‘మాండస్‌’ నష్టం స్వల్పమే!

ABN , First Publish Date - 2022-12-13T23:40:28+05:30 IST

చెరువులకు గండ్లు, 11 రోడ్లు దెబ్బతినడం మినహా జిల్లాల్లో ఎక్కడా మాండస్‌ తుఫాన వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని కలెక్టర్‌ చక్రధర్‌బాబు స్పష్టం చేశారు.

‘మాండస్‌’ నష్టం స్వల్పమే!
గురివిందపూడిలో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రదర్‌బాబు

పొలాల్లో నీరు తగ్గితే నష్టాలపై సర్వే

400 చెరువుల్లో వంద శాతం నీరుంది

20న మరో తుఫాన.. జాగ్రత్తగా ఉండండి

కలెక్టర్‌ చక్రధర్‌బాబు

మనుబోలు, డిసెంబరు 13 : చెరువులకు గండ్లు, 11 రోడ్లు దెబ్బతినడం మినహా జిల్లాల్లో ఎక్కడా మాండస్‌ తుఫాన వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని కలెక్టర్‌ చక్రధర్‌బాబు స్పష్టం చేశారు. మండలంలోని గురివిందపూడి గ్రామంలో నీటమునిగిన వరినాట్లు, నార్లను మంగళవారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తుఫాన ప్రభావంతో పెద్ద నష్టం జరగలేదన్నారు. దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయించినట్లు చెప్పారు. తుఫాన రాక మునుపే వరినాట్లు వేయడంతో భారీ వర్షాలతో రైతులకు ఎంతో ఉపయోగకరమేనన్నారు. కొన్నిచోట్ల మాత్రమే నాట్లు, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయని, ఆ రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామన్నారు. జిల్లాలో 748 చెరువులు ఉండగా 400 చెరువులు 100శాతం నిండినట్లు చెప్పారు. పునరావాసకేంద్రాల్లో ఉంచిన కుటుంబాలకు రూ.2వేలు, రేషన బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. పొలాల్లో నీరు తగ్గాక దెబ్బతిన్న పంటలపై అధికారులతో సర్వే చేయించి నష్ట నివారణ చర్యలు చేపడతామన్నారు. ఈ నెల 20 నుంచి మరో తుఫాన హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆయన వెంట ట్రైనీ కలెక్టర్‌ విద్యాధరి, జిల్లా వ్యవసాయాధికారి సుధాకర్‌ రాజు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ అశోక్‌కుమార్‌, తహసీల్దారు సుధీర్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు మన్నెమాల సుధీర్‌ రెడ్డి, ఏడుకొండలు, శ్రీహరిరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-13T23:40:28+05:30 IST

Read more