పెళ్లి బాజా మోగింది!

ABN , First Publish Date - 2022-11-30T23:46:39+05:30 IST

మూఢాల కారణంగా మూడు నెలలుగా మూగబోయిన పెళ్లి బాజాలు డిసెంబరులో మోగనున్నాయి.

పెళ్లి బాజా మోగింది!

నెల్లూరు (సాంస్కృతికం) నవంబరు 30 : మూఢాల కారణంగా మూడు నెలలుగా మూగబోయిన పెళ్లి బాజాలు డిసెంబరులో మోగనున్నాయి. మొదటివారం నుంచే మూడు వారాలపాటు శుభ ముహూర్తాలు ఉండటంతో వేలాది జంటలు వేద మంత్రాల సాక్షిగా ఒక్కటవనున్నాయి. డిసెంబరు 1, 2, 4, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీలలో మొత్తం 12 రోజులపాటు ముహూర్తాలు ఉన్నాయి. ఈ రోజుల్లో జిల్లావ్యాప్తంగా సుమారు ఏడు వేల వివాహాలు జరుగుతున్నట్లు వ్యాపార వర్గాల అంచనా. వివాహం కోసం కట్న కానుకలు, బంగారం, వస్త్రాలు, కల్యాణ మండపాలు, పూల డెకరేషన్లు, ఫొటోగ్రఫీ, పురోహితులు, బజాభజంత్రీలు, భోజనాల కేటరింగ్‌, విద్యుత్‌ అలంకరణలు, రవాణా ఖర్చులు, సంగీత కార్యక్రమాలు, ఇలా అన్నీ రకాలు కలుపుకుంటే ఈ 12 రోజులలోనే దాదాపు రూ.50కోట్ల వ్యాపారం జరగనుంది. వధూవరులకు మొత్తం ఖర్చులో 20 శాతం ఆదాయం ఉంటే మిగిలిన 80 శాతం పెళ్లి ఖర్చులకే సరిపోతుంది.

మండపాలన్నీ ఫుల్‌

సాధారణంగా ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాల్లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగతాయి. అయితే, మూఢం కారణంగా ‘మాంగళ్యం తంతునానేనా’కు బ్రేక్‌ పడింది. అక్టోబరు, నవంబరుల్లో మంగళవాయిద్యాల ముచ్చటే లేకుండా పోయింది. నవంబరు నెలాఖరుతో మూఢం ముగియడంతో కొత్త జంటలు వివాహ వేడుకలకు సిద్ధమయ్యాయి. పెళ్లిళ్ల కోసం ఆలయాలు, సత్రాలు, కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లు బుక్‌ అయిపోయాయి. ఒక్కో మండపంలో రోజుకు రెండు, ఆలయాల్లో 20 నుంచి 30 వరకు పెళ్లిళ్లు జరగనున్నాయి.

పెరిగిన ఖర్చులు

గతంలో కంటే ఈ ఏడాది డిమాండ్‌ దృష్ట్యా కల్యాణం మండపాల చార్జీలు దాదాపు 40 శాతం పెరిగాయి. అయినా మండపాలు దొరక్క వేలాది మంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పూలు, విద్యుద్దీప అలంకరణలకు దాదాపు 50 శాతం పెరిగింది. భజంత్రీలు కనీసం రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. వాయిద్యకారుల డిమాండ్‌ పెరగడంతో అవసరాల దృష్ట్యా పక్కల జిల్లాల నుంచి రప్పించుకుంటున్నారు. ఇక పురోహితులు కనీసం రూ.5వేల నుంచి 50వేలకుపైగా డిమాండ్‌ చేస్తున్నారు. వివాహ భోజనాలు, విందు భోజనాలు కోసం హోటళ్లు, కేటరింగ్‌ నిర్వాహకులు కూడా ధరలను పెంచేశారు. శాఖాహార భోజనం ఒక్కో ప్లేటు కనీసం రూ.200 నుంచి 400పైగా వసూలు చేస్తున్నారు. మాంసాహార భోజనానికి అయితే రూ.350 నుంచి 1200 వరకు పలుకుతోంది. ఫొటో, వీడియో షూటింగ్‌లపైనా 10 శాతం నుంచి 25 శాతం రేట్లు పెంచేశారు. వివాహ సంగీత్‌ కార్యక్రమాలకు కనీసం రూ.50వేల నుంచి ఒక లక్షకుపైగా డిమాండ్‌ చేస్తున్నారు. రవాణా చార్జీలూ తడిసి మోపెడు అవుతోంది. వివాహ సీజన్‌ కావడంతో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం వస్త్ర, బంగారం, అలంకరణ సామగ్రి దుకాణాలు, బ్యూటీపార్లర్లు కిటకిటలాడుతున్నాయి.

Updated Date - 2022-11-30T23:46:39+05:30 IST

Read more