ఎవర్ని చంపుతారో.. ఏం దోచుకెళతారో!?

ABN , First Publish Date - 2022-09-30T04:40:44+05:30 IST

జిల్లావ్యాప్తంగా గడిచిన నెల రోజుల్లో సుమారు పదికిపైగా హత్యలు జరిగాయి. గతంలో హత్య జరిగింది అంటే కొన్ని నెలలపాటు ఆ ఘటన గురించే ప్రజలు మాట్లాడుకునేవారు.

ఎవర్ని చంపుతారో..  ఏం దోచుకెళతారో!?

జిల్లాలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు.. పెరుగుతున్న నేరాలు ఘోరాలు

నెల రోజుల్లో పది మందికిపైగా హత్యలు

చిన్న విషయాలకే ప్రాణాలు తీస్తున్న వైనం

రోడ్లపై ప్రజలను కొట్టి నగలు, నగదు దోపిడీ చేసే భీతావహ వాతావరణం

పోలీసుల పనితీరుపై విమర్శల వెల్లువ

అమాత్యుల మెప్పు కోసం విధులను గాలికి వదిలేశారా!?

పాతుకుపోయిన అధికారులతో స్పెషల్‌ బ్రాంచ నిర్వీర్యం


రాత్రి కాదు.. పట్టపగలే రోడ్లపై తిరగాలంటే భయం. ఎవరు ఏ వైపు నుంచి వచ్చి దాడులు చేస్తారో తెలియదు.  కనీసం ఇంట్లో ప్రశాంతంగా కంటి మీద కునుకు తీయాలన్నా వణికిపోవాల్సిన పరిస్థితులు. ప్రశాంత నెల్లూరుకు ఏమయ్యింది. కొంతకాలంగా ఎందుకు నెత్తురోడుతోంది. జేబులో కత్తులు పెట్టుకుని తిరిగే సంస్కృతి ఎందుకొచ్చింది. చిన్న చిన్న కారణాలతోనే హత్యలు చేసే ఉన్మాదం ఎందుకు పెరిగింది?. అశాంతి, అరాచకం పెరగడం వెనుక వైఫల్యం ఎవరివది? ఒకప్పుడు జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉండేది. ఇప్పుడెలా ఉంది? హ్యతలు, దోపిడీలు, హత్యాయత్నాలు పెరగడం వెనుక ఎవరి నిర్లక్ష్యం? ఇలాంటి ఎన్నో ఈ ప్రశ్నలకు పోలీసులే సమాధానం ఇవ్వాలి. 


నెల్లూరు, ఆంధ్రజ్యోతి. సెప్టెంబరు 29 : జిల్లావ్యాప్తంగా గడిచిన నెల రోజుల్లో సుమారు పదికిపైగా హత్యలు జరిగాయి. గతంలో హత్య జరిగింది అంటే కొన్ని నెలలపాటు ఆ ఘటన గురించే ప్రజలు మాట్లాడుకునేవారు. కానీ, ఇప్పుడు మూడు రోజులకో హత్య జరుగుతుండటంతో హడలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. చిన్న చిన్న కారణాలతోనే మనుషుల ప్రాణాలు తీసే కసాయి మనస్తత్వం క్రమంగా పెరుగుతోంది. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి సీఏఎం స్కూలు దర్గా వద్ద సుల్తాన అనే వ్యక్తిని ఇద్దరు పాత నేరస్థులు కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. దర్గా ప్రాంతంలో మద్యం తాగొద్దని చెప్పినందుకే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.

ఈ నెల 11వ తేది తెలుగుగంగ కాలనీలో రమణారెడ్డి, శ్రీకాంతలను పట్టపగలే ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. మద్యం కొనుగోలు చేసే సందర్భంగా జరిగిన చిన్న ఘటన కారణంగా మరుసటి రోజు ఆ ఇద్దరిని హత్య చేశాడు.

8వ తేది రాత్రి ఎన్టీఆర్‌ నగర్‌లో సురేష్‌ అనే వ్యక్తి టీ షాపు పెట్టే సందర్భంగా స్నేహితులకు విందు ఇచ్చాడు విందులో ఇద్దరు అన్నాదమ్ములను.. అరమోడా అని గేళిగా మాట్లాడారన్న కసితో విందు ఇచ్చిన సురే్‌షనే చంపేశారు. 

