థర్డ్‌ పార్టీ నివేదిక తర్వాతే ‘అల్లాయిస్‌’కు అనుమతులు

ABN , First Publish Date - 2022-10-01T04:38:59+05:30 IST

‘‘వెంకట్రావుపల్లి సమీపంలో అల్లాయిస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజలు, ప్రజాప్రతినిధుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటాం..

థర్డ్‌ పార్టీ నివేదిక తర్వాతే  ‘అల్లాయిస్‌’కు అనుమతులు
సమావేశంలో కౌన్సిలర్ల వాదులాట

ఫ్యాక్టరీ ఏర్పాటుపై అభ్యంతరాలు తీసుకుంటాం

ఆత్మకూరు మున్సిపల్‌ సమావేశంలో ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి 


ఆత్మకూరు, సెప్టెంబరు 30 : ‘‘వెంకట్రావుపల్లి సమీపంలో అల్లాయిస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజలు, ప్రజాప్రతినిధుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటాం.. థర్డ్‌ పార్డీతోనూ విచారించి తుది నివేదిక అందాక మున్సిపల్‌ కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటా’’మని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తెలిపారు. ఆత్మకూరు మున్సిపల్‌ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన మున్సిపల్‌ అత్యవసర సమావేశంలో టీడీపీ కౌన్సిలర్‌ షేక్‌ గౌస్‌బాష, అధికార పార్టీకి చెందిన మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ మహబూబ్‌ బాష మాట్లాడుతూ ధరణి ఫెర్రో అల్లాయిస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే విష వాయువుల వల్ల ప్రజలు రోగాల బారిన పడతారని వివరించారు. ఇలాంటి ప్రమాదకర ఫ్యాక్టరీకి అధికారులు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. ఈ విషయమై 17 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి మున్సిపల్‌ అంజెండాలో చేర్చాలని కమిషనర్‌కు వినతిపత్రం అందజేసినా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. దీంతో కో- ఆప్షన్‌ సబ్యుడితో వైసీపీ కౌన్సిలర్‌ చెరుకూరు కామక్షయ్యనాయుడు వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే స్పందిస్తూ అన్ని విషయాలు పరిశీలించకుండా ఫ్యాక్టరీకి అనుమతించమని తెలిపారు. థర్డ్‌ పార్టీ నివేదిక ఆధారంగానే అనుమతి ఇద్దామని నచ్చజెప్పారు. ముందుగా అజెండాలోని ఏడు అంశాలను కౌన్సిల్‌లో ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి. సమావేశం ముగిసినట్లు చైర్‌పర్సన్‌ వెంకటరమణమ్మ ప్రకటించగానే వైసీపీ కౌన్సిలర్‌ సూరా భాస్కర్‌రెడ్డి మాట్లాడేందుకు మైక్‌ తీసుకోగా ఎమ్మెల్యే వారించారు. సమావేశం ముగిసింది.. ఏదైనా మాట్లాడాలంటే బయటకురా.. అంటూ వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎం రమే్‌షబాబు, వైస్‌చైర్మన్లు శ్రావణకుమార్‌, షేక్‌ సర్దార్‌,  కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


పోలీసుల నిఘా

మున్సిపల్‌ సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకుంటుందన్న ఉద్దేశంతో ఎన్నడూ లేనివిధంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. సమావేశానికి ముందుగానే వైసీపీ కార్యలయంలో అధికార పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. సమావేశంలో ఎవరూ అనవసరంగా మాట్లాడి రాద్దాంతం చేయవద్దని ఎమ్మెల్యే సూచించినట్లు సమాచారం. దీంతో కౌన్సిలర్లు ఎవరూ మాట్లాడకుండా  ఉండిపోవడం గమనార్హం. అయితే కొందరు మున్సిపల్‌ కౌన్సిలర్లు ఎమ్మెల్యేతో కలవకుండా నేరుగా సమావేశ మందిరానికి రావడం తుది మొరుపు.


టిడ్కో లబ్ధిదారుల ఆవేదన

ఎమ్మెల్యే మున్సిపల్‌ కార్యాలయం బయటకు రాగానే సీపీఎం నాయకులు, పలువురు టిడ్కో లబ్ధిదారులు సమస్యలను ఏకరువు పెట్టారు. టిడ్కో గృహాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని, బస్సులు నిలిపేలా బస్‌స్టాప్‌ ఏర్పాటు చేయాలని, కొన్ని ఇళ్లకు మరమ్మతులు చేపట్టాలని, పూర్తిస్థాయిలో వీధిలైట్లు వేయించాలని కోరారు.   

Updated Date - 2022-10-01T04:38:59+05:30 IST