రంగడు భూమికే ఎసరు!

ABN , First Publish Date - 2022-09-28T04:48:28+05:30 IST

‘‘దేవుడి భూమా!? అయితే మాకెంటి!? మేము ఎంచుకున్న దారి ఇది. దేవుడి మాణ్యమైనా మా చేతుల్లోకి రావాల్సిందే’’నంటూ అధికార పార్టీ నేతలు పేట్రేగిపోతున్నారు.

రంగడు భూమికే ఎసరు!
రంగనాథస్వామి భూమిలో రోడ్డు ఏర్పాటుకు జరుగుతున్న పనులు

సౌతఆములూరులో స్వామివారికి 13 ఎకరాలకుపైగా మాణ్యం

జగనన్న లే అవుట్‌కు రోడ్డు పేరిట ఆక్రమణ

దేవదాయ శాఖ అడ్డుపడుతున్నా ససేమీరా

రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు

అయినా అధికార పార్టీ నేతల బరితెగింపు


నెల్లూరు (సాంస్కృతికం), సెప్టెంబరు 27 : ‘‘దేవుడి భూమా!? అయితే మాకెంటి!? మేము ఎంచుకున్న దారి ఇది. దేవుడి మాణ్యమైనా మా చేతుల్లోకి రావాల్సిందే’’నంటూ అధికార పార్టీ నేతలు పేట్రేగిపోతున్నారు. నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామివారికి తోటపల్లిగూడూరు మండలం సౌత ఆములూరులో 13 ఎకరాలకుపైగా మాన్యం ఉంది. అయితే, ఆ పక్కనే వేసిన జగనన్న లే అవుట్‌కు రోడ్డు కోసం నాలుగెకరాల స్వామివారి భూమిని ఆక్రమించేశారు. ఆలయ పాలకవర్గం, దేవదాయ శాఖ అధికారులు కలెక్టర్‌, ఎస్పీలకు వినతులు అందజేసినా స్పందన లేదు. 

తోటపల్లిగూడూరు మండలం సౌతఆములూరు గ్రామంలో సర్వే నెంబర్లు 6ఏ, 6సీలలో 4.77 ఎకరాలు, సర్వే నెంబర్లు 5, 9, 6బీ, 4, 8లలో 8.81 ఎకరాల భూమి ఉంది. దేవస్థానం తరఫున ఈ భూములను లీజుకు ఇచ్చి ఉన్నారు. అయితే, ఈ భూములకు దిగువన పేదల ఇళ్ల కోసం 1 ఎకరా 30 సెంట్లలో జగనన్న లే అవుట్‌ వేశారు. ఈ లే అవుట్‌కి రోడ్డు కోసం రంగనాథస్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాల భూమిని ఆక్రమించేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఒక ఎకరా భూమి రూ.50లక్షలపైనే  పలుకుతోంది. అక్రమంగా స్వామి వారి భూముల్లో రోడ్డు వేయడం వల్ల రంగనాథస్వామికి దాదాపు రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. 


కంచె వేసినా...


రంగనాథస్వామి ఆలయ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అధికార పార్టీ అండతో గుత్తేదారులు ఈ దారుణానికి ఒడిగట్టారనే విమర్శలు ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల మేరకు దేవస్థానం భూములను ప్రభుత్వం ఎలాంటి అవసరాలకు తీసుకోకుడదు. అయితే, ఇందుకు విరుద్దంగా సౌతఆములూరులో నడుస్తోంది. దేవస్థానం భూమిలో అక్రమంగా వేస్తున్న రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుని దేవస్థానం తరపున కంచె వేసినా కాంట్రాక్టరు తరఫున వైసీపీ నాయకులు దానిని తొలగించి రోడ్డు పనులు చేయిస్తున్నారు. స్వామివారి భూముల ఆక్రమణపై కొంతమంది నిలదీసినా తనకు ఓ ప్రజాప్రతినిధి అండ ఉందని చెబుతుండటం గమనార్హం. భూముల ఆక్రమణపై ఇటీవల రంగనాథస్వామి దేవస్థానం చైర్మన ఇ.శివకుమార్‌, ఈవో వెంకటేశ్వర్లుతోపాటు మాజీ చైర్మన మంచికంటి సుధాకర్‌లతో పాటు బీజేపీ నాయకులు ఇటీవల కలెక్టర్‌, ఎస్పీ, దేవదాయ శాఖ ఏసీ, తోటపల్లిగూడూరు సీఐలకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారుల్లో చలనం లేకపోవడంతో పనులు మాత్రం యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం స్పందించి రంగనాథుడి భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

Read more