పగలోరకం.. రాత్రోరకం...!

ABN , First Publish Date - 2022-12-13T00:38:02+05:30 IST

వైసీపీ నేతల్లో వింత వైఖరి కనిపిస్తోంది. పైకి జై జగనన్న అంటున్నా లోలోన మాత్రం తమదైనశైలిలో వ్యవహరిస్తున్నారు.

    పగలోరకం..  రాత్రోరకం...!

నెల్లూరు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ నేతల్లో వింత వైఖరి కనిపిస్తోంది. పైకి జై జగనన్న అంటున్నా లోలోన మాత్రం తమదైనశైలిలో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయం తరుముకొస్తున్న నేపథ్యంలో అధిష్ఠానం పట్ల మరింత విశ్వసనీయతను, గెలుపు పట్ల మరింత ధీమాను వ్యక్తపరచాల్సిన నాయకులు అందుకు భిన్నంగా వ్యవహరించడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఉదయం నుంచి రాత్రి వరకు గడప గడపకు జై జగనన్న అంటూ నినాదాలు చేసే నాయకులు చీకటిపడే సరికి ఆ.. ఇదొక పార్టీనా!? అంటూ తీస్కారంగా మాట్లాడుతున్నారు. రానున్న ఎన్నికల్లో టికెట్టు దక్కదన్న విషయం స్పష్టంగా అర్థమైన కొందరు పక్కదారులు వెతుక్కుంటున్నారు. ఇంకొందరైతే రానున్న ఎన్నికల్లో పోటీ చేయమలేమని అధినాయకత్వానికి తెగేసి చెబుతున్నారు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు ప్రజా సమూహంలోకి చేరడంతో కొద్ది రోజులుగా జిల్లా వైసీపీ నేతల మాటలు, అంతర్గత వ్యవహారాలే ప్రజల్లో ప్రధాన చర్చనీయాంశంగా చేరింది.

ఉడికిపోతూ కొందరు..

ఆయా నియోజకవర్గాల్లో వారు బలమైన నాయకులు. పైగా పలు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలిచినవారు కూడా. ప్రస్తుతం సిటింగ్‌ ఎమ్మెల్యేల హోదాలో ఇంటింటికి జగనన్న పథకాలను.. ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరు జగనన్న ప్రతినిధులుగా ప్రజల్లో ఉంటున్నారు. ఆయన గురించి గొప్పగా ప్రచారం చేస్తున్నారు. అయితే రాత్రి అయ్యే సరికి వీరి అభిప్రాయాలు మారుతున్నాయి. అంతరంగీకులు, సహచర పార్టీ నాయకుల ముందు తమ మనసులోని మాట బయటపెడుతున్నారు. ఎంత చేసినా పార్టీలో గుర్తింపు లేదని వాపోతున్నారు. రేయింబవళ్లు జనంలో తాముంటే వెనుకబడి ఉన్నామని సర్వే నివేదికలు చదివి వినిపిస్తున్నారని రగిలిపోతున్నారు. పార్టీ గెలుపు పట్ట అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

ఆ ముగ్గురికి డౌటే!

జిల్లాలో ముగ్గురు సిటింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో టికెట్టు లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ప్రచారాన్ని బలపరిచే సంఘటనలు కూడా చోటుచేసుకొంటున్నాయి. వీరిని పక్కన పెట్టడం ఖాయమనుకునేలా ఇటీవల జగన్‌ జిల్లా నాయకులకు పరోక్ష సంకేతాలను కూడా పంపుతున్నారు. ఒక సీనియర్‌ నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి మరో నాయకుడికి జిల్లా బాధ్యతలు ఇవ్వడంతోపాటు నియోజకవర్గంలో ప్రజలతో మమేకం కావాలని ఆదేశించడం వైసీపీ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గంలో ఆ ఇద్దరు నాయకుల మధ్య అంతర్గతంగా పెద్ద యుద్ధం నడుస్తుంటడంపై ప్రచారాలకు మరింత బలం చేకూర్చుతోంది. ఇక వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి వీర విధేయుడిగా ఉన్న మరో ఎమ్మెల్యేకి కూడా ఈసారి టికెట్టు లేదనే సంకేతాలను జగన్‌ చాలా రోజుల క్రితమే ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే విషయాన్ని కూడా జగన్‌ ఓ నాయకుడికి స్పష్టం చేశారని, అయితే ఉన్న స్థానాన్ని వదిలి, స్థాయిని తగ్గించుకొని ఈ నియోజకవర్గానికి వెళ్లేందుకు ఆ నాయకుడు ఇష్టపడటం లేదని ప్రచారం. జగన్‌ అండ్‌ కో సర్వేలో దారుణంగా వెనుకబడిన మరో ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేకతకు తాను కారణం కాదని, ఇంతకాలం తన పక్కన ఉన్న అనుచరుడే అక్రమాలు, అవినీతికి కారణమని అధిష్ఠానానికి వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది. ఆ అనుచరుడు కూడా జిల్లా నాయకుల ఇంటింటికి వెళ్లి ఆ ఎమ్మెల్యే అవినీతి చిట్టాను బట్టబయలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జిల్లాలో ఏ నాయకుడి ఇంటి వద్దకు వెళ్లినా ఈ ఇద్దరి పంచాయతీ గురించే కథలు కథలుగా వినిపిస్తోంది. ఇలా రకరకాల కారణాలతో కొందరికి టికెట్టు గ్యారెంటీ లేదన్న అనుమానంతో నాయకులు రహస్యంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే కొత్త నాయకుల పేర్లు తెరముందుకు వస్తున్నాయి.

Updated Date - 2022-12-13T00:38:03+05:30 IST