పారిశుధ్య కార్మికుల పోరుబాట!

ABN , First Publish Date - 2022-02-24T03:57:18+05:30 IST

నెల్లూరు నగరంలో మున్సిపల్‌ కార్మికులు దశల వారీ ఉద్యమబాట పట్టారు. త్వరలో సమ్మెకు సై అంటూ ఇప్పటికే అధికారులకు స్పష్టతనిచ్చారు.

పారిశుధ్య కార్మికుల పోరుబాట!
మస్టర్‌ పాయింట్‌ వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులు

మస్టర్‌ పాయింట్ల వద్ద కొనసాగుతున్న నిరసన

నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు

త్వరలో కలెక్టరేట్‌, కార్పొరేషన్ల ముట్టడి

తమ డిమాండ్లు పరిష్కరించుకుంటే సమ్మె 

నెల్లూరు(సిటీ), ఫిబ్రవరి 23 : నెల్లూరు నగరంలో మున్సిపల్‌ కార్మికులు దశల వారీ ఉద్యమబాట పట్టారు. త్వరలో సమ్మెకు సై అంటూ ఇప్పటికే అధికారులకు స్పష్టతనిచ్చారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే కార్మిక చట్టాలు ఎన్‌ఎంసీలో అమలు చేయడం లేదంటూ కొన్ని రోజులుగా మస్టర్‌ పాయింట్ల వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులు గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. త్వరలో కలెక్టరేట్‌, కార్పొరేషన్‌ కార్యాలయాలను ముట్టడిస్తామని, అప్పటికీ తమ డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె చేసేందుకు వెనకాడబోమని ప్రకటించారు. 

నెల్లూరు నగర పాలక సంస్థ పారిశుధ్య విభాగంలో సుమారు 1,500 మంది కార్మికులు  పని చేస్తున్నారు. వీరంతా నిత్యం రోడ్లు శుభ్రం చేయడంతో పాటు, డ్రైనేజీ కాలువల్లో మురుగు తీయడం, నిత్యం 300 టన్నుల చెత్తను డప్పింగ్‌ యార్డులకు తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే వీరికి కార్మిక చట్టాలు వర్తింపచేయకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రధానంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మరణించిన కార్మికుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా కింద అందచేసే రూ.10 లక్షలను ఈ ప్రభుత్వం  రూ.2 లక్షలకు కుదించడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకున్నారు. దీనికి తోడు అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు వాపోతున్నారు. అలాగే 30 ఏళ్ల క్రితం ఉన్న కార్మికుల సంఖ్యనే ఇప్పటికీ అమలు చేస్తూ పనిభారం పెంచడం, గతంలో రెండు సార్లు వేసే మస్టర్లను ఇప్పుడు 4 సార్లు వేయడాన్ని తప్పుబడుతున్నారు. 60 ఏళ్లు నిండిన 110 మంది కార్మికులకు 9 నెలలుగా జీతాలు నిలిపివేయడం, విధులపై అధికారులను ప్రశ్నించినందుకు ఓ కార్మికుడ్ని 9 నెలలుగా పనిలోకి రానివ్వకుండా అడ్డుకోవడం, క్యాజువల్‌, పండుగ సెలవులను పూర్తిగా తీసేయడాన్ని ఆక్షేపిస్తున్నారు. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించడంతో పాటు తమను పర్మినెంట్‌ చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తూ దశల వారీ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యక్ష నిరసనలతో తమ డిమాండ్లను పరిష్కరించాలని కార్పొరేషన్‌ ఉన్నతాధికారులకు సూచిస్తుండగా వారంతా మౌనం పాటిస్తున్నారని కార్మిక సంఘం నేతలు అంటున్నారు. ఇదే తంతు కొనసాగితే తదుపరి కలెక్టరేట్‌, కార్పొరేషన్‌ కార్యాలయాల ముట్టడి, సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే నెల్లూరులో పారిశుధ్య పరిస్థితేమిటన్నది మున్సిపల్‌ యంత్రాంగంలో ఆందోళన రేపుతోంది. ఒక్కసారిగా 1500 మంది కార్మికులు సమ్మెలోకి వెళ్తే నిత్యం రోడ్డెక్కే 300 టన్ను చెత్త సేకరణ సంగతేంటి? ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పుడిప్పుడే క్లాప్‌లో నిర్వహిస్తున్న ఇంటింటా చెత్తసేకరణ ప్రక్రియ కొనసాగింపు ఎలా? నివాసాల మధ్య మురుగు కాలువల్లో పూడికతీత ఏం చేయాలన్నది  అధికారులను వేధిస్తున్న ప్రశ్న. 


డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె తఽథ్యం

కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఏ క్షణమైన సమ్మెలోకి వెళ్తాం. పారిశుధ్య కార్మికుల సంక్షేమమే ముఖ్యం. ఇప్పటికే అనేక దఫాలుగా వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నిరసనలు జరుగుతున్నాయి.

- కత్తి శ్రీనివాసులు, మున్సిపల్‌ కార్మికుల సంఘం నేత



Updated Date - 2022-02-24T03:57:18+05:30 IST