మహిషాసురమర్ధినిగా అలరించిన కన్యకాపరమేశ్వరి

ABN , First Publish Date - 2022-10-05T02:54:14+05:30 IST

పట్టణంలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం అమ్మవారు మహిషా సురమర్ధనిగా భక్తులకు దర్శనమిచ్చారు. అ

మహిషాసురమర్ధినిగా అలరించిన కన్యకాపరమేశ్వరి
ఆత్మకూరు : మహిషాసూరమర్ధనిగా కన్యకాపరమేశ్వరి

ఆత్మకూరు, అక్టోబరు 4 :  పట్టణంలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం అమ్మవారు మహిషా సురమర్ధనిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అర్చకులు శ్రీవాసవీ అష్టోత్తరం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో అన్నపూర్ణాదేవి ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. ఉత్తర బలిజవీధిలోని జ్వాలా ముఖి ఆలయంలో మహిషాసురమర్ధినిగా అమ్మవారు శోభిల్లారు. అమ్మవారికి అభిషేకం, శ్రీదేవిఖడ్గమాల విశేష పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. తిరునాళ్లతిప్పలోని జ్ఞానసరస్వతీదేవి, కనకదుర్గాదేవిలు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 

సంగం : స్థానిక సంగమేశ్వరాలయంలో   మంగళవారం మహర్నవమి సందర్భంగా మహిషాసురమర్ధిని అలంకారంలో కామాక్షిదేవి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి ఆలయం చుట్టూ ఊరేగించారు.  ఈ కార్యక్రమానికి ఆమటి ఉదయభాను ఉభయకర్తగా వ్యవహరించారు. 


మహిషాసురమర్థినిగా కామాక్షితాయి


 భక్తులతో ఆలయం కిటకిట


బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు4: మండలంలోని జొన్నవాడ  లో మంగళవారం కామాక్షితాయి మహిషాసురమర్ధినిగా దర్శనమిచ్చారు. ఉదయం పుణ్యాహవచనం, కలశపూజ చేశారు. రాత్రి అమ్మవారికి అభిషేకం, కాళరాత్రి మహానవావరణ పూజల అనంతరం అమ్మవారికి అభిముఖంగా మహాకుంభం నివేదించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గుమ్మడికాయలు, టెంకాయలు కొట్టారు. తదుపరి కలశోధ్వాసనతో నవరాత్రి వేడుకలు ముగిశాయి. వేకువజామున 3 గంటలకు గర్భాలయంలో ఉగ్రరూపంతో కొలువుదీరిన కామాక్షితాయి మహిషాసురుణ్ణి వధించినట్లు కొలువుదీరిన ఉత్సవమూర్తిని దర్శించుకున్న భక్తులు ఆనందపరవశులయ్యారు. హైదరాబాదుకు చెందిన దివంగత కొండూరు సుబ్బారెడ్డి మనుమడు కే. మహీధర్‌రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.  బుచ్చి సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ కే. వీరప్రతాప్‌, తమ సిబ్బందితో ఆలయంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, ఏసీ,ఈవో డీ వెంకటేశ్వర్లు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలాగే బుచ్చిలోని కోదండరామస్వామి, కనకదుర్గమ్మ, శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి, కన్యకాపరమేశ్వరి, వేణుగోపాలస్వామి, దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయాలతోపాటు రేబాలలోని పుట్టాలమ్మ ఆలయం, బాబామందిరాల్లో నవరాత్రి వేడుకలు మంగళవారం ముగిశాయి. 


ఫ నేడు ఏకాంతసేవ


విజయదశమి సందర్భంగా  బుధవారం కామాక్షితాయి ఆలయంలో రాత్రి శమీపూజ, అశ్వవాహన గ్రామోత్సవం, అనంతర ఏకాంతసేవ జరుగుతాయని అర్చకులు తెలిపారు. ఈకార్యక్రమాలకు కాపులూరు విజయసేనారెడ్డి, జంగిమల్లి రాధాకృష్ణమూర్తి ఉభయకర్తలుగా వ్యవహరించనున్నారు.

 రాపూరు :   పెంచలకోనలో మంగళవారం ఆదిలక్ష్మి ధనలక్ష్మిగా, రాపూరులో కన్యకాపరమేశ్వరీదేవి, పోతుకొండ లో అంకమ్మ, శివాలయంలో  పార్వతీదేవి, విష్ణు ఆలయంలో మహాలక్ష్మి, విశ్వశాంతి ఆశ్రమంలో లలితాదేవి మహిషాసురమర్ధినిగా దర్శనమిచ్చారు. ఆశ్రమంలో విజయేశ్వరీదేవి మహా చండీహోమం నిర్వహించారు. పోతుకొండ అంకమ్మను మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆయన వెంట నిర్వాహకులు పాపకన్ను వేణురెడ్డి, తదితరులు ఉన్నారు.
Read more