పవిత్రస్థలం నుంచి వెళ్లమన్నందుకు హత్య

ABN , First Publish Date - 2022-09-25T05:35:36+05:30 IST

దర్గా పవిత్ర స్థలమని, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పినందుకు ముజావర్‌ని ఓ ఇద్దరు దారుణంగా హత్య చేశారు.

పవిత్రస్థలం నుంచి వెళ్లమన్నందుకు హత్య
నిందితుల వివరాలు తెలుపుతున్న ఇన్‌చార్జి డీఎస్పీ సుబహాన్‌

నిందితులు పాత నేరస్థులు

 గంటల వ్యవధిలో అరెస్టు

వివరాలు తెలిపిన ఇన్‌చార్జి డీఎస్పీ

నెల్లూరు(క్రైం): సెప్టెంబరు 24:  దర్గా పవిత్ర స్థలమని, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పినందుకు ముజావర్‌ని ఓ ఇద్దరు దారుణంగా హత్య చేశారు. హత్య జరిగిన గంటల వ్యవధిలో చిన్నబజారు పోలీసులు నింది తులను అరెస్టు చేశారు. నగర డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఇన్‌చార్జ్‌ డీఎస్పీ అబ్దుల్‌ సుబహాన్‌  ఆ వివరాలను వెల్లడించారు.

‘తమిళనాడు రాష్ట్రం కొల్లం ప్రాంతానికి చెందిన షేక్‌ సుల్తాన్‌ పదేళ్ల క్రితమే నెల్లూరు నగరానికి వచ్చి సీఏఎమ్‌ స్కూల్‌ దగ్గర ఉన్న మహబాబ్‌ సుభాన్‌ దర్గా వద్ద ముజావర్‌గా ఉంటున్నారు. మూలాపేటకు చెందిన షస్త్రక్‌ ఖాజా, ఫేక్‌ సోహెల్‌ అహ్మద్‌ గతంలో మద్యం తాగి దర్గా వద్దకు రాగా షేక్‌ సుల్తాన్‌ ఇది పవిత్ర స్థలమని, ఇక్కడి నుంచి వెళ్లమని చెప్పాడు. ఆ కక్షను  మనస్సులో పెట్టుకున్న వారిద్దరు ఈనెల 23 రాత్రి 11 గంటల ప్రాంతంలో మద్యం సేవించేందుకు దర్గా వద్దకు వచ్చారు. ఇక్కడ మద్యం సేవించకూడదని, వెళ్లాలని సుల్తాన్‌ చెప్పారు. దీంతో సోహెల్‌ అహ్మద్‌ సుల్తాన్‌ను వెనుక నుంచి పట్టుకోగా ఖాజా కత్తితో పొడిచి పరారయ్యారు. ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ సుల్తాన్‌ దగ్గరలో ఉన్న షేక్‌ కరిములా ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపారు. ఆయన వైద్యశాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా మృతి చెందాడు. దీంతో కరిముల్లా చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగర ఇన్‌చార్జ్‌ డీఎస్పీ అబ్దుల్‌ సుబహాన్‌, సీఐ సురేంద్రబాబు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ సంఘటనా స్థలంలో సాక్షాలను సేకరించాయి. ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఆదేశాలతో అప్పటికప్పుడే రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గంటల వ్యవధిలో ఇద్దరు నిందితులను శనివారం ఇరుగాళ్లమ్మ చెరువు కట్ట సంగం వద్ద అరెస్టు చేశారు.  వారు పాత నేరస్థులే. షేక్‌ ఖాజాపై 34కు పైగా పలు కేసులు ఉన్నాయి’ అని డీఎస్పీ వివరించారు. నిందితులను గంటల వ్యవధిలో అరెస్ట్‌ చేసిన ఇన్‌స్పెక్టర్‌ ఎ. సురేంద్రబాబు, ఎస్సై సైదులు, ఏఎస్‌ఐ శ్రీహరి, హెడ్‌కానిస్టేబుల్‌ సురేష్‌, కృష్ణ, కిషోర్‌ లను ఎస్పీ అభినందించారని డీఎస్పీ తెలిపారు. 

Updated Date - 2022-09-25T05:35:36+05:30 IST