సీజన మొదలు.. ఐఏబీ గుబులు

ABN , First Publish Date - 2022-10-07T04:40:49+05:30 IST

వ్యవసాయానికి కీలకమైన రబీ సీజన ప్రారంభమైంది. జిల్లాలో ప్రధాన నీటి వనరు సోమశిల, కండలేరు జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటం, అడపాదడపా కురుస్తున్న వర్షాలతో సాగుకు రైతాంగం సన్నద్ధమవుతోంది.

సీజన మొదలు..  ఐఏబీ గుబులు
నెల్లూరు : సర్వేపల్లి కాలువ పనుల కోసం టిప్పర్ల రాకపోకలకు అనుకూలంగా వేసిన మట్టిరోడ్డు

సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో!?

సాగుకు సన్నద్ధమవుతున్న రైతాంగం

నీటి విడుదలపై కానరాని స్పష్టత

ఆందోళనలో క్రాప్‌ హలిడే ఆయకట్టు రైతులు


నెల్లూరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయానికి కీలకమైన రబీ సీజన ప్రారంభమైంది. జిల్లాలో ప్రధాన నీటి వనరు సోమశిల, కండలేరు జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటం, అడపాదడపా కురుస్తున్న వర్షాలతో సాగుకు రైతాంగం సన్నద్ధమవుతోంది. అయితే, ఇప్పటివరకు జలాశయాల్లో నీటి విడుదలపై అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకోలేదు. సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం ఇంకా జరపకపోవడంపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. సర్వేపల్లి, జాఫర్‌సాహెబ్‌, ఉత్తర, దక్షిణ కాలువల కింద ఖరీఫ్‌ సీజనలో కర్షకులు క్రాప్‌ హాలిడే ప్రకటించారు. డెల్టాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. అటువంటి చోట్ల చెరువులను నింపితే తప్ప రైతులు నార్లు పోసుకోలేని పరిస్థితి. అదును దాటుతుండటంతో క్రాప్‌ హాలిడే ఆయకట్టు రైతులు భయపడుతున్నారు. సాగు ఆలస్యమైతే ధాన్యం అమ్మకాల సమయంలో ఇబ్బంది పడాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి కీలక సమయంలో కూడా అధికార యంత్రాంగం ముందుచూపుతో వ్యవహరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. రెండో పంటకు క్రాప్‌ హాలిడే ప్రకటించి పలు కాలువల్లో పనులు చేపట్టారు. ఇటీవల వరకు ఆ కాలువల్లో పనులు జరిగాయి. సీజన మొదలయ్యేలోపు నీటి పారుదలకు ఇబ్బందులు లేకుండా ఆ కాలువలను శుభ్రం చేయాల్సి ఉంది. కానీ ఇంకా కాలువల్లో మట్టి తొలగించలేదు. ప్రధానమైన సర్వేపల్లి, జాఫర్‌ సాహెబ్‌ కాలువల కింద దాదాపు లక్ష ఎకరాలు, మలిదేవి డ్రెయిన కింద కూడా డెల్టా ఆయకట్టు ఉంది. ఈ కాలువల్లో పూడిక తొలగించలేదు. అది తొలగిస్తే తప్ప నీరు విడుదల చేయలేరు. సమయం దగ్గర పడుతున్నా ఇరిగేషన శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


ఆలస్యమైతే నష్టం..


పెన్నా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిలకు భారీగా వరద వస్తోంది. ఇప్పటికే డ్యాంలో 70 టీఎంసీలకుపైగా నీరుంది. అలానే కండలేరులో ప్రస్తుతం 53 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది. ఈ నీటితో ఉమ్మడి నెల్లూరు జిల్లాతోపాటు తిరుపతి జిల్లాలోని ఆయకట్టుకు కూడా సాగు నీటి కేటాయింపులు జరపవచ్చు. సోమశిల కింద 5.50 లక్షల ఎకరాలు, కండలేరు కింద రూ.3.50 లక్షల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. మొత్తంగా 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ సీజనలో నీటి కేటాయింపులు జరిపేందుకు అవకాశం ఉంది. ఈ కేటాయింపులు త్వరగా నిర్ణయించి నీటి విడుదల మొదలుపెడితే రైతాంగం అందుకు తగిన విధంగా సన్నాహాలు చేసుకుంటుంది. ఆలస్యమయ్యే కొద్దీ ఆ ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై పడుతుంది. గత సీజనలో కూడా ఆలస్యంగా నార్లు పోయడం, ఆ తర్వాత వరదలు రావడంతో ఆ నార్లన్నీ నీట మునిగాయి. దీంతో మరోమారు నార్లు పోసుకొని నాట్లు వేసుకునేలోపు సాగు బాగా ఆలస్యమైంది. దీంతో మే వరకు వరి కోతలు జరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్‌తో రబీ కొనుగోళ్లు ముగియడంతో మళ్లీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చే వరకు ధాన్యం విక్రయించుకునేందుకు రైతులు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇది అటు రైతులకు, ఇటు అధికార యంత్రాంగానికి ఇబ్బందిగా మారింది. అయితే ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఏప్రిల్‌లోపు వరి కోతలు ముగించగలిగితే రైతుకు బహిరంగ మార్కెట్‌లో కూడా గిట్టుబాటు ధర దక్కే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. త్వరగా ఐఏబీ నిర్వహించి నీటి విడుదల చేపట్టాలని వారు సూచిస్తున్నారు. 


15లోపు ఐఏబీని నిర్వహిస్తాం


రైతులకు ఇబ్బందులు లేకుండా నార్లు పోసుకునేందుకు నీరిస్తున్నాం. సర్వేపల్లి కాలువలో మట్టి తొలగించాలని ఆదేశించాం. ఈ ప్రక్రియ పూర్తి కాగానే నీరు విడుదల చేస్తాం. ఈ నెల 15వ తేదీలోపు ఐఏబీని నిర్వహిస్తాం. కాలువల్లో పూడికతీతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అనుమతులు రాగానే టెండర్లు పలిచి ఆ పనులు కూడా పూర్తి చేస్తాం.

- కృష్ణమోహన, ఇరిగేషన ఎస్‌ఈ

Updated Date - 2022-10-07T04:40:49+05:30 IST