బడికి వేళాయె!

ABN , First Publish Date - 2022-07-05T05:52:44+05:30 IST

జిల్లాలోని 3,378 ప్రభుత్వ పాఠశాలల్లో 2,12,720 మంది విద్యార్థులు ఉండగా, ఈ సంఖ్య కొత్త విద్యాసంవత్సరంలో మరింత పెరిగే అవకాశం ఉంది.

బడికి  వేళాయె!

నేడు పాఠశాలల పునఃప్రారంభం

బడుల్లో ఎక్కడి సమస్యలు అక్కడే!

దుస్థితిని మార్చని ‘నాడు-నేడు’

ఇక్కట్లతో విద్యాసంవత్సరానికి స్వాగతం


65 రోజుల తర్వాత మళ్లీ బడిగంట మోగనుంది. ఇన్నాళ్లు ఆటపాటలతో గడిపిన పిల్లలు మంగళవారం నుంచి స్కూళ్ల బాట పట్టనున్నారు. నిశ్శబ్దం ఆవహించిన పాఠశాలలు ప్రార్థన గీతాలతో సందడిగా మారనున్నాయి. నూతన విద్యా సంవత్సరం మంగళవారం ప్రారంభం కానుండగా, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. పాఠశాల విద్యారంగంలో అనేక మార్పులను ప్రభుత్వం చేపడుతున్నా మౌలిక సదుపాయాల కల్పనలో ఏటా లోటు కనిపిస్తూనే ఉంది. ఒకవైపు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు హంగు, ఆర్భాటాలతో విస్తృత ప్రచారం చేస్తూ  ప్రవేశాల సంఖ్య పెంచుకుంటుండగా, సర్కారు బడుల్లో  సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. నాడు-నేడు పనులతో స్కూళ్లను అందంగా తీర్చిదిద్దుతున్నామని, నాణ్యమైన విద్యావిధానం అందచేస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నా  ఆచరణలో మేడిపండు చందంగా మారుతోంది.


నెల్లూరు (విద్య) జూలై 4 : జిల్లాలోని 3,378 ప్రభుత్వ పాఠశాలల్లో 2,12,720 మంది విద్యార్థులు ఉండగా,  ఈ సంఖ్య కొత్త విద్యాసంవత్సరంలో మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే  పలు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. నాడు-నేడు పనులు చేపడుతున్నామని, త్వరలోనే వీటిని పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో వేసవిలో చేపట్టాల్సిన పనులు నిర్వహించలేదు. ఫలితంగా పాఠశాలల్లో మంచినీటి సమస్య వెంటాడుతూనే ఉండగా, మరుగుదొడ్లు ఆశించినస్థాయిలో లేవు. ఇక పాఠశాలలకు ప్రహరీలు లేక రక్షణ కరువైంది. తగినన్ని తరగతి గదులు లేని పాఠశాలలు కొన్ని ఉండగా నిధుల లేమి కారణంగా పలు పాఠశాలల్లో శిథిల దశకు చేరుకున్నా మరమ్మతులు చేయలేదు. 


అభ్యసన కార్యక్రమాలకు శ్రీకారం

పాఠశాలల్లో అభ్యసన కార్యక్రమాల నిర్వహణకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అకడమిక్‌ క్యాలెండర్‌లోని లెసన్‌ ప్లాన్‌ ప్రకారం అన్ని యాజమాన్యాల్లోని స్కూళ్లూ విద్యా అభ్యసన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. నెలవారీ కార్యక్రమాలు, లక్ష్యాలు, వాటి సాధన వంటి అంశాలను తెలియచేశారు. పాఠశాలలన్నీ మంగళవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరానికి మొత్తం 220 రోజులు పాఠశాలలు పని చేయనుండగా, 80 రోజులు సెలవు దినాలు ఉంటాయి. 


పాఠశాలల సమయాలు...

