రెండు బ్యారేజీలు నెలాఖరుకు ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-16T06:53:11+05:30 IST

నెల్లూరు పెన్నా బ్యారేజీ, సంగంలోని మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ లను ఈనెలాఖరులో సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

రెండు బ్యారేజీలు నెలాఖరుకు ప్రారంభం
ఇరిగేషన్‌శాఖ మంత్రి అంబటికి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యేలు ప్రసన్న, శ్రీధర్‌రెడ్డి

ఇరిగేషన్‌శాఖామంత్రి అంబటి

ఎమ్మెల్యేలతో కలిసి నిర్మాణ పనుల పరిశీలన

ఇరిగేషన్‌ సెక్షన్‌ మార్పుపై ప్రసన్నకు వివరించండి


నెల్లూరు(వ్యవసాయం), ఆగస్టు 15 : నెల్లూరు పెన్నా బ్యారేజీ, సంగంలోని మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ లను ఈనెలాఖరులో సీఎం జగన్మోహన్‌రెడ్డి  ప్రారంభించనున్నారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. నెల్లూరులోని పెన్నా బ్యారేజీని నగర ఎమ్మెల్యే అనిల్‌తో కలిసి సోమవారం సాయంత్రం అయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  హయాంలో ప్రారంభమై వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను జగన్‌రెడ్డి పూర్తి చేస్తున్నారని చెప్పారు. అనిల్‌ మంత్రిగా ఉన్న  సమయంలో ఈరెండు బ్యారేజీల పనులు వేగంగా  పూర్తయ్యాయని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేసీ కూర్మనాథ్‌, టీజీపీ సీఈ  హరినారాయణరెడ్డి, ఎస్‌ఈ కృష్ణమోహన్‌, ఈఈలు నాగరాజు, అనిల్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు, ఆత్మకూరు ఆర్డీవోలు మలోల, కరుణ కుమారి,  తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సంగం బ్యారేజీ పనులను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. 


పనులన్నీ దాదాపుగా పూర్తి

సంగం, ఆగస్టు 15:   సంగం బ్యారేజీ పనుల పురోగతిపై మంత్రి అంబటి ఆరా తీశారు. దీంతో సీఈ హరినారాయణరెడ్డి మాట్లాడుతూ బ్యారేజ్‌ కుడివైపు ఉన్న కనుపూరు, నెల్లూరు చెరువు కాలువల రెగ్యులేటర్ల ఏర్పాటు, ఉన్న కాలువలకు అనుసంధానం పనులు, బ్యారేజ్‌ వంతెనపై రైయిలింగ్‌ కాంక్రీట్‌, కనిగిరి రిజర్వాయర్‌ కాలువ లైనింగ్‌  కొంతమేరకు తప్ప మిగతా పనులన్నీ నెలాఖరుకు పూర్తవుతాయని తెలిపారు.ఈ సందర్భంగా  అనంతసాగరం జడ్సీటీసీ వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ గత సీజన్‌లో వచ్చిన భారీ వరదతో అనంతసాగరం, సంగం మండలం కోలగట్ల రైతులు బాగా నష్టపోయారని మంత్రి దృష్టికి తెచ్చారు.  స్పందించిన మంత్రి అలా జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 


సెక్షన్‌ మార్పుపై ప్రసన్నకు వివరించండి

సంగం ఇరిగేషన్‌ సెక్షన్‌ను ఆత్మకూరు సబ్‌ డివిజన్‌కు మార్చడంపై మంత్రి ఆరా తీశారు. ఈ విషయమై ఇన్‌చార్జి ఎస్‌ఈ కృష్ణమోహన్‌ వివరణ ఇస్తూ సంగం మండలం ఆత్మకూరు నియోజకవర్గంలో ఉంది. ఇరిగేషన్‌ సెక్షన్‌ మాత్రం కోవూరు నియోజకవర్గంలో ఉన్న బుచ్చి సబ్‌ డివిజన్‌ పరిధి ఉంది.దీంతో ఆత్మకూరు ఎమ్మెల్యే ఇరిగేషన్‌ పనులపై సమీక్ష చేసేటప్పుడు సంగం మండలంలో జరిగే పనుల సమాచారం కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీంతో సంగం సెక్షన్‌ను ఆత్మకూరుకు మార్పు చేశామని తెలిపారు.అలా అయితే కోవూరు ఎమ్మెల్యేకి వచ్చిన ఇబ్బందేంటని  మంత్రి ప్రశ్నించగా, ఏం లేదని ఎస్‌ఈ తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఎమ్మెల్యే ప్రసన్నకు వివరించండని మంత్రి ఎస్‌ఈకి సూచించారు. 

 

‘సంగం’పై ఉత్తర్వులు నిలిపివేత 

మంత్రికి ఎమ్మెల్యే ప్రసన్న వినతిపత్రం


నెల్లూరు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): సంగం ఇరిగేషన్‌ సెక్షన్‌ను ఆత్మకూరు డివిజన్‌లోకి మారుస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేశారు. సీఈ హరినారాయణరెడ్డి ఆదేశాల మేరకు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఇరిగేషన్‌ ఎస్‌ఈ కృష్ణమోహన్‌ ప్రకటించారు. దీంతో పాత పద్ధతిలోనే పనులు, నీటి పారుదల పర్యవేక్షణను సెంట్రల్‌ డివిజన్‌ చూస్తుంది. సంగం సెక్షన్‌పై మూడు రోజుల్లో వేర్వేరు ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. కాగా సంగం సెక్షన్‌ను నెల్లూరు సెంట్రల్‌ డివిజన్‌ నుంచి తొలగించడంపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్‌ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంబటి రాంబాబును సోమవారం ఉదయం నెల్లూరులోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని వెంటబెట్టుకొని కలిశారు. బ్రిటీషు కాలం నుంచి సెంట్రల్‌ డివిజన్‌లో ఉన్న సంగం సెక్షన్‌ను ఇప్పుడు ఆత్మకూరు డివిజన్‌లోకి కలపడం ద్వారా పెన్నా డెల్టా ఆయకట్టుకు ఇబ్బందులు ఎదురవుతాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ప్రసన్న మంత్రికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి అంబటి వెంటనే ఇరిగేషన్‌ ఉన్నతాధికారులతో ఈ విషయంపై చర్చించారు.


ఎమ్మెల్యే మధ్య చిచ్చు

 కాగా ‘సంగం’ వ్యవహారం జిల్లాలోని ఎమ్మెల్యేల మధ్య చిచ్చు రాజేసింది. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సంగం సెక్షన్‌ను ఆత్మకూరులో కలపాలని కోరగా, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సమస్య గురించి కూర్చుని చర్చించుకోకుండా లేఖల పరంపర కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం ఇంకెంతదూరం వెళుతుందోనని అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Read more