మున్సిపల్‌ కమిషనర్‌ వేధింపులపై విచారణ జరపాలి

ABN , First Publish Date - 2022-01-04T04:00:20+05:30 IST

మేస్త్రీలుగా కొనసాగాలంటే ప్రతి నెల రూ.6వేల ఇవ్వాలని, లేకపోతే పారిశుధ్య పనులు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ వేధిస్తున్నారని మేస్త్రీలు సోమవారం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.

మున్సిపల్‌ కమిషనర్‌ వేధింపులపై విచారణ జరపాలి
ఆర్డీవో శీనానాయక్‌కు వినతిపత్రం ఇస్తున్న మున్సిపల్‌ మేస్త్రీలు, సీఐటీయూ నేతలు

ఆర్డీవోకు మేస్త్రీలు, సీఐటీయూ నేతలు ఫిర్యాదు

కావలిటౌన్‌, జనవరి 3: మేస్త్రీలుగా కొనసాగాలంటే ప్రతి నెల రూ.6వేల ఇవ్వాలని, లేకపోతే పారిశుధ్య పనులు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ వేధిస్తున్నారని మేస్త్రీలు సోమవారం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ప్రతినెల ఒక్కో మేస్త్రీ నుంచి ఆరువేల చొప్పున హెల్త్‌ అలెవెన్సుల నగదు తీసుకుంటున్నారని, ప్రశ్నిస్తే పారిశుధ్య పనులు చేయాలని బెదిరిస్తున్నారని వాపోయారు. సీఐటీయూ గౌరవాధ్యక్షుడు పీ పెంచలయ్య మాట్లాడుతూ మేస్త్రీలు ప్రతినెల ఆరువేల చొప్పున కమిషనర్‌కు చెల్లిస్తె చాలీచాలని జీతాలతో వారెలా బ్రతకాలన్నారు. మేస్త్రీలు డబ్బులివ్వలేమని కమిషనర్‌ను ఎన్నిసార్లు వేడుకున్న ఆయన కనికరించడంలేదని వాపోయారు. మున్సిపల్‌ కార్మికులు, స్కూల్‌ స్వీపర్ల జీతాల్లో కోతలు పెట్టిన ఘనుడు కమిషనర్‌ అన్నారు. షాపుల యజమానులు, కొత్తగా భవనాలు, షాపులు నిర్మించుకునే వారిదగ్గర చిరు వ్యాపారుల వరకు డబ్బులు వసూలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అండతో ఆయన ఆగడాలు ఎక్కువయిపోతున్నాయన్నారు. కమిషనర్‌ దండకాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఆయన తీరు మారకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు కృష్ణమోహన్‌, పెంచలనరసింహ, మేస్త్రీలు పాల్గొన్నారు. 


Read more