన్న మహాలక్ష్మీ ఆలయాల్లో అమ్మవార్లకు విశేష అలంకారాలు జరిగాయి. 

 త్యాగరాజస్వామి మందిరంలో సీతాదేవికి కాళికాదేవి అలంకారం, విశేష పూజలు జరిగాయి. ధర్మకర్తలు పర్యవేక్షించారు. 

నెల్లూరురూరల్‌ :   వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఆదిలక్ష్మి అమ్మవారు  విజయలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా నలుమూల నుంచి భక్తులు నరసింహకొండకు తరలివస్తున్నారు. కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌ వేమిరెడ్డి సురేంద్రరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. 

నెల్లూరు ( వెంకటేశ్వరపురం) : వెంకటేశ్వరపురంలో ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం గరుడసేవ , గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పండరి భజనలు, కోలాటాల నడుమ స్వామివారు వెంకటేశ్వరపురంలో తిరయాడారు. గరుడసేవ, గ్రామోత్సవానికి కత్తి ఏడుకొండలు,సరస్వతి, శ్రీహరి,సునీతలతో పాటు మాకిరెడ్డి జనార్దన్‌రెడ్డి,ఉమామహేశ్వరిలు ఉభయకర్తలుగా వ్యవహరించారు. 

Updated Date - 2022-10-02T05:07:04+05:30 IST