ఆర్‌ అండ్‌బీలో ఉన్నతాధికారుల విచారణ

ABN , First Publish Date - 2022-09-17T05:43:04+05:30 IST

ఆర్‌అండ్‌బీ నెల్లూరు సర్కిల్‌ కార్యాలయంలో నెలకొన్న వివాదాలపై ఎట్టకేలకు రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించారు.

ఆర్‌ అండ్‌బీలో ఉన్నతాధికారుల విచారణ
నెల్లూరు : సర్కిల్‌ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న ఆర్‌అండ్‌బీ ఉద్యోగులు

ఒకే అంశంతో విచారణ ముగింపు?


నెల్లూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ఆర్‌అండ్‌బీ నెల్లూరు సర్కిల్‌ కార్యాలయంలో నెలకొన్న వివాదాలపై ఎట్టకేలకు రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించారు. ఉద్యోగోన్నతులు ఇచ్చి మళ్లీ డిమోషన్‌ చేసినందుకు నిరసనగా వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు గడిచిన 8 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. నెల్లూరులోని ఎస్‌ఈ కార్యాలయంలో మధ్యాహ్నం భోజన సమయంలో ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ఉద్యోగులకు రెండు నెలల నుంచి జీతాలు పెట్టకపోవడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ నెలలో సర్కిల్‌ కార్యాలయంలోని మిగిలిన ఉద్యోగులకు కూడా జీతాలు అందలేదు. ఈ నేపథ్యంలో సర్కిల్‌ కార్యాలయంలో నెలకొన్న వివాదాలపై విచారణ జరిపేందుకు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) వేణుగోపాల్‌రెడ్డి శుక్రవారం నెల్లూరుకు వచ్చారు. ఆయనతో పాటు డిప్యూటీ ఈఎన్‌సీ అరుణాదేవి, ఈఈ అడ్మిన్‌ నవీన్‌, మరికొంత మంది అధికారులు విచారణ బృందంలో ఉన్నారు. మొదట ఆందోళన చేస్తున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్లతో ఏం జరిగిందన్న వివరాలు తెలుసుకున్నారు. తర్వాత గతంలో ఎస్‌ఈ ఉన్న గూడూరు ఈఈ రామాంజనేయులు, సెలవులో ఉన్న డిప్యూటీ ఎస్‌ఈ సురే్‌షబాబు, ప్రస్తుత ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ మురళీకృష్ణలను ఆర్‌అండ్‌ అతిథి గృహంలో విచారించారు. అనంతరం సర్కిల్‌ కార్యాలయంలోని పలు రికార్డులు స్వాధీనం చేసుకొని తీసుకెళ్లారు. కాగా విచారణ బృందం వచ్చినప్పటికీ ఎనిమిదో రోజు కూడా వర్క్‌ఇన్‌స్పెక్టర్లు ఆందోళన చేయడం గమనార్హం. 


విధుల్లో చేరిన ఎస్‌ఈ మాధవి

దీర్ఘకాలిక సెలవులో ఉన్న ఆర్‌అండ్‌బీ రెగ్యులర్‌ ఎస్‌ఈ సుకన్య మాధవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జూలైలో గుంటూరు నుంచి నెల్లూరు ఎస్‌ఈగా ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది. విధుల్లో చేరిన మొదటి రోజే సెలవుపై వెళ్లారు. గడువు ముగిసినా సెలవును పొడగించుకోవడంతో ఇక నెల్లూరుకు రారని ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు ఈఎన్‌సీ బృందం విచారణకు వచ్చిన రోజునే తిరిగి విధుల్లో చేరడం గమనార్హం. కాగా విధుల్లో చేరిన వెంటనే సర్కిల్‌ కార్యాలయంలోని ఉద్యోగులతో సుకన్య మాధవి సమావేశమయ్యారు. కోర్టు కేసులపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆమె సిబ్బందికి సూచించారు. 

Updated Date - 2022-09-17T05:43:04+05:30 IST