ప్రైవేటు సంస్థలకు జెన్‌కోను కట్టబెట్టవద్దు

ABN , First Publish Date - 2022-02-17T04:46:56+05:30 IST

విద్యుత్‌ ఉత్పత్తిలో సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మించిన జెన్‌కో థర్మల్‌ కేంద్రాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టవద్దని జెన్‌కో ఉద్యోగులు, కార్మికులు పేర్కొన్నారు.

ప్రైవేటు సంస్థలకు జెన్‌కోను కట్టబెట్టవద్దు
ఆందోళన చేస్తున్న జెన్‌కో ఉద్యోగులు, కార్మికులు

ముత్తుకూరు, ఫిబ్రవరి 16: విద్యుత్‌ ఉత్పత్తిలో సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మించిన జెన్‌కో థర్మల్‌ కేంద్రాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టవద్దని జెన్‌కో ఉద్యోగులు, కార్మికులు పేర్కొన్నారు. నేలటూరులోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(జెన్‌కో) వద్ద ఉద్యోగులు, కార్మికులు బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడాబాబుల చేతికి జెన్‌కో థర్మల్‌ కేంద్రం వెళ్లకుండా అడ్డుకోవడానికి పోరాటం చేయాలన్నారు. అనంతరం రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్‌ రంగానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వమే థర్మల్‌ కేంద్రాలను నడిపితే ప్రజా సంక్షేమం బాగుంటుందన్నారు. జెన్‌కో ఇంజనీర్ల ప్రతిభ, ఉద్యోగులు, కార్మికుల నిరంతర శ్రమతో ఉన్నత ప్రమాణాలతో పనిచేస్తున్నాయన్నారు. ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో లేనిపోని కారణాలు చూపి, జెన్‌కో నష్టాల్లో ఉందని చెబుతున్నారన్నారు.  విద్యుత్‌ ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రభుత్వమే ఇబ్బందులు పడుతుందన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకు ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెన్‌కో ఉద్యోగుల జేఏసీ నాయకులు నందకుమార్‌, చెంగయ్య, అనంత, కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక జేఏసీ నాయకులు గాలి అంకయ్య, రవి, ప్రభాకర్‌, రవీంద్ర, జెన్‌కో ఇంజనీర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-17T04:46:56+05:30 IST