సిమెంట్‌ చెదిరింది.. రాయి తేలింది..!

ABN , First Publish Date - 2022-06-13T03:34:46+05:30 IST

ఉదయగిరి పట్టణంలోని పలు వీధుల్లో సిమెంట్‌ రోడ్లు అధ్వానంగా మారాయి. ఏ వీధిలో చూసినా సిమెంట్‌ చెదిరిపోయి గుంతలు ఏర్పడి కంకరరాళ్లు బయటపడ్డాయి.

సిమెంట్‌ చెదిరింది.. రాయి తేలింది..!
నాగులబావివీధిలో కంకరరాళ్లు తేలి ప్రమాదకరంగా సిమెంట్‌ రోడ్డు

రాకపోకలకు ఆగచాట్లు

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 12: ఉదయగిరి పట్టణంలోని పలు వీధుల్లో సిమెంట్‌ రోడ్లు అధ్వానంగా మారాయి. ఏ వీధిలో చూసినా సిమెంట్‌ చెదిరిపోయి గుంతలు ఏర్పడి కంకరరాళ్లు బయటపడ్డాయి. దీంతో ఆయా రహదారులపై రాకపోకలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో వాహనదారులు గుంతలు సరిగా కనపడక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక పాదాచారులు అధ్వానంగా ఉన్న రహదారులపై రాకపోకలు సాగించలేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని కోళ్లవీధి, నాగులబావివీధి, యాదవపాళెం, అగ్రహారం, వాల్మీకివీధి, వాయుగండ్లవారివీధి, దిలావర్‌భాయ్‌వీధి, దేవలాలగడ్డ, బ్రాహ్మణవీధి, తుపాన్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. దశాబ్దాల క్రితం వేసిన రోడ్లు కావడం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో రోడ్లు ఛిద్రమయ్యాయి. భారీ వాహనాలు రాకపోకల సమయంలో రోడ్లు కుంగి రాకపోకలకు ఆటంకంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాటిలోతు గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.Read more