‘సోమశిల’లో 71 టీఎంసీల నీరు

ABN , First Publish Date - 2022-10-02T04:59:52+05:30 IST

రాయలసీమ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో సోమశిలకు వరద కొనసాగుతోంది. పెన్నానది పరివాహక ప్రాంతాల నుంచి శనివారం ఉదయం 35 వేల క్యూసెక్కులు చేరుతుండగా

‘సోమశిల’లో 71 టీఎంసీల నీరు
సోమశిల జలాశయంలో ఐదు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేసిన జలాలు

ఆరు గేట్లు ఎత్తి పెన్నమ్మ విడుదల


అనంతసాగరం, అక్టోబరు 1 : రాయలసీమ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో సోమశిలకు వరద కొనసాగుతోంది. పెన్నానది పరివాహక ప్రాంతాల నుంచి శనివారం ఉదయం 35 వేల క్యూసెక్కులు చేరుతుండగా దిగువకు 3, 4, 8, 9, 10, 12 గేట్లు ఎత్తి 30వేలు, వరద కాలువ ద్వారా కండలేరుకు 3వేలు, పవర్‌ టెన్నల్‌ ద్వారా డెల్టాకు 2500 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 71 టీఎంసీలు నిల్వ చేశారు. వచ్చే ప్రవాహం మరో మూడు రోజులపాటు కొనసాగవచ్చని అధికారులు తెలిపారు. అయితే, దిగువన తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు నదిలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. 


ఆనకట్ట వద్ద పెరిగిన నీటిమట్టం


సంగం : సోమశిలలో విడుదలవుతున్న నీరు శనివారం ఉదయం సంగం ఆనకట్టకు చేరాయి. 12,500 క్యూసెక్కుల  నీటి ప్రవాహంతో ఆనకట్ట వద్ద నీటిమట్టం క్రమేణ పెరుగుతోంది. దీంతో వాహన రాకపోకలకు ప్రమాదం పొంచి ఉండడంతో సెక్షన్‌ అధికారి వారధి గేట్లకు తాళాలు వేసి రాకపోకలను ఆపివేశారు. నూతన బ్యారేజీపై కూడా రాకపోకలు నిలిపివేయడంతో ఆనకట్ట దక్షిణం వైపు గ్రామాల వారు నెల్లూరు, జొన్నవాడ మీదుగా తిరిగి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


వహ్వా ‘కండలేరు’ అందాలు


రాపూరు, : కండలేరు డ్యాంలో జలఅందాలు కనువిందు చేస్తున్నాయి. డ్యాంలో 52టీఎంసీల నీరు నిల్వ ఉంది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు  చిరుజల్లులు కురుస్తుండటంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. 152 చదరపు కి.మీ విస్తీర్ణంలో నీరు విస్తరించి ఉండటం, గాలులు వీస్తుండటంతో డ్యాంలోని నీరు మట్టికట్టను ముద్దాడుతోంది. దీంతో నీటి అలలు కడలిని తలపిస్తున్నాయి. 

Updated Date - 2022-10-02T04:59:52+05:30 IST