శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-27T03:10:40+05:30 IST

పట్టణంలోని శివాలయంలోని అన్నపూర్ణాదేవి ఆలయంలో సోమవారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు

శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
ఆత్మకూరులో ప్రత్యేక అలంకరణలో అన్నపూర్ణాదేవి

 అమ్మవార్లకు విశేష పూజలు, అలంకరణలు

ఆత్మకూరు, సెప్టెంబరు 26: పట్టణంలోని శివాలయంలోని అన్నపూర్ణాదేవి ఆలయంలో సోమవారం  అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజారి శివకుమార్‌శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్రం సెంటర్‌లోని  కన్యకాపరమేశ్వరి ఆలయంలో  కలశ స్థాపన, అమ్మవారికి అభిషేకం, శ్రీవాసవీ అష్టోత్తర పూజలు నిర్వహించారు. అమ్మవారు భువనేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాలలో ఆలయ కమిటీ నిర్వాహకులు, ఆర్యవైశ్యసంఘం నేతలు, పలువురు భక్తులు పాల్గొన్నారు.  అలాగే ఉత్తరబలిజవీధిలో ఉన్న శ్రీజ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో ఉదయం శ్రీదేవి ఖడ్గమాల విశేషపూజలు, కలశస్థాపన, కుంకుమార్చన, అభిషేకం నిర్వహించారు. అమ్మవారు స్వర్ణకవచాలాంకృత జ్వాలాముఖిగా దర్శనమి చ్చారు. తిరునాళ్లతిప్ప శ్రీకాశీనాయన ఆశ్రమ ఆవరణలో  ఉన్న శ్రీదుర్గామల్లేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులను అలరించారు.

సంగం : స్థానిక సంగమేశ్వరాలయంలో  అమ్మవారు కామాక్షిదేవి అలంకారంలో సోమవారం దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు. కార్యక్రమానికి ఇరిగేషన్‌ ఏఈ బీ కృష్ణ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించి, స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో కలశ స్థాపన ఏర్పాటు చేశారు. కలశ స్థాపనకు కాకు బ్రదర్స్‌ ఉభయకర్తలుగా వ్యవహరించారు. గంగమ్మ ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పెన్నానది నుంచి జలాలు తెచ్చి అభిషేకాలు, కలశ స్థాపన చేశారు. అనంతరం గంగమ్మ మూలవిరాట్‌కు చందనాలంకారం ఏర్పాటు చేశారు. 

ఉదయగిరి : దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయగిరి శివాలయంలో స్వర్ణకవచాలంకృతదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అర్చకులు అనిల్‌శర్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే మండలంలోని గండిపాళెంలో వెలసి ఉన్న నాగారప్పమ్మ, ఉదయగిరి బాలాజీనగర్‌లో దుర్గాదేవి అమ్మవారు స్వర్ణకవచాలంకృతదుర్గాదేవిగా భక్తులకు ధర్మనమిచ్చారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. 

వరికుంటపాడు : మండలంలోని తూర్పురొంపిదొడ్లలో వెలసి ఉన్న శ్రీమానసాదేవి  ఆలయంలో సోమవారం దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. చల్లా వంశస్థుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాల్లో తొలిరోజు శైలపుత్రి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గణపతి పూజ, అభిషేకాలు, పుణ్యహవచనం, కుంకుమార్చనలతోపాటు గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. వరికుంటపాడు నాగారప్పమ్మ ఆలయంలోనూ పుట్టబంగారం, కలశస్థాపన, అభిషేకం, అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. 


--------

Read more