ఇవే కాదండోయ్‌.. డబ్బు, విలువైన వస్తువల కోసం ఇంట్లో ఉన్నవారినీ పొట్టన పెట్టుకుంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లో దారినపోయే వ్యక్తులను కత్తులతో బెదిరించి నగదు, నగలు దోచుకుపోతున్నారు. మద్యం షాపుల వద్ద కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు కత్తులు చూపించి  డబ్బులు లాక్కొంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో రోజుకో ఘటన వెలుగులోకి వస్తోంది. వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. జిల్లాలో ఒక్కసారిగా ఈ ఉన్మాదం ఎందుకు పెరిగింది? అనే ప్రశ్నకు ప్రజల నుంచి పలు సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రమాదకర మాదకద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిన కారణంగానే ఉన్మాదం పెరుగుతోందని అంటున్నారు. గంజాయి తాగే సమయంలో ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తాడో ఆ మత్తు దిగిపోయే వరకు అదే ఆలోచనలో ఉంటాడు. ఉన్మాదిగా మారుతాడు. ఆ కారణంగానే గంజాయిని ప్రమాదకర మాదకద్రవ్యాల జాబితాలో చేర్చారు. గంజాయి వాడకాన్ని నిషేధించారు. కానీ  జిల్లాలో గంజాయి విపరీతంగా చెలామణి అవుతోంది. 


పోలీసులు ఏం చేస్తున్నట్టు?


జిల్లాలో ఏదైనా ఘటన జరిగిన వెంటనే ప్రజల నుంచి వచ్చే మాట.. పోలీసులు ఏం చేస్తున్నారు? అలాగే గతంలో ఇలా లేదబ్బా అనే మాట కూడా వినిపిస్తోంది. జరుగుతున్న నేరాలు, పెరుగుతున్న ఉన్మాదాలను ఆధారంగా గమనిస్తే జిల్లాలో పోలీసింగ్‌ వ్యవస్థ విధి నిర్వహణలో బలహీనంగా ఉందనే చెప్పాలి. ఏడాది క్రితం రాత్రి 10 గంటలు దాటితే ప్రతి ప్రధాన రోడ్డుపైనా పోలీసులు కనిపించేవారు. ఆ సమయంలో వెళ్లేవారిని ప్రశ్నించేవారు.  ఈ సమయంలోనే నేరగాళ్లు పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది.  రాత్రింబవళ్లు అన్న తేడా లేకుండా బార్లతోపాటు బెల్టుషాపులు నిర్వహించే ఇళ్లు, దుకాణాల తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటున్నాయి. వీరిని అడిగే వారే లేరు. గతంలో రాత్రి 11 గంటలు దాటితే పోలీసు వాహనాల సైరనతో నగరం అల్లాడేది. కానీ అవన్నీ మూగబోయాయి. రాత్రి గస్తీలు నామమాత్రం అయ్యాయి. రాత్రి 11 గంటలకే గస్తీ ముగించేస్తున్నారు. 

నగర విస్తీర్ణం, జనాభాను ఆధారంగా గమనిస్తే పోలీస్‌ స్టేషన్లు, సిబ్బంది కొరత ఉంది. కానీ ఉన్న ఆ సిబ్బందిని కూడా రాజకీయ నాయకులు వాడుకోవడం ప్రజల దురదృష్టం. గతంలో మంత్రి కాన్వాయ్‌కి మాత్రమే పోలీసు బందోబస్తు ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్యేలకూ పోలీస్‌ కాన్వాయిలే. ఎమ్మెల్యే కాలుతీసి బయటపెడితే ముందు పోలీస్‌ జీప్‌ సైరన మోగిస్తూ వెళ్లాల్సిందే. నిబంధనలకు విరుద్ధంగా లేని వసతులను ఎమ్మెల్యేలు కోరుతున్నారో లేదా పోలీసు అధికారులే  వారి మెప్పు కోసం ఇలా చేస్తున్నారో కానీ దీని ఫలితం మాత్రం ప్రజలు అనుభవించాల్సి వస్తోంది. స్టేషనలోని సగం మంది పోలీసులు ఎమ్మెల్యేలు, నాయకులకు కాపలాగా సరిపోతుండగా, మిగిలిన సగం మంది సిబ్బంది రేయింబవళ్లు పనిచేయలేక కాడె పడేస్తున్నారు. ఫలితంగా నేరాలపై నిఘా కొరవడుతోంది. మరోవైపు స్పెషల్‌ బ్రాంచ పాత్ర నామమాత్రంగా తయారయ్యింది. ప్రజల మాటల్లో చెప్పాలంటే పాతుకుపోయిన అధికారులు, పంచాయితీలకే పరిమితమైన సిబ్బందితో ఈ విభాగం నిర్వీర్యంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో పూర్వపు శాంతియుత వాతావరణం కోసం పోలీస్‌ శాఖ స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. Read more