పాఠశాలల నిర్వహణ సమయాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఫౌండేషన్‌ స్కూళ్లు (1, 2 తరగతులు, 1 నుంచి 5వ తరగతుల స్కూళ్లు) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పని చేస్తాయి. గేమ్స్‌, రెమిడియల్‌ తరగతుల కోసం ఆప్షనల్‌ పీరియడ్‌ను 3.30 నుంచి 4.30 గంటల వరకు ఇవ్వాలి. హైస్కూళ్లు (3 నుంచి 7, 8 తరగతుల వరకు, 3 నుంచి 10వ తరగతుల వరకు, 11, 12 తరగతులు, 6 నుంచి 10వతరగతి వరకు) ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. ఆప్షనల్‌ పీరియడ్‌ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. వివిధ సబ్జెక్ట్‌ల వెయిటేజీ ప్రకారం పీరియడ్లు నిర్వహించనున్నారు. 1 నుంచి 5 తరగతులకు వారానికి 240 పీరియడ్లు ఉంటాయి. హైస్కూళ్లలో అన్ని సబ్జెక్ట్‌లకు వెయిటేజీని ప్రకటిస్తూ వారానికి 384 పీరియడ్లను కేటాయించారు. 


నేడు విద్యాకానుక పంపిణీ..

ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులందరికీ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో   మంగళవారం నుంచి జగనన్న విద్యాకానుక పేరుతో కిట్‌లను పంపిణీ చేస్తున్నట్లు డీఈఓ రమేష్‌ తెలిపారు. ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం క్లాత్‌, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, రెండు జతల బూట్లు, రెండు జతల సాక్సులు, బ్యాగ్‌, నిఘంటువు అందజేస్తారు.  పంపిణీ చేయాల్సిన కిట్‌లలో డ్యామేజీలు, సరిపడని సైజులు ఉంటే సంబంధిత హెచ్‌ఎంలు ఎంఆర్సీ కేంద్రం స్కూల్‌ కాంప్లెక్స్‌లో ఉంచిన స్టాక్‌ రిజిస్టర్‌లో వివరాలను నమోదు చేసి డీఈఓ లేదా ఎస్‌ఎ్‌సఏ ఏపీసీకి తెలియచేయాలని డీఈవో సూచించారు. 


కేజీబీవీల్లో బదిలీలకు పచ్చజెండా

ఐదేళ్లు సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా స్థానచలనం

ప్రభుత్వం ఉత్తర్వుల జారీ


నెల్లూరు (విద్య)/సీతారామపురం, జూలై 4 : కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో పని చేస్తున్న బోధనా సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.జీబీవీల్లో పనిచేస్తున్న ప్రత్యేకాధికారులకు ఐదేళ్లు సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ చేయాల్సిందే. సీఆర్‌టీ, పీఆర్‌టీ, పీఈటీలు, ఒకేచోట ఎనిమిదేళ్లు ఉంటే తప్పనిసరిగా బదిలీ చేయాలి.  2022 మే 31వ తేదీ వరకు పని చేసిన కాలానికి లెక్కిస్తారు.ఈ బదిలీలు జిల్లా పరిధిలో మాత్రమే చేయాలని ఆదేశించారు. అంతర్‌ జిల్లా కావాలంటే మ్యూచువల్‌ ఉంటే చేస్తారు. 


 కలెక్టర్‌ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీ

బదిలీ ప్రకియ్ర నిర్వహణకు కలెక్టర్‌ చైౖర్మన్‌గా, నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. సమగ్రశిక్ష ఏపీసీ కన్వీనర్‌గా, డీఈవో ఎక్స్‌అఫీషియో మెంబరుగా, డైట్‌ ప్రిన్సిపాల్‌ సభ్యులుగా ఉంటారు. ఖాళీలు, సీనియారిటీ జాబితా తయారీ వివరాలను వీరు పరిశీలించాల్సి ఉంటుంది. 


ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు

అర్హులకు ఆన్‌లైన్‌లో ద్వారానే బదిలీలు నిర్వహిస్తారు. ఏపీసీఎ్‌ఫఎ్‌సఎస్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తును ప్రింట్‌ తీసి, జిరాక్స్‌ కాపీలతో సమగ్రశిక్ష ఏపీసీ కార్యాలయంలో సమర్పించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రొవిజన్‌ సీనియారిటీ జాబితా విడుదల చేస్తారు. అనంతరం అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇస్తారు. ఆన్‌లైన్‌లో ఒకసారి దరఖాస్తు చేసిన తర్వాత రెండోసారి చేసేందుకు అనుమతి ఉండదు. ఈ విషయమై ఎలాంటి వినతులు ఇవ్వాలన్నా ఈ ప్రక్రియ పూర్తయిన వారంలోగా రాష్ట్ర పీడీకి సమర్పించాల్సి ఉంటుంది. 




Updated Date - 2022-07-05T05:52:44+05:30 IST