పందుల తరలింపుపై రగడ!

ABN , First Publish Date - 2022-11-30T23:32:16+05:30 IST

పట్టణంలో బుధవారం తెల్లవారు జామున మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది చేపట్టిన పందుల పట్టివేతలో రగడ నెలకొంది. పందుల పెంపకందారులకు మద్దతుగా వాహనాన్ని అడ్డుకొన్న అధికార పార్టీకి చెందిన 20వ వార్డు కౌన్సిలర్‌ సూరా భాస్కర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

పందుల తరలింపుపై రగడ!
కౌన్సిలర్‌ సూరా భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

ఆత్మకూరు, నవంబరు 30 : పట్టణంలో బుధవారం తెల్లవారు జామున మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది చేపట్టిన పందుల పట్టివేతలో రగడ నెలకొంది. పందుల పెంపకందారులకు మద్దతుగా వాహనాన్ని అడ్డుకొన్న అధికార పార్టీకి చెందిన 20వ వార్డు కౌన్సిలర్‌ సూరా భాస్కర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తొలుత ఆయన పెంపకందారులకు ముందుగా నోటీసులు ఇవ్వకుండా, వారికి పట్టణానికి దూరంగా కేటాయించిన స్థలంలో సరైన వసతులు కల్పించకుండా పందులను తరలించేందకు ప్రయత్నించడం ఏమిటని వాదనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు సూరా భాస్కర్‌రెడ్డిని, కొందరు పందుల పెంపకందారులను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సూరా భాస్కర్‌రెడ్డిపై బైండోవర్‌ కేసు నమోదు చేసి వదిలి వేశారు. మున్సిపల్‌ అధికారులు సుమారు 150 పందులను పట్టుకుని బయట ప్రాంతాలకు తరలించారు. మరో రెండు మూడు రోజుల్లో పందులను పూర్తి స్థాయిలో దూర ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు.

పందుల పట్టివేతను అడ్డుకోవడం సబబు కాదు

ప్రజల విన్నపం మేరకు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే ఆదేశాలనుసారం అధికారులు పందులను తరలించేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో కౌన్సిలర్‌ సూరా భాస్కర్‌రెడ్డి అడ్డుకోవడం ఎంత మాత్రం సబబు కాదని పలువురు వైసీపీ మున్సిపల్‌ కౌన్సిర్లు, నేతలు ఖండించారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ షేక్‌ సర్ధార్‌, వైసీపీ పట్టణ కన్వీనర్‌ అల్లారెడ్డి ఆనందరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పట్టణ ప్రజల ఆరోగ్య దృష్ట్యా పందులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపడితే అడ్డుకోవడం సరికాదన్నారు. అతనిపై పార్టీపరంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. పందులపెంపకందారులకు ఐదు ఎకరాల్లో ఇప్ప టికే 70 ప్లాట్లు ఏర్పాటు చేసి ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో సిండికేట్‌ ఫార్మర్స్‌ సొసైటీ చైర్మన్‌ నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, కౌన్సిలర్లు మొలబంటి రాజశేఖర్‌, శివారెడ్డి, షేక్‌ మహబూబ్‌బాషా, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:32:41+05:30 IST

Read more