వైరస్‌ వీడుతోంది.. పర్యాటకం పిలుస్తోంది!

ABN , First Publish Date - 2022-09-27T05:45:33+05:30 IST

రెండేళ్లు కరోనా విజృంభణ. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే వణుకు. ఎటు నుంచి మహమ్మారి కబళిస్తుందోనని భయం. ఇలా రెండేళ్లు గడిచిపోయాయి.

వైరస్‌ వీడుతోంది..  పర్యాటకం పిలుస్తోంది!
రాపూరు మండలంలో పెంచలకోన క్షేత్రం

 జిల్లాలో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు

ఇప్పుడిప్పుడే జనం పరుగులు

మౌలిక సదుపాయాలు లేక డీలా

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం


నెల్లూరు (సాంస్కృతికం), సెప్టెంబరు 26 : రెండేళ్లు కరోనా విజృంభణ. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే వణుకు. ఎటు నుంచి మహమ్మారి కబళిస్తుందోనని భయం. ఇలా రెండేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే వైరస్‌ తగ్గుముఖం పడుతోంది. పర్యాటక ప్రియులు తమ ఇష్ట ప్రదేశాలను సందర్శించేందుకు ఇప్పుడిప్పుడే ఉవ్విళ్లూరుతున్నారు. ఆలయాలకూ పోటెత్తుతున్నారు. ఇటీవల నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. పర్వదినాల్లో ప్రార్థనా మందిరాలూ కిక్కిరిసిపోతున్నాయి. అయితే, పర్యాటక ప్రదేశాల్లో సౌకర్యాలు లేమి ప్రజలను బాధిస్తోంది. జిల్లాలో పేరెన్నికగల పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఉదయగిరి ప్రాంతం. ఇక్కడ కొండపై దుర్గం, శ్రీకృష్ణదేవరాయుల కోట తదితర ప్రాంతాలు ఉన్నాయి. అయితే, దుర్గం అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమవుతూనే ఉంది కానీ అభివృద్ధి పరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సోమశిల జలాశయం పరిస్థితీ అంతే. పర్యాటకులను ఈ ప్రాంతం ఎంతగానో ఆకట్టుకుంటున్నా మౌలిక సదుపాయాలు లేవు.   ఇక్కడకు తరలివచ్చే పర్యాటకులు ఒక రోజు గడిపేందుకు విశ్రాంతి గదులు కరువయ్యాయి. గతంలో రూ.కోట్లతో నిర్మించిన భవనాలు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయి. అతి పొడవైన మట్టికట్టలో ఆసియాలోనే పేరెన్నిక గల కండలేరులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ బోటు షికారు పర్యాటకులకు కలగానే మారింది. మైపాడు, కొత్తకోడూరు, రామాయపట్నం, తుమ్మలపెంట బీచ్‌లకు సెలవురోజుల్లో పర్యాటకులు పోటెత్తుతారు. ఇక్కడా వసతులు కరువయ్యాయి. మైపాడులో టూరిజం రిసార్ట్స్‌ ఉన్నా పర్యాటకులను ఆకట్టుకోలేక పోతోంది. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలను నిలువరించేందుకు తీసుకుంటున్న చర్యలూ శూన్యమవుతున్నాయి. ఇక పుణ్యక్షేత్రాలైన పెంచలకోన, వేదగిరి, మాలకొండ ప్రాంతాల్లో నృసింహస్వామి ఆలయాలు నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఇక జొన్నవాడ కామాక్షితాయి, నెల్లూరులో రంగనాథస్వామి, రాజరాజేశ్వరి, ఇరుగాళమ్మ, కావలిలో కలుగోళ శాంభవి ఆలయాలతోపాటు నెల్లూరులో బారాషహీద్‌ దర్గా, వెంకటాచలం మండలంలో కసుమూరు దర్గా, ఏఎస్‌పేట దర్గాలకూ భక్తులు తరలివస్తుంటారు. ఇలా జిల్లాలో ధార్మిక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవడంతో పర్యాటకులు నిరుత్సాహ పడుతున్నారు.


 ఎకో టూరిజం కింద అభివృద్ధి

జిల్లాలో ఏకో టూరిజం అభివృద్ధి ప్రతిపాదనలు పంపామని జిల్లా పర్యాటక శాఖ అధికారి కనకదుర్గా భవానీ తెలిపారు. ఆత్మకూరు, ఏఎ్‌సపేట, సంగం బ్యారేజీలను కలుపుతూ టూరిజం అభివృద్ధికి రూ.6.38క ోట్లకు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. ఉదయగిరి దుర్గం అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు పంపామన్నారు. వేదగిరి నరసింహ కొండ, జొన్నవాడ ఆలయాలు కలుపుతూ పర్యాటక అభివృద్ధికి రూ.4.06కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. స్వదేశీ దర్శన్‌ కింద వింజమూరు మండలం గృహమల్లేశ్వరస్వామి ఆలయం వద్ద రూ.2కోట్లతో మౌలిక వసతులకు ప్రతిపాదనలు పంపామన్నారు. నెల్లూరు పెన్నా కొత్త వారధి వద్ద కూడా పర్యాటకులను ఆకర్షించేందుకు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు రూ.10కోట్లతో ఇరుకళల పరమేశ్వరి ఆలయం వద్ద గణేష్‌ నిమజ్జనం ఘాట్‌ను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు.  Read more