రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2022-06-08T03:11:08+05:30 IST

రోడ్డుపై నిలిపి ఉన్న టెంపో వాహనాన్ని వెనుక వైపు నుంచి టాటా ఏస్‌ గూడ్స్‌ బండి ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రఘు

కావలి రూరల్‌, జూన్‌ 7: రోడ్డుపై నిలిపి ఉన్న టెంపో వాహనాన్ని వెనుక వైపు నుంచి టాటా ఏస్‌ గూడ్స్‌ బండి ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కావలి పట్టణం ఉదయగిరి రోడ్డులోని పోలీస్‌ పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా సోమవారం అర్ధరాత్రి జరిగింది.  రెండోవ పట్టణ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని వైకుంఠపురంకు చెందిన టీడీపీ రాష్ట్ర ఐటీడీపీ కార్యదర్శి కంచర్ల రఘు వైకుంఠపురం సెంటర్‌లో మహా సూపర్‌ మార్టు నిర్వహిస్తున్నారు. ఆదే మార్టులో సరుకుల రవాణాకు టాటా ఏస్‌ ఆటో డ్రైవర్‌గా మద్దూరుపాడుకు చెందిన శ్రీకాంత్‌ పనిచేస్తున్నాడు. మార్టు నుంచి బోగోలు, జలదంకి మండలాల్లోని షాపులకు కిరాణా సరుకులు సరఫరా చేసేందుకు మంగళవారం సాయంత్రం వెళ్లిన వారు తిరిగి వస్తూ మరో 5 నిమిషాల్లో ఇంటికి చేరుతామన్న తరుణంలో ప్రమాదానికి గురయ్యారు. డ్రైవర్‌ శ్రీకాంత్‌కు తీవ్రగాయాలు కాగా రఘు వాహనంలో ఇరుక్కు పోయాడు. గుర్తించిన పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది, సమీపంలోని కరెంట్‌ ఆఫీస్‌ సిబ్బంది, రెండోవ పట్టణ పోలీసులు అర్ధగంట పాటు శ్రమించి వాహనంలో ఇరుక్కుని ఉన్న రఘును బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో పట్టణంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. గాయపడిన రఘును పలువురు టీడీపీ నాయకులు పరామర్శించారు. రెండవ పట్టణ ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుననట్లు తెలిపారు.

Updated Date - 2022-06-08T03:11:08+05:30 